త్రీమంకీస్ - 65

22 Dec, 2014 23:47 IST|Sakshi
త్రీమంకీస్ - 65

 డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 65
 
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
‘‘ఒబామా, బిన్ లాడెన్‌లు నా కోసం నక్కబొక్కలపాడులో ఎదురు చూస్తూంటారు. నేను గాడిదని ఎక్కి విమానాశ్రయానికి వెళ్ళాలి. అక్కడ విమానాన్ని లాగడానికి రోడ్డింజను సిద్ధంగా ఉందా?...’’
 ‘‘మా వాడ్ని చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇన్ని రోజులు మీరు ఏమయ్యారు?’’ మర్కట్ అడిగాడు.
 ‘‘నాస్త్తిక మహాసభలకి వెళ్ళి ఇవ్వాళే వచ్చాను.’’
 ‘‘మీ పేరు?’’
 ‘‘రామదాసు’’ ఆయన చెప్పాడు.
 ‘‘మనం వెంటనే కవాడీగూడా స్మశానానికి వెళ్ళాలి’’ రుధిర ఇంట్లోంచి బయటకి వచ్చాక కపీష్ చెప్పాడు.
 ‘‘అరె పాపం? వానర్‌కి ఏమైంది? ఇంకా సర్దుకోలేదా?’’ మర్కట్ ఆందోళనగా అడిగాడు.
 ‘‘ఏమీ కాలేదు. పోలీసులు మన కోసం వెదకని చోటు అదే. మనం అక్కడ ఉన్నామని తెలిసినా కొద్దిసేపట్లో కాల్చేస్తారనుకుని రారు. ఎక్కడో ఓ చోట దాక్కోవాలిగా’’ కపీష్ సూచించాడు.
 ‘‘మనం మా బాబాయ్ ఇంటికి వెళ్ళచ్చు. ఆయన శబరిమలైకి వెళ్ళాడు. మరో పది రోజుల దాకా రాడు. ఒకటే సమస్య’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘మీ పిన్నమ్మ వంట బావుండదా?’’
 ‘‘పిన్నమ్మ ఏనాడో టపా కట్టింది. ఇంటి తాళం చెవి నా దగ్గర లేదు.’’
 ‘‘పిల్లల్ని అడిగి తీసుకో.’’
 ‘‘ఒకరు విజయవాడ గాంధీనగర్‌లోని మేకా వారి వీధిలో, ఇంకొకరు సత్యనారాయణపురం లోని సింహాల మేడలో ఉంటున్నారు. ఇద్దరికీ ఉప్పూ నిప్పూ. ఒకరు ఉండగా ఇంకొకరు రారు.’’
 ‘‘తాళం చెవి సంగతి నాకు వదులు. రేపు రైట్ టైం షాప్ తలుపు తాళాన్ని కూడా తెరవాల్సింది నేనేగా. ఆయనుండేది ఎక్కడ?’’ కపీష్ అడిగాడు.
 ‘‘కొంతకాలం సైనికుడిగా పనిచేసి సైనిక్‌పురిలో ఉన్నాడు. తర్వాత ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం వస్తే అక్కడ చేరి వాయుపురిలో ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ నేవీలో ఉద్యోగం వస్తే అందులో చేరి రిటైరవబోయే ముందు పానీపురిలో ఇల్లు కొనుక్కున్నాడు.’’
 మర్కట్ బాబాయ్ ఇంటి తలుపుని కపీష్ ఆట్టే శ్రమపడకుండానే తెరవగలిగాడు. ముందుగా ముగ్గురూ ఫ్రిజ్ దగ్గరకి వెళ్ళి చూస్తే అందులో వారు ఆశించిన కోక్ బాటిల్ లేదు. వెతికితే డబ్బు ఎక్కడా కనపడలేదు కాని అదృష్టవశాత్తు ఓ కార్టన్‌లో ఆరు కోక్ జీరో ఫోర్ హండ్రెడ్ మిల్లీలీటర్ల పెట్ బాటిల్స్ కనిపించాయి. వాటిని డీప్ ఫ్రీజర్‌లో ఉంచాడు కపీష్.
 ‘‘ఇవాళ మనకి చాలా బిజీ డే. డబ్బు కోసం ఏం అమ్ముదాం?’’ వానర్ ఇంట్లోని వస్తువులని చూస్తూ మిత్రులని సలహా అడిగాడు.
 ‘‘అన్నీ అమ్మినా రెండు వేలు కూడా రావు.’’ మర్కట్ విచారంగా చెప్పాడు.
 ‘‘ఐడియా.’’
 ‘‘ఏమిటి?’’
 ‘‘మేమోసారి ఏభై రూపాయలు మోసపోయాం. అదే ఇప్పుడు మనకి శ్రీరామరక్ష. మనకి కొన్ని ప్రింటవుట్స్ కావాలి’’ కపీష్ డిక్టేట్ చేస్తూంటే వానర్ దాన్ని వర్డ్‌లో టైప్ చేశాడు.
   
 గంటన్నర తర్వాత ముగ్గురూ మూడు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ల్లోకి వెళ్ళి డోర్ బెల్స్ నొక్కారు. తలుపు తెరిచిన మహిళల వంక చూసి నవ్వి చెప్పారు.
 ‘‘గుడ్ మార్నింగ్ మేడం. గాయత్రీ హోమ్ లైబ్రరీ నించి వస్తున్నాం. నెలకి అరవై రూపాయలు ఇస్తే మీకీ పుస్తకాలన్నీ ఇంటికే తెచ్చిచ్చి, మళ్ళీ తీసుకెళ్తాం.’’
 వాళ్ళు ఆ కాగితం చదివారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, అరవం పత్రికల లిస్ట్, ప్రముఖ ఆంగ్ల, తెలుగు రచయితల నవలల లిస్ట్ అందులో ఉన్నాయి.
 ‘‘ఉదయం మీకు సౌకర్యమా మేడం? లేక సాయంత్రమా? ఏ మేగజైన్ ఏరోజు కావాలో టిక్ చేయండి. ఇవాళ ఏం కావాలి?’’
 ‘‘గృహశోభ ఉందా?’’
 ‘‘ఉంది. మీరు ఏ రోజైనా బుక్ తీసుకోకపోతే రెండు ఛాయిస్‌లు. మర్నాడు రెండు తీసుకోవచ్చు. లేదా ఆ రోజు ఎమౌంట్ తర్వాతి నెల దాంట్లో కట్ చేసుకుని మిగిలింది ఇవ్వచ్చు.’’
 చాలామంది మహిళలు పుస్తకాలు చదవకపోవడానికి కారణం అవి అందుబాటులో లేకనే. ఒకప్పడు రెంట్ కార్నర్స్ నించి వాటిని తీసుకుని చదివేవారు. ఇప్పుడవి నాస్తి. నలభై పైబడ్డ మహిళల్లో ప్రతీ నలుగురిలో ఒకరే రిజెక్ట్ చేశారు. మిగిలిన ముగ్గురూ అరవై చొప్పున డిపాజిట్ చెల్లించారు.
 ‘‘పుస్తకాల బేగ్ కింద బండిలో ఉంది. మీకు గృహశోభ కావాలన్నారా? తెచ్చిస్తాను’’ చెప్పి డబ్బు తీసుకుని వాళ్ళు ఉడాయించసాగారు.
   
 ‘‘నే చెప్పలా? నువ్వు అనవసరంగా భయపడ్డావు. ఒక్కరూ మనల్ని గుర్తు పట్టలా. ఓసారి టీవీలో ఫొటోని అలా చూపించినంత మాత్రాన గుర్తుంచుకుని పోలీసులకి మన గురించి ఇన్‌ఫాం చేసే మహిళలు మన తెలుగు గడ్డ మీద ఎవరున్నారు?’’ కపీష్ చెప్పాడు.
 ముగ్గురూ ఆ మోసంతో సంపాదించిన డబ్బుని లెక్క పెట్టారు. ఎనిమిది వేల ఆరు వందల చిల్లర.
 ‘‘గుడ్. మనకి అవసరమైనవి ఇక కొనచ్చు’’ వానర్ ఉత్సాహంగా చెప్పాడు.
 ముగ్గురూ మర్కట్ బాబాయ్ ఇంట్లోంచి బయటకి నడుస్తూంటే ఓ శవం ఎదురొచ్చింది.
 
 

మరిన్ని వార్తలు