పదిన్నరకు భోజనం రెడీ

22 Nov, 2019 02:50 IST|Sakshi

ఫుడ్‌మ్యాన్‌

ఒకప్పుడు తన కడుపు నింపుకోవడానికే కష్టపడిన యువకుడు ఇప్పుడు రోజుకు సుమారు రెండువేల మంది కడుపు నింపుతున్నాడు! అలాగని అతనేదో పెద్ద ఆస్తిపరుడో, ఉన్నతోద్యోగో ఏమీ కాడు. రూపాయి పొదుపు చేయడం రూపాయి సంపాదించడంతో సమానమని నమ్మినవాడు. పెద్ద పెద్ద ఫంక్షన్‌లలో వృథాగా పడవేస్తున్న ఆహార పదార్థాలను సేకరిస్తూ ఆకలితో అలమటిస్తున్న వారి కడుపులు నింపుతున్నవాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే...

‘‘మాది రాజమండ్రి. మేము నిరుపేదలమేమీ కాదు. కాస్త భూమి ఉన్న వాళ్లమే. అయితే, ఎవరో చెప్పిన మాటలు విని మా నాన్న మాకున్న ఎకరం నేల అమ్మేసి నాగపూర్‌లో అంతకు పదింతలు భూమి కొన్నారు. అక్కడ వ్యవసాయం చేయడం కోసం మా కుటుంబాన్ని నాగపూర్‌కు తరలించాడు. అయితే నాన్నకు తెలిసిన వ్యవసాయ పరిజ్ఞానం అక్కడ ఏమీ పనికి రాలేదు. దాంతో సర్వం కోల్పోయి మా కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడింది. తినడానికి తిండి కూడా లేని దుస్థితి. దాంతో తెలిసిన వారి ద్వారా నిజామాబాద్‌ వచ్చాం.

అలా నేను నా పదేళ్ల వయసులో నిజామాబాద్‌ వీధులలో ఆకలితో తిరుగుతూ కనిపించినప్పుడు సంఘ సేవకురాలు హేమలతా లవణం గారు నన్ను చేరదీశారు. ఆవిడే నన్ను ఆదరించి నిజామాబాద్‌లోని ఆశ్రమ విద్యాలయలో చేర్పించారు. అక్కడ పదో తరగతి పూర్తి చేశాను. తర్వాత కొందరు దాతల సాయంతో హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేశాను. ఎలాగైనా సరే నాకు సరిపడా సంపాదించుకుంటూ, మా కుటుంబానికి అండగా ఉంటూ, ఇతరులకు కూడా సహాయపడాలని అప్పుడే నిశ్చయించుకున్నాను.

చిన్నతనంలోనే పబ్‌లలోను, పెద్ద పెద్ద ఫంక్షన్లలోనూ క్యాటరింగ్‌ పని చేసేవాణ్ణి. నేనేమో ఒకపక్క కడుపునిండా తిండి లేక నకనకలాడిపోతూనే పని చేస్తుంటే అక్కడ ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా ఆహారం వృథా కావడం చూస్తే బాధేసేది. అప్పుడే నాలో ‘ఇలా వృథా అవుతున్న ఆహారాన్ని ఏం చేయాలా’ అన్న ఆలోచన కలిగింది. అదే ‘డోంట్‌ వేస్ట్‌ ఫుడ్‌’ అనే నా సంకల్పానికి పునాది వేసింది. అప్పటినుంచి హైదరాబాద్‌లో మిగులు ఆహారాన్ని సేకరించి, అన్నం లేక బాధపడుతున్న వారి కడుపు నింపడం మొదలు పెట్టాను’’ అంటూ తన ప్రస్థానం గురించి వివరించారు మల్లేశ్వరరావు.

రాత్రి పది తర్వాత
‘డోంట్‌ వేస్ట్‌ ఫుడ్‌’ గురించి చెబుతూ.. ‘‘ప్రతి రోజూ రాత్రి పది గంటలకు హోటల్స్‌ మూసే సమయానికి హైదరాబాద్‌ మధురానగర్‌లో నా హాస్టల్‌ నుంచి కొంత మంది ఫ్రెండ్స్‌తో కలిసి కాలినడకన, వాహనాల మీద బయలుదేరి, ఖైరతాబాద్‌ వరకు ఉన్న హోటల్స్‌లో మిగులు ఆహారాన్ని సేకరిస్తాను. ముందుగా నేను రుచి చూసి, తాజాగా ఉన్న ఆహారాన్ని ప్యాక్‌ చేసి, తిండి లేకుండా, దారి పక్కన అనా థల్లా ఉన్నవారికి అన్నం పెట్టి, మళ్లీ రాత్రి 12 గంటలకు రూమ్‌కి చేరతాను.

ఇది నా దినచ ర్య. ఆరు సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాను, పని లేకుండా కూర్చునేవారికి, తాగుబోతులకు ఒక్క ముద్ద కూడా పెట్టను. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉండే కార్మికులకు కూడా అన్నం అందచేయడం మొదలుపెట్టాను. వారాంతాలలో ఐటీ ఉద్యోగులు మాకు సహకరిస్తున్నారు. ఒక్కోరోజు నేను ఒంటరిగానే ఈ పని చేయవలసి వస్తుంది. ఫేస్‌బుక్‌ పేజీ కూడా క్రియేట్‌ చేశాం. రెస్టారెంట్‌ యజమానులు అందులో మెసేజ్‌ పెడితే చాలు, మేమే స్వయంగా వెళ్లి ఆహారం సేకరిస్తాం’’ అని మల్లేశ్వరరావు తెలిపారు.
– డాక్టర్‌ వైజయంతి పురాణపండ

అన్‌నోన్‌ హీరో
మల్లేశ్వరరావు  యూట్యూబ్‌ చానెల్స్‌ కోసమూ క్రియేటివ్‌ వర్క్‌ చేశారు. బీటెక్‌ పూర్తయ్యాక ఢిల్లీ వెళ్లి అక్కడ ‘జోష్‌ టాక్స్‌’ డైరెక్టర్‌గా ఉత్తేజాన్నిచ్చే కథలు చెప్పారు. కాలేజీ మ్యాగజైన్‌ లో ‘మా మాట’ శీర్షికకు ఎన్నో వ్యాసాలు రాసిన మల్లేశ్వరరావుకు మంచి జర్నలిస్టు కావాలన్నదే జీవితాశయం. ఫుడ్‌మ్యాన్‌గా అతడికి ఇండియన్‌ యంగ్‌ ఐకాన్‌ అవార్డు –2018 (నేషనల్‌ హ్యూమన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా), రాష్ట్రీయ గౌరవ్‌ అవార్డు– 2019 (శిక్షాలయ అండ్, సి.జె గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్, ఢిల్లీ) వంటి మొత్తం 26 పురస్కారాలు లభించాయి. ‘సన్‌ ఆఫ్‌ సాయిల్‌’ అవార్డు (సామ్‌సంగ్‌ అండ్‌ సి.జె.) కూడా అందుకున్నారు. ‘అన్‌నోన్‌ హీరోస్‌’ అని త్వరలో రాబోతున్న పుస్తకంలో మొదటి స్టోరీ అతడిదే కావడం విశేషం. ఆ పుస్తకాన్ని దివ్య అనే ప్రముఖ బ్లాగర్‌ రాస్తున్నారు.

మరిన్ని వార్తలు