పుట్టింటి పోలీసులు

27 Apr, 2018 00:34 IST|Sakshi
పోలీసుల ఆశీస్సులతో జరిగిన మమతా మహావర్‌ వివాహం. (కుడి) పెళ్లికి ముందు మమత. 

అమ్మాయి పెళ్లి

పోలీసులు పెళ్లి చేశారు. అలాగని మేజర్‌ అయిన అమ్మాయి, అబ్బాయి ‘మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు’ అని ఆశ్రయం కోరి వచ్చిన వాళ్లకు పెళ్లి చేయడం కూడా కాదు. ఒక పేదింటి అమ్మాయికి పుట్టింటి వాళ్లుగా మారి చేసిన పెళ్లి!

రాజస్తాన్‌లో బాగా వెనుకబడిన జిల్లా టోంక్‌. ఆ జిల్లాలో ఓ చిన్న పట్టణం లాంటి పల్లె దత్వాస్‌. పోలీసులు పెళ్లి చేసింది ఆ ఊళ్లోని అమ్మాయికే. మమతా మహావర్‌ నెలల బిడ్డగా ఉన్నప్పుడే తండ్రి పోయాడు. పదేళ్లు నిండే లోపు తల్లి పోయింది. ఇక మిగిలింది తను, అన్న. అతడు కూడా అనారోగ్యంతో మంచం పట్టి, కొంతకాలానికి చనిపోయాడు. మమతకి మిగిలింది చిన్న గూడు, అన్న ఆరోగ్యం కోసం చేసిన అప్పులు. ఆమె ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ (మహాత్మాగాంధీ నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ యాక్ట్, 2005) ఉపాధి పనులతో పొట్ట నింపుకునేది. అన్నకూ ఇంత పెట్టేది. అతడు పోయాక రోజూ పనికి పోతూ డబ్బు వెనకేసుకుంది. అప్పులు కొంత కొంత తీరుతూ వచ్చాయి. పూర్తిగా తీరిపోయిన తర్వాత ‘ఉపాధి’ పనుల డబ్బును సర్పంచ్‌ దగ్గరే దాచుకుంది. ఊళ్లో వాళ్లు మంచి పిల్ల అని మురిసిపోయారు. ఆమెకో వరుణ్ని కూడా వెదకి తెచ్చారు. ఇక పెళ్లే ఆలస్యం. మమత ఆ ఊరి సర్పంచ్‌ దగ్గరకెళ్లి తనకు పెళ్లి కుదిరిందని చెప్పింది. తను పని చేసిన రోజులకు లెక్కకట్టి డబ్బంతా ఇచ్చేస్తే పెళ్లి పనులు చేసుకుంటానని అడిగింది. 

సర్పంచ్‌ మాట తప్పాడు!
సర్పంచ్‌కి డబ్బు ఇవ్వబుద్ధి కాలేదు. కాళ్లరిగేలా తిరిగినా మనసు కరగలేదు. పెళ్లి దగ్గరకు వస్తోంది. ఇక మమత పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది. ఉపాధి హామీలో భాగంగా గతంలో ఆ పోలీస్‌ స్టేషన్‌ పనులు కూడా చేసి ఉందామె. స్టేషన్‌ నిర్మాణంలో పని చేసిన అమ్మాయి ఇప్పుడు న్యాయం కోసం మెట్లెక్కింది. సర్పంచ్‌ దగ్గర నుంచి రావాల్సిన డబ్బు వచ్చినా కూడా అది పెళ్లి ఖర్చులకు సరిపోయేట్టు కనిపించలేదు. చివరికి పోలీసులు తామే అదనంగా కొంత డబ్బు ఇచ్చి మమత పెళ్లి చేయడానికి ముందుకొచ్చారు. స్టేషన్‌లో పెళ్లి మండపం రెడీ అయింది. పోలీసులే అమ్మాయి తరఫు వారు. హెడ్‌ కానిస్టేబుల్‌ దయారామ్‌.. మమత తండ్రి పాత్ర తీసుకున్నాడు. ఇటీవలే అక్షయ తృతీయ రోజు పెళ్లి చేశారు. సర్పంచ్‌ ఇవ్వాల్సిన డబ్బును విడిపించి మమత చేతిలో పెట్టి అత్తగారింటికి పంపించారు.‘‘సర్పంచ్‌ మొదటే ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి ఉంటే మమత పెళ్లి అన్నీ అమర్చినట్లు ఇంత చక్కగా జరిగేది కాదేమో. దేవుడు ఆమెకు లక్షణంగా పెళ్లి చేయడానికే ఇదంతా చేశాడు’’ అని సంతోషపడుతున్నారు ఆమె ఆత్మీయులు. పోలీసోళ్లు పుట్టింటోళ్లయితే అత్తగారింటి వాళ్లు అమ్మాయిని చక్కగా చూసుకుంటారని కూడా నవ్వుతూ అనుకుంటున్నారు. 
– మను

మరిన్ని వార్తలు