ఆత్మ నుండి... ఆత్మలోకి

6 Jan, 2019 01:25 IST|Sakshi

మనిషి అనేక ప్రాకృతిక చర్యలను గుర్తించలేడు. ఉదాహరణకు తాను భూమిలో భాగమై ఉండటం వలన భూభ్రమణాన్ని గమనించలేడు. అలాగే, తన శరీరంలో జరిగే చర్యలను గుర్తించలేడు. తనకున్న పరిమితులు, తన దృక్పథంతో మాత్రమే ఆలోచించడం వలన అనేక అపోహలు, నమ్మకాలు కలుగుతాయి. కొన్నింటిని ఇతరుల నుండి స్వీకరించి, కొన్ని స్వతహాగా ఊహించి అనుకూల వాదనలు చేస్తూ ఉంటాడు. ఈ మార్గం సరైంది కాదని తెలుసుకున్న భారతీయ ఆధ్యాత్మిక పరిశోధకులు హేతువు నుండి పరిశోధన మొదలు పెట్టారు. ఏది హేతువో అది ఆత్మ అని నిశ్చయించారు. ఆ ఆత్మ నుండే పదార్థం ఉద్భవిస్తోందని, తిరిగి దానిలోనే లయమైపోతోందని నిర్ధారించారు. ఈ సూత్రాన్ని ఒడిసిపడితే చాలు, అన్నింటికీ సమాధానం దొరికిపోతుంది.

మనం మన తల్లిదండ్రుల ద్వారా ఉద్భవించినట్టు అనిపించినా, మన ఈ పరిణామరూపం ఆత్మచేత, ఆత్మ ద్వారా, ఆత్మ నుండి, ఆత్మలోనే జరుగుతుందని గుర్తించ గలుగుతాము. ఈ విధంగా మన ఆలోచనలను హేతుమార్గంలో విస్తృత పరచుకుంటే ఆత్మ అర్థమౌతుంది. అర్థమైన ఆత్మను అంతటా, అన్నింటా దర్శించే ప్రయత్నమే తపస్సు. ఈ తపస్సు నిరంతర ఆలోచనల్లో నిండిపోతే కలిగేదే ఆత్మసందర్శన లేక భగవత్సాక్షాత్కారం.ఆ ఆలోచనలను ఆచరిస్తే కలిగే స్థితే బ్రహ్మస్థితి. అంటే సాధకుడు ‘అహం బ్రహ్మాస్మి’ స్థాయికి చేరుకుంటాడు.’ఈశావాస్యోపనిషత్తు’ చెప్పినట్లుగా బ్రహ్మస్థితిలో ఉన్న సాధకుడికి తన చుట్టూ ఉన్న ఏ జీవీ అల్పమైనదిగానో, అసహ్యకరమైనదిగానో కనిపించదు.

అన్నింటా ఈశ్వరుడు కనిపిస్తే ఏహ్యభావమెలా కలుగుతుంది? అలాగే, వస్తువాసనలు నశించిపోతాయి. అందువల్ల అరిషడ్వర్గాలు ఆవిరైపోతాయి.అరిషడ్వర్గాలు నశిస్తే దుఃఖానికి స్థానమెక్కడుంటుంది? దుఃఖమే లేనప్పుడు మనసంతా ఆనందమయమే కదా! ఈ ఆనందం మనకు కలిగే సంతోషాలకు భిన్నమయిందీ, ఉన్నతమయింది. సంతోషం స్వల్పకాలిక మానసిక ప్రతిస్పందన కాగా, ఈ ఆనందం ఎలాంటి మానసిక స్పందనలూలేని స్థిరస్థితి.దీనిలో అలజడులకూ, హెచ్చుతగ్గులకూ స్థానం లేదు. అలా నిశ్చలమై, నిరంతరమై ఉంటుంది. సాధకునికి తనలో, తన చుట్టూ కలిగే పరిణామాలకు సంబంధమే ఉండదు. సాధకుడి పని సాధకునిది.అదే కర్మతో, ప్రతిఫలంతో సంబంధం లేని మోక్షస్థితి. అందరూ ఆశించే పరమాత్మ సన్నిధి. 

మరిన్ని వార్తలు