తిరుమల చరిత్రపై గొప్ప పరిశోధన

17 Feb, 2019 00:41 IST|Sakshi

తత్త్వ రేఖలు

ఇంతవరకు తిరుమల చరిత్రపై వివిధ భాషల్లో వెలువడ్డ పుస్తకాలకు భిన్నంగా పరిపూర్ణంగా చరిత్రను పునాదిగా చేసుకుని రాసిన విశిష్ట గ్రంథమిది. చెట్లనీడలో, చెదల పుట్టల నడుమ కప్పబడి ఉన్న వెంకటేశుని ప్రతిమను తొండమాన్‌ చక్రవర్తి వెలికి తీయించి పునఃప్రతిష్ట గావించి శిలాస్తంభాలతో మండపరీతి ఆలయాన్ని నిర్మించింది మొదలుకుని ఆళ్వారులు ఎంతో కష్టంతో కొండల నడుమన ఉన్న వేంకటేశుని దర్శించి తాము సేకరించిన వివరాలను పాటగట్టి ఆ భక్తితత్వాన్ని ప్రచారం చేసిన చరిత్రను ఆచార్య దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి ఈ పుస్తకంలో వివరించారు. 2 వేల సంవత్సరాల చరిత్ర క్రమంలో తిరుమల చరిత్రను ఆధార సహితంగా వెలికి తీసి మనముందు ఉంచిన పరిశోధక స్థాయి కలిగిన గ్రంథమిది. ఈ పుస్తకంలో మహిమలు, భక్తి ప్రచారాలు. వేంకటేశ్వరుడి లీలలు కానరావు. అయితేనేం, మనిషి తమకు మంచి చేసినవారిని దేవుళ్లగా, చెడు చేసిన వారిని రాక్షసులుగా భావించి కొందరికి దైవత్వం, కొందరికి దానవత్వం ఎందుకు ఆపాదిస్తూ వచ్చాడో పరిణామ క్రమంలో వివరిస్తూ వచ్చిన ఈ గ్రంథం అందరూ తప్పక పఠించి తీరాల్సినది.  గాడ్స్‌ ఆన్‌ అర్త్‌; తిరుమల చరిత్ర
పుటలు: 310; వెల రూ. 300; ప్రతులకు: ప్రొ. దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి 303, బి1 బ్లాక్, వరరూప హోమ్స్, శ్రీ సాయి అపార్ట్‌మెంట్స్, తుమ్మలగుంట, తిరుపతి–517502. ఫోన్‌: 9849584324
ఈమెయిల్‌:dsreddy.svu@gmail.com
– రాజశేఖర రాజు 

మానవుడు నిరంతర జిజ్ఞాశువు. అన్నింటినీ తెలుసుకోవాలనుకునే మానవుని తృష్ణకు సంపూర్ణంగా లొంగనిదా ఆత్మ. కారణం, అది అటు విశుద్ధశక్తి రూపంలోనూ, ఇటు దృశ్యమాన ప్రపంచరూపంలోనూ కలగలిసి ఉండటమే. అంతేగాక, విరుద్ధ లక్షణాలు ఆ ఆత్మ సొంతం. ఆత్మ ఎంత సూక్ష్మమో, అంత విస్తృతం. ఎంత తేలికో, అంత భారయుతం. ఎంతటి సరళమో, అంతటి సంక్లిష్టతమం. ఎంతటి నిర్లిప్తమైనదో, అంతటి చైతన్యమైనది. ఎంతటి స్థిరమైనదో, అంతటి పరిణామశీలి. అందుకే, ఉపనిషత్తులు ఆత్మను ‘సవితా’ అని పేర్కొన్నాయి. ఆత్మ సాంద్రత అనంతమవడం వల్ల ఆ ఆత్మలో ఎక్కడైనా భారీ లేక అతి భారీ నక్షత్రాలు, నక్షత్ర సముదాయాలు రూపొందుతున్నాయి. అలాగే, అంతే ప్రాంతంలో సూక్ష్మాతిసూక్ష్మమైన పదార్థాలు కూడా. ఆత్మ పరిణామతత్వం వల్లనే నిర్జీవులకు విఘటనం, జీవులకు మరణం తప్పదు. విఘటనం చెందిన నిర్జీవి ఏ రకంగా నైతే తిరిగి తన రూపాన్ని పొందదో, అలాగే జీవి మరణాంతరం తన  రూపాన్ని తిరిగి పొందదు. ఎందుకంటే ఈ ఆత్మకు తిరిగి చూసుకునే అవసరమూ లేదు, అవకాశమూ లేదు. ఆత్మసాంద్రత అనిర్వచనీయమైనందువల్ల, అదే తిరిగి తిరిగి అన్ని రూపాల్లో పుడుతుందని, ఆ ఆత్మే తానని ఆత్మ జ్ఞానం పొందినవాడు గుర్తెరిగి, గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో ఉద్భవించేది తానేనని నిర్ధారించుకుంటాడు. తద్వారా మరణభీతిని జయిస్తాడు. అతన్ని మాత్రమే అరిషడ్వర్గాలు చేరలేవు. 

ఆత్మజ్ఞాని ఓ విశ్వమానవుడు
ఆత్మజ్ఞాని ఓ విశ్వమానవుడు. అతనికి కులం లేదు, మతం లేదు, అసలు భేదమే లేదు. జీవుల్లోనే కాదు, నిర్జీవుల్లో కూడా భేదాన్ని గుర్తించలేడు. అభేదమే మనసుగా మారిపోగా, అదే ఆనందానికి మాతృకగా పరిణమిస్తుంది.  మానవ సమాజం కూడా ఈ విషయాన్ని గుర్తిస్తే సమాజంలో భేదాభిప్రాయాలకు తావు ఉండదు. మతవాదం, కుల వాదం, జాతివాదం మొదలైనవే కాకుండా మానవుడే ఒక ఉన్నతజీవి అనే దురభిమానం కూడా పోతుంది. ఈ ప్రకృతిలో తనదొక విశిష్టమైన బాధ్యతాయుత జన్మ అని గుర్తిస్తుంది. ప్రకృతిలో ఇతర జీవాలను తోబుట్టువులుగా చూడడం జరుగుతుంది. ఆధిపత్య ధోరణి పోయి బాధ్యతాయుత జీవన విధానం ప్రారంభమవుతుంది. మానసిక శుభ్రతయే కాక, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ మొదలైన ప్రాకృతిక కార్యకలాపాలు మొదలై ఓ చక్కటి సమాజం సాకారమౌతుంది. ప్రతీ గ్రామం ఓ మున్యాశ్రమంగా రూపుదిద్దుకుంటుంది. అయం నిజః పరోవేతి గణనా లఘు చేతసామ్‌ ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకామ్‌  అన్నట్టుగా వసుధ అంతా ఒకే కుటుంబమై విరాజిల్లుతుంది. 
– గిరిధర్‌ రావుల

మరిన్ని వార్తలు