మనిషికి బతకాలనే ఆశ ఉండాలి...

16 Oct, 2014 22:00 IST|Sakshi
మనిషికి బతకాలనే ఆశ ఉండాలి...

తురగా జానకీరాణి...
 ఒక కథకురాలు... ఒక నవలా రచయిత్రి... రేడియో ప్రయోక్త...
 ఒక గాయని... ఒక నర్తకి... ఒక నటి...
 చదువులో బంగారు పతకాలు... ఉద్యోగంలో జాతీయ అవార్డులు...
 బాలానందం కార్యక్రమంతో ఆకాశవాణి జీవితం ప్రారంభం...
 ప్రొడ్యూసర్‌గా పదవీ విరమణ...
 జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు... అన్నిటినీ అధిగమించారు...
 జానకీరాణిగారు అక్టోబరు 15, బుధవారం గతించడానికి కొన్ని వారాల ముందు  ‘సాక్షి’తో కొన్ని జ్ఞాపకాలు పంచుకున్నారు. ఇదే ఆవిడ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ...

 
ఆ స్పర్శ చల్లగా ఉంది...

నా ఆరో ఏట ఒకసారి మహాత్మాగాంధీ మా ఊరు వచ్చారు. ఆయనను చూడటానికి జనమంతా వెళ్తుంటే నేను కూడా వాళ్లతో వెళ్లాను. ఆయన ఒక్కో అడుగు వేస్తుంటే, ప్రజలంతా ఆయన కాళ్ల దగ్గర ఉన్న ఇసుకను దోసెళ్లతో ఎత్తి నెత్తిన పెట్టుకున్నారు. నేను ఆయన మెడలో వేయడానికి తీసుకువెళ్లిన ఎర్రగులాబీల దండలో పూలన్నీ, ఆయన దగ్గర చేరే లోపే  రాలిపోయాయి. ఆయన ఆ దండ తీసుకుని, నా తల మీద మృదువుగా నిమిరారు. ఆయన చేతి స్పర్శ నాకు చల్లగా అలాగే ఉండిపోయింది. ఆయనకు ‘జి’ అని రాసి ఉన్న నా చేతి ఉంగరాన్ని ఇస్తుంటే, తన చిటికెనవేలితో తీసుకుని ‘ఇది ఎందుకు?’ అన్నారు. ‘కస్తూర్బా ఫండ్’ కి అన్నాను. ఆయన నన్ను ఆశీర్వదించారు.

బాలానందంతో ప్రారంభం...: చిన్నప్పటి నుంచే ఆకాశవాణి బాలానందం కార్యక్రమంలో పాల్గొన్నాను. అబ్బూరి వరదరాజేశ్వరరావు రచించిన ‘ఒరియా’ అనువాద నాటకం లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో పాటలు పాడాను. ‘‘నీ కంఠంలో కరుణరసం బాగా పలుకుతుంది’’ అన్నారు సినారె. విశ్వనాథ సత్యనారాయణ గారి ‘కోకిలమ్మపెళ్లి’ నాటకంలో చిలకతల్లి వేషం వేశాను. విదేశీ ప్రసారాల కోసం బాలమురళిగారు మా చేత జోలపాటలు, ఉయ్యాల పాటలు, అప్పగింతల పాటలు పాడించారు.
 
వివాహ బంధం...


నా 12వ ఏట తురగా కృష్ణమోహన్‌గారు (అప్పటికి ఆయన వయసు 18) నా వెంటపడ్డారు. ‘ఒక మనిషి ఇంకో మనిషిని అంతగా ప్రేమించగలరా’ అనుకునేంతగా ఆయన నన్ను ఇష్టపడ్డారు. అందుకే నేను ఆయన అభిమానంలో చిక్కుకుపోయాననుకుంటాను. మా మధ్య స్నేహం సుమారు పది సంవత్సరాలు నడిచింది. ఏది ఎలా ఉన్నా చదువులో మాత్రం ముందుండేదాన్ని. డిగ్రీ, పీజీలలో గోల్డ్‌మెడల్స్ సాధించాను. 1959 లో నా 22వ ఏట మా వివాహం జరిగింది. అప్పుడు ఆయన ఆంధ్రపత్రికలో పనిచేస్తుండేవారు. నేను ఇంట్లో తలనొప్పితో బాధపడుతుంటే, ఆఫీసులో అందరికీ నా గురించి చెబుతూ ఆయన కూడా బాధపడేవారని ఆయన స్నేహితులు చెప్పేవారు. అంత ప్రేమగా ఉండేవారు ఆయన. కొంతకాలానికి ఆయన ఆంధ్రపత్రిక నుంచి ఆకాశవాణిలో వార్తావిభాగంలో చేరారు. నేను ‘సోషల్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్’లో చేరి పదిహేనేళ్లు  పనిచేశాను. నిజాయితీ గల ఆఫీసరుగా పేరు తెచ్చుకున్నాను.
 
మారిన జీవితం...: ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం ఉద్యోగం మానేశాను. మేమిద్దరం... మాకిద్దరు... అన్నచందాన ఎంతో అన్యోన్యంగా ఉంటున్న నా జీవితం ఊహించని మలుపు తిరిగిపోయింది. 1974 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయనకు ఆ రోజు ఉదయం కాఫీ ఇచ్చిన గ్లాసు ఇంకా కిటికిలోనే ఉంది, ఇంతలో మృతదేహం వచ్చింది. ఎన్నో ఏళ్లు కుమిలికుమిలి ఏడ్చాను. కాలం నెమ్మదిగా గాయాల్ని మాన్చింది. పిల్లల్ని చూసుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఏ పిల్లల కోసం నేను ఉద్యోగం మానేశానో, అదే పిల్లల కోసం మళ్లీ ఉద్యోగంలో చేరాను.
 
ఆకాశవాణి ప్రొడ్యూసర్‌గా ...


1974లో ఆకాశవాణి ప్రొడ్యూసర్‌గా చేరి 1995లో రిటైరయ్యేవరకు అక్కడే కొనసాగాను. ఆకాశవాణి అప్పుడొక స్వర్ణయుగం. నేను పనిచేసిన 20 సంవత్సరాల కాలంలో రేడియోలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాను. ‘అందరికీ చదువు’ అనే కార్యక్రమం ప్రసారం చేసినప్పుడు, అన్ని జిల్లాల నుంచి అక్కడి బడి పరిస్థితులను వివరిస్తూ ఉత్తరాలు వచ్చేవి. వాటిని విద్యాశాఖ కార్యదర్శికి పంపేదాన్ని. ఇంకా... పిల్లల కార్యక్రమాలు, మహిళా కార్యక్రమాలు, నవయుగం, నవలా స్రవంతి, సమత, బాలవిహార్, మహిళా సమాజం... వంటి కార్యక్రమాలు చేశాను. అనేక బాలకవిసమ్మేళనాలు నిర్వహించాను. ‘బ్రాడ్‌కాస్టర్’ అనే పదానికి బదులు ‘ప్రసారకర్త’ అనే పదాన్ని వాడటం ప్రారంభించింది నేనే. దాశరథి కృష్ణమాచారిగారు మా స్టేషన్ డెరైక్టర్‌తో ‘జానకీరాణి తెలుగుభాషకు చాలా సేవచేస్తోంది’ అంటూ నన్ను అభినందించారు.
 
వందేమాతరం...

‘ఆనంద్‌మఠ్’ నవల రచించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేడియోలో సెలట్రేబ్ చేయమన్నారు. వందేమాతరం గీతంలోని ‘సుజలాం, సుఫలాం’ వాక్యాన్ని తీసుకుని డా. సి. నారాయణరెడ్డిగారితో  ‘‘మంచుకొండలను దిగివచ్చింది మా గంగమ్మ... మనసే మురళిగా మలచుకొంది మా యమునమ్మ...’’ అని పాట రాయించాను. ఈ కార్యక్రమం ఆహ్వానపత్రికలో ‘దృశ్య గీతి’ అని వేస్తే, అలా ఎందుకు వేశారని అందరూ నన్ను అడిగారు. అందుకు నేను ‘అది దృశ్యం కాదు, శ్రవ్యం కాదు, చూడవలసిన గీతి కనుక అలా వేశాను’ అని చెప్పాను.
 
ఇలా ఎన్ని కార్యక్రమాలు చేశానో నాకే గుర్తు లేదు. గుర్తున్నంతవరకు కొన్ని మాత్రమే చెప్పగలిగాను. ఇప్పుడు నా వయసు 78.  అయినా నా మనసు మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంది. ఇప్పటికీ ఏ ప్రోగ్రామ్‌కి పిలిచినా వెళ్లిపోతాను. రేడియోవాళ్లు నా గురించి నాతో మాట్లాడించి ఆరు భాగాలు టేప్ చేశారు. ‘బతకాలి బతకాలి’ అన్నదే నా ఫిలాసఫీ. జీవితం చాలా విలువైనది. మనం బతికున్నామంటే అది ఒక వరం. మనిషికి బతకాలనే ఆశ ఉండాలి. అప్పుడే జీవితంలో అన్నిటినీ ఎదుర్కోగలుగుతాం... అంటూ ముగించారు.
 
- డా॥వైజయంతి

 
తాతగారి ఆశీస్సులే కారణం...


చిన్నప్పుడే నేను కథలు రాయడానికి ఒక రకంగా మా తాతయ్య చలంగారి ఆశీస్సులే కారణం. నాకు 15 సంవత్సరాల వయసున్నప్పుడు తిరువణ్నామలై వెళ్లి ఆయన్ని కలిశాను. ఆయన నా కంటె 50 సంవత్సరాలు పెద్ద. ఆయన్ని నేను ఎన్నోరకాల ప్రశ్నలు వేసి వేధించాను. అన్నిటికీ ఆయన ఓరిమిగా సమాధానాలు చెప్పారు. ‘‘నువ్వు హృదయం ఉన్న పిల్లవు. నీలోంచి ఆలోచనలు పెళ్లగించుకుని వస్తేనే కథలు రాయి’’  అన్నారు. ఆయన మాటలు నా మనసులో ముద్ర వేసుకున్నాయి. ఆయన నాకు 16 ఉత్తరాలు రాశారు. ఆయనతో పరిచయం నాకు గొప్ప అనుభవం. అంత పెద్దమనిషి చేత నేను ప్రశంసలు పొందానని నాకు గర్వంగా ఉండేది.
 
 కృష్ణార్జున సంవాదంలో కృష్ణుడు వేషం వేశారు.
     
 మొట్టమొదటి కథ 15వ ఏట కృష్ణాపత్రికలో పడింది.
     
 వెంపటి చిన సత్యం గారి దగ్గర భరతనాట్యం నేర్చుకుని, అనేక ప్రదర్శనలిచ్చారు. నాట్యంలో డిప్లమా చేశారు. చినసత్యంగారు  ఇచ్చిన గజ్జెలు ఇప్పటికీ ఆవిడ దగ్గరున్నాయి.
     
 ‘నిశ్శబ్దంలో ప్రయాణాలు’ అని మూగచెముడు వారికోసం, ‘ఆశ్రయం’  అని వయోవృద్ధుల కోసం చేసిన కార్యక్రమాలకు, పిల్లల కోసం రచించిన బాల గేయాలకు రెండుసార్లు... మొత్తం నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి.
     
 1963లో ‘అఖిలభారత రచయిత్రుల సంఘం’ ఏర్పాటుచేశారు.
     
 ఆ ప్రారంభోత్సవానికి విజయలక్ష్మీ పండిట్ వచ్చారు.
 

>
మరిన్ని వార్తలు