మనసిచ్చి చూడు

16 Oct, 2019 12:26 IST|Sakshi

సీరియల్‌

కన్నడ సీరియల్‌ నటి తెలుగు ప్రేక్షకులకు భానుగా పరిచయం అయ్యింది. ‘మనసిచ్చి చూడు’ అంటూ ‘స్టార్‌ మా’లో వచ్చే ఈ సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్న ఈ నటి పేరు కీర్తి భట్‌. సీరియల్‌లోనే కాదు నిజ జీవితంలోనూ ఎన్నో ట్విస్ట్‌లు ఉంటాయంటూ తన గురించి చెప్పుకొచ్చింది కీర్తి.

‘‘నేను పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే. కన్నడ పరిశ్రమలోనే ఉన్నాను కాబట్టి ఇంకా తెలుగు సరిగా రాదు. అర్ధం చేసుకుంటూ నేర్చుకుంటున్నాను. ‘ది క్రైస్ట్‌ సేవ్‌ యూ’ అనే సినిమా తెలుగు, ఇంగ్లిష్‌లోనూ వచ్చింది. ఆ విధంగా తెలుగువారికి పరిచయం అయ్యాను. కిందటేడాది వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్‌గా చేశాను. ఇప్పుడు ‘మనసిచ్చిచూడు’ సీరియల్‌ ద్వారా మీ ముందుకు వచ్చాను. ఈ సీరియల్‌లో నాది సంప్రదాయాలను గౌరవించే భాను పాత్ర. పెద్దల పట్ల మన్నన గౌరవం అధికం. బాధ్యతలను, బంధాలను వదలుకోని భాను జీవితంలో ఊహించని ఎన్నో మలుపులు ఉంటాయి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలన్నది భాను కల. ఆ కల నిజమవుతున్న వేళ అతను ప్రమాదంలో చనిపోతాడు. దీంతో అతని తమ్ముడినే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. ఎన్నో ఆసక్తికర మలుపులతో ఈ సీరియల్‌ ఉంటుంది. ఇప్పటి వరకు కన్నడలో మూడు టీవీ సీరియల్స్‌ చేశాను. రెండు కన్నడ సినిమాల్లో నటించాను.

నిజజీవితంలోనూ పెద్ద ప్రమాదమే!
సీరియల్‌లో హీరోయిన్‌ కష్టాలు కల్పితమే. కానీ, నిజ జీవితంలో.. బిబిఎమ్‌ చేసిన నాకు ఎప్పుడూ సినీ ఫీల్డ్‌ మీద ఆసక్తిగా ఉండేది. అమ్మానాన్న అంత ఆసక్తి చూపకపోయినా నా ఇంట్రస్ట్‌ చూసి కాదనలేదు. అయితే, మూడేళ్ల క్రితం కారు ప్రమాదంలో అమ్మానాన్న, అన్నయ్య.. ముగ్గురూ దూరమయ్యారు. దీంతో ఒంటరిదాన్నయ్యాను. కుటుంబాన్ని కోల్పోయి దురదృష్టవంతురాలిగా మిగిలిపోయాను. బాధపడుతూ కూర్చుంటే కాదని, లైఫ్‌ను సింగిల్‌గానే ఎదుర్కోవాలని నాకు నేను నచ్చజెప్పుకున్నాను. ఉన్న ఫీల్డ్‌లోనే కొనసాగాలని, నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో సినిమా అవకాశాల కోసం ఎదురు చూడకుండా సీరియల్స్‌ వైపు వచ్చాను. ఇక్కడ ఆదరణ, అభిమానం ఈ పరిశ్రమలో కొనసాగేలా చేస్తోంది. నా తోటి నటీనటులు, దర్శక నిర్మాతలు, అందరితో కలిసే చేసే ఈ టీమ్‌లో నా కుటుంబాన్ని చూసుకుంటున్నాను. 

ఎంపికలో ముందు

డ్రెస్‌ సెలక్షన్, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ మీద కూడా ఆసక్తి ఉండటం నా వర్క్‌కి ప్లస్‌ అయ్యింది. నేను చేస్తున్న పాత్రలకు తగ్గట్టుగా కాంబినేషన్‌ డ్రెస్సులను ఎంచుకుంటాను. కొంతవరకు నా  డిజైనర్‌ ఫ్రెండ్‌ సలహాలు తీసుకుంటాను. అమ్మాయిలు ఇప్పుడు ప్రతి రంగంలోనూ తమని తాము నిరూపించుకోవడానికి కష్టపడుతున్నారు. ఎవరూ లేరని, తమకేదో జరుగుతుందని జంకితే ఎదుగుదల ఉండదు. మనం పుట్టిందే సవాళ్లను ఎదుర్కోవడానికి అర్ధమయ్యాక ఇప్పుడు ఏ సమస్య అయినా చిన్నదిగానే కనిపిస్తుంది. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటికీ నిలిచేఉండేలా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా అభిలాష.’’– ఆరెన్నార్‌

డ్యాన్స్‌తో మాయం
చిన్పప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే విపరీతమైన ఇష్టం. అలాగే పుస్తకాలు చదవడం కూడా. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం లోన్లీగా అనిపించినా, ఎక్కువ హ్యాపీ అనిపించినా డ్యాన్స్‌నే బేస్‌ చేసుకుంటాను. ఏ స్ట్రెస్‌ అయినా డ్యాన్స్‌తో ఇట్టే మాయం అయిపోతుంది. డ్యాన్స్‌ షోస్‌ చూడడం కూడా చాలా ఇష్టం.

మరిన్ని వార్తలు