కందకాలే మామిడి చెట్లను బతికించాయి!

25 Sep, 2018 06:30 IST|Sakshi

దామలచెరువు రైతు బాపు ప్రసాద రెడ్డి అనుభవం

కరువుతో భూగర్భ జలాలు అడుగంటి పెద్దలు నాటిన మామిడి చెట్లు ఒకటొకటీ నిలువునా ఎండిపోతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కని సంక్షోభ సమయంలో ‘సాక్షి సాగుబడి’ స్ఫూర్తితో, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం పెద్దల సాంకేతిక సలహాల మేరకు కందకాలు తవ్వి తాతల నాటి మామిడి చెట్లను విజయవంతంగా కాపాడుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రైతు బాపు ప్రసాద రెడ్డి సంబరంగా చెబుతున్నారు.

బాపు ప్రసాద రెడ్డి కుటుంబ ఉమ్మడి సేద్యం కింద పాకాల మండలం దామలచెరువు గ్రామపరిధిలో తాతల నాటి మామిడి తోటలున్నాయి. 2016లో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో పెద్ద మామిడి చెట్లు కొన్ని ఎండిపోయాయి. ఆ దశలో ‘సాక్షి సాగుబడి’ పేజీలో ‘చేను కిందే చెరువు’ శీర్షికన ప్రచురించిన కథనం ద్వారా తక్కువ ఖర్చుతోనే కందకాలు తవ్వుకుంటే భూగర్భ జలాలను పెంచుకొని నీటి భద్రత సాధించవచ్చని తెలుసుకొని, ప్రాణం లేచి వచ్చిందని ఆయన తెలిపారు.

తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాదరెడ్డి, అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009) లను ఫోను ద్వారా సంప్రదించి, వారి సూచనల ప్రకారం వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పున జేసీబీతో కందకాలు తవ్వించామని బాపు రెడ్డి వివరించారు. కందకం పొడవు 25 మీటర్ల తర్వాత 5 మీటర్లు ఖాళీ వదిలి, అదే వరుసలో 25 మీటర్ల పొడవున మరో కందకం తవ్వించామని తెలిపారు.  జేసీబీతో తవ్వించడానికి ఎకరానికి రూ. 2,500  వరకు ఖర్చయిందన్నారు.

ఆ తర్వాత వర్షాలు పడినప్పుడు వర్షపు నీరు పూర్తిగా ఇంకి భూగర్భ జలాలు పెరిగాయని, ఆ తర్వాత నుంచి ఒక్క మామిడి చెట్టు కూడా ఎండిపోలేదన్నారు. అంతేకాదు, ఈ రెండేళ్లలో మామిడి తోట చాలా కళగా ఉంది. పంట దిగుబడి కూడా బాగా వచ్చిందని ఆయన సంతోషంగా చెప్పారు. అయితే, ధర అంత బాగాలేదు. ధర బాగుంటే మరింత లాభదాయకంగా ఉండేదన్నారు. చనిపోయిన చెట్ల స్థానంలో సీతాఫలం, జామ మొక్కలు నాటాలని భావిస్తున్నామన్నారు. కందకాల వల్ల నిజంగా ఎంతో మేలు జరుగుతున్నదని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదని బాపురెడ్డి(90301 81344) అన్నారు.

మరిన్ని వార్తలు