అమ్మ వంటకు వందనం

15 May, 2020 07:57 IST|Sakshi

స్కూల్లో బాక్స్‌ ఓపెన్‌ చేస్తూ తన క్లాస్‌మేట్స్‌ బాక్సుల వైపు చూశాడు రాకేశ్‌. నిమ్మకాయ పులిహోర, పెరుగన్నం, అన్నం, మామూలు కూరలు... అన్ని బాక్సులూ రొటీన్‌గానే ఉన్నాయి. ఏ బాక్సులోనూ కొత్తదనం లేదు. ‘మా అమ్మ ఏం చేసిందో తెలుసా’ అంటూ గర్వంగా మినప్పప్పు– మిరియాల వడలను అందరికీ పంచాడు. తానూ ఇష్టంగా తిన్నాడు. రాకేశ్‌ బాక్సులో రోజూ ఇలా ఏదో ఒక స్పెషల్‌ ఉండేది. ‘మా అబ్బాయి రుచిలో రాజీ పడడు. వాడికి రోజూ కొత్తగా ఏదో ఒకటి వండేదాన్ని’ అని రాకేశ్‌ బాల్యంలోకి వెళ్లిపోయారు రమ. ఇప్పుడు ఈ తల్లీకొడుకులు తమిళనాడులో టెలివిజన్‌ సెలబ్రిటీలు. తక్కువ సమయంలో రుచిగా వండడం ఎలాగో నేర్పిస్తున్నారు. రమ వండుతూ ఉంటే రాకేశ్‌ కామెంటరీ ఇస్తుంటాడు. ఆ కామెంటరీలో వంట వండే విధానంతోపాటు రుచి పెరగడానికి చిట్కాలు, చిన్నప్పుడు తాను ఈ వంటను ఆస్వాదించిన జ్ఞాపకాలను కూడా చెప్తుంటాడు రాకేశ్‌. ఆధునిక వంటగది మర్చిపోతున్న అనేక రుచులను పరిచయం చేయడమే ఈ తల్లీకొడుకుల ప్రధాన ఉద్దేశం. 

వండడానికి అంత చదవాలా!
‘అంత చదివించి కొడుకును వంటవాడిని చేశావా’ అనే విరుపులను ఏ మాత్రం పట్టించుకోరు రమ. ‘నేనెప్పుడూ నా పిల్లలకు ఇంజనీర్, డాక్టర్, లాయర్‌లు కావాలని చెప్పలేదు. ఏది చేసినా సరే సొంతంగా చేసి గెలిచి చూపించాలని మాత్రమే చెప్పేదాన్ని. చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు... సొంతంగా సంస్థను నడిపించాలి. ఉద్యోగిగా సౌకర్యవంతమైన స్థానంలో ఉండడం కంటే యజమానిగా సవాళ్లతో పోటీ పడుతూ గెలవడమే అసలైన జీవితం అని చెప్పాను. అదే చేస్తున్నాడు’ అంటారామె. ఆమె ప్రభావంతోనే రాకేశ్‌ యూఎస్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసిన తర్వాత అక్కడ ఉద్యోగ ప్రయత్నాలేమీ చేయలేదు. తన సొంత వ్యాపారం మొదలుపెట్టడానికి నేరుగా ఇండియాకి వచ్చేశాడు. వంటల షోతో తన సొంత బ్రాండ్‌ను రూపొందించుకున్నాడు.
కథలూ వండుతాడు

వండడంతోపాటు కథలు చెప్పడం రాకేశ్‌కి ఇష్టమైన మరో వ్యాపకం. అలాగే అతడు సంగీతకారుడు కూడా. తనలోని నైపుణ్యాలన్నింటినీ కలగలిపి వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాడు. దేశవిదేశాల్లో ఇప్పటి వరకు 75 వర్క్‌షాపులు నిర్వహించాడు. సంగీత కచేరీతోపాటు తమిళ సంప్రదాయ వంటలు వడ్డించడం, ప్రతి వంటకూ ఓ కథ చెప్పడం అతడి సృజనాత్మకత. ఆహార ప్రియులు, సంగీతప్రియులను ఒకచోట చేర్చిన అతడి ప్రయోగం విజయవంతమైంది. తన వంటలతో వంటల సీరీస్‌ చేసి ‘అమ్మవుమ్‌ నేనుమ్‌’ పేరుతో యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడతడు. 

నాలుక చేసే నాట్యం
‘‘మా అమ్మ చేసే పులియోగరే (పులిహోర) తింటే నాలుక ఆనందంగా నాట్యం చేస్తుంది. స్వర్గంలో విహరిస్తున్నట్లు ఉంటుంది. ఆ స్వర్గలోకపు విహారాన్ని అందరికీ చేరువ చేయడానికే వంటల షో చేస్తున్నాను. వండడం ఒక కళ. ప్రతి వంటగదిలోనూ ఆ కళ విరాజిల్లాలి. తమిళ సంప్రదాయ వంటల్లో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ ఉంటాయి. ఈ తరంలో వేప పువ్వు రసం గురించి తెలిసిన తమిళులు ఎంతమంది ఉన్నారు? చక్కటిపొంగలి చేయడం వచ్చిన యువత కోసం వెతకాల్సి వస్తోంది. వంట ఆకలి తీరుస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది. అందుకే వంటను గౌరవించాలి’’ అంటాడు రాకేశ్‌. అతడి మాటలు వింటే... యువకులు నేను సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పర్ట్‌ని, నేను బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ని అని చెప్పుకున్నంత గర్వంగా నేను ఫుడ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ని, షెఫ్‌ని అని కూడా చెప్పుకునే రోజు వస్తుందనే నమ్మకం కలుగుతోంది. ఆ రోజు వచ్చి తీరాలి. వంటకు గౌరవం పెరిగినప్పుడే మన ఇంటి వంటగదికి, ఆ వంటగదినే తన సామ్రాజ్యంగా మలుచుకున్న గృహిణికి ఆదరణ పెరుగుతుంది. 
– మంజీర 

మరిన్ని వార్తలు