మానవాళికి మహాభిక్ష

21 Mar, 2014 02:32 IST|Sakshi
మానవాళికి మహాభిక్ష

పుట్టగానే పడుకోబెట్టే ఊయల - వృక్షభిక్ష...
లేవగానే తాగే కాఫీ - వృక్షభిక్ష...
కాఫీ తాగుతూ చదివే వార్తాపత్రిక - వృక్షభిక్ష...
మనకు ఆయువైన వాయువు కూడా వృక్షభిక్షే!
 

మన జీవితం చెట్టుతో ఎంతగా మమేకమైపోయిందంటే... ఇరవై శాతం దాహానికీ, అరవై శాతం దేహారోగ్యానికీ దోహదపడేది వృక్షమే. వంటకాల్లో వాడే 70 శాతం దినుసులు వృక్షభిక్షే. గంధాలు, రకరకాల మకరందాలను ఆస్వాదిస్తూ జీవిస్తున్నామంటే అవన్నీ చెట్టు చలవే కదా. మన చిట్కా వైద్యాలన్నీ చెట్లు ప్రసాదించిన వరాలే.

వీనులవిందైన సంగీత సాధనాలు వృక్షభిక్ష. వనచర, భూచరాల గూళ్లకు ఆధారం వృక్షమే. మన ఇళ్ల నిర్మాణంలో కీలకమైనభాగస్వామ్యం వృక్షానిదే. ఇక పూజాదికాలలో ఇష్టదేవతల ప్రీత్యర్థం సమర్పించే కొబ్బరికాయ, కదళీఫలం, సాంబ్రాణి, అగరుబత్తి, దీపానికి అవసరమైన పత్తి వత్తి, ఆ వత్తిని వెలిగించే అగ్గిపుల్ల కూడా వృక్షం పెట్టిన భిక్షే. వేడుకల్లోకి వెళితే... భోగిపండుగ, వినాయక పత్రి వృక్షప్రసాదితాలే. మన మనుగడ వృక్షభిక్ష.

ధరించే దుస్తులు వృక్షభిక్ష, వృద్ధాప్యంలో ఊతకర్ర వృక్షభిక్ష, మరణించాక మన దేహాన్ని  మోసుకుపోయే పాడె కూడా వృక్షభిక్షే. తరువుల్ని నరకడం వల్ల పక్షులు కనిపించడం లేదు, పిండం పెట్టాలంటే కాకికి దండం పెట్టాల్సి వస్తోంది. ఆలోచించండి. చెట్టు సాంగత్యం లేని మనిషి జీవితాన్ని ఊహించనైనా చేతనవుతుందేమో!?
 

మరిన్ని వార్తలు