ఒంటి కన్ను ‘పులి’

11 Apr, 2014 23:14 IST|Sakshi
ఒంటి కన్ను ‘పులి’

ఒక కన్ను మూసుకుని.. మరో కన్నుతో చుట్టూ పరిసరాలను గమనించండి.. కనీసం ఐదు నిమిషాలు కూడా చూడలేని పరిస్థితి మనది. కానీ ఆ ఒంటి కన్నుతోనే 14 ఏళ్ల పాటు ప్రత్యర్థి జట్ల బౌలర్లు సంధించిన పదునైన బంతులను హెల్మెట్ కూడా ధరించకుండా తుత్తునియలు చేసిన వీరుడొకరున్నాడు. భయమనేది లేకుండా క్రికెట్ మైదానంలో చూపిన ఈ తెగువకు అందరూ అతడిని ముద్దుగా ‘టైగర్’ అని పిలుచుకున్నారు. అతనెవరో కాదు.. భారత క్రికెట్‌కు అత్యంత పిన్న వయస్సులోనే కెప్టెన్‌గా వ్యవహరించిన మన్సూర్ అలీఖాన్ పటౌడీ.     
- రంగోల నరేందర్ గౌడ్
 
పటౌడీలది నవాబుల వంశం. తన 11వ పుట్టిన రోజునాడే తండ్రి ఇఫ్తికార్ అలీ ఖాన్ మరణించడంతో భోపాల్, పటౌడీ ప్రాంతాలకు మన్సూర్‌ను నవాబ్‌గా ప్రకటించారు. ఇంగ్లండ్‌లో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లినప్పటి నుంచే జూనియర్ పటౌడీలో క్రికెట్ సత్తా బయటపడింది. వించెస్టర్ కాలేజీలో టాప్ క్రికెటర్‌గా పేరుతెచ్చు కున్నాడు. 1957లో 16 ఏళ్ల వయస్సులో ససెక్స్ తరఫున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. 1959లో స్కూల్ కెప్టెన్‌గా వ్యవహరించి ఆ సీజన్‌లో 1068 పరుగులు సాధించి పాత రికార్డులు బద్దలు కొట్టాడు. యూనివర్సిటీ స్థాయిలో ఆక్స్‌ఫర్డ్‌కు ఆడడమే కాకుండా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి భారతీయుడయ్యాడు.
 
అప్పటివరకు కెరీర్ జోరుగా సాగుతున్నా.. 1961లో అతడి జీవితంలో విషాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో తన కుడి కన్నులో అద్దాలు గుచ్చుకోవడంతో చూపు పోయింది. అటు మిగిలిన కంటితో చూసే దృశ్యాలు కూడా స్పష్టంగా కానరాని పరిస్థితి. ఇక మన్సూర్ క్రికెట్ కెరీర్ ముగిసినట్టే అని అంతా అనుకున్నారు. కానీ తన కెరీర్ ఇంత నిస్సారంగా ముగిసేందుకు వీల్లేదని పటౌడీ నిర్ణయించుకున్నాడు. నెట్స్‌లో తీవ్రంగా సాధన చేయడం ప్రారంభించాడు.

ఉన్న ఒక్క కంటితోనే ఆడటమెలాగో నేర్చుకున్నాడు. కుడి కంటికి జరిగిన ప్రమాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఎందుకంటే పటౌడీ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. ఈ బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువగా ఉపయోగపడేది ఎడమ కన్నే. ఈ ప్రమాదం జరిగిన ఆరు నెలల్లోపే పటౌడీ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడంటే ఆ 20 ఏళ్ల కుర్రాడి పట్టుదల ఏమిటో స్పష్టమవుతుంది.

1961 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌తో తన తొలి టెస్టును ఆడగా మద్రాస్‌లో జరిగిన మూడో టెస్టులో సెంచరీ సాధించి ఇంగ్లండ్‌పై తొలిసారిగా సిరీస్ విజయం సాధించేలా చేశాడు. ఆ త ర్వాత ఏడాదికి విండీస్ పర్యటనలో ఉన్న జట్టుకు పటౌడీ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. అప్పటికి అతడి వయస్సు కేవలం 21 ఏళ్ల 77 రోజులు మాత్రమే.

ఇంత చిన్న వయస్సులో జట్టు సారథిగా ఎన్నికవ్వడం అప్పటికి ప్రపంచ రికార్డు. ఆ తర్వాత తైబు (జింబాబ్వే) ఈ రికార్డు బ్రేక్ చేసినా భారత్ నుంచి మాత్రం ఇప్పటికీ తనదే రికార్డు. కెరీర్‌లో ఆడిన 46 టెస్టుల్లో 40 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న పటౌడీ భారత్ నుంచి అత్యంత గొప్ప సారథిగానూ పేరు తెచ్చుకున్నాడు.

ఆయన కాలంలోనే విదేశీ గడ్డ (1968, కివీస్)పై భారత్ తొలిసారి టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. 1975లో కెరీర్‌ను ముగించిన తను 2,793 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలుండగా అత్యధిక స్కోరు 203 నాటౌట్. 1968లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన పటౌడీ 2011లో లంగ్ ఇన్ఫెక్షన్‌తో మృతి చెందారు.
 

మరిన్ని వార్తలు