దీర్ఘాయుష్షు కిటుకు రూఢీ అయింది..

4 Oct, 2018 00:37 IST|Sakshi

కాయగూరలు, పండ్లు బాగా తింటే ఆయుష్షు పెరుగుతుందనేది చాలామంది నమ్మిక. ఇందులో నిజం లేకపోలేదు కూడా. కాకపోతే ఇదెలా జరుగుతోందన్నది మాత్రం తాజా పరిశోధన ద్వారా తెలిసింది. కాయగూరలు, పండ్లలో ఉండే ఫిసెటిన్‌ అనే ఫ్లేవనాయిడ్‌ పాడైపోయి.. విభజన ఆగిపోయిన కణాలను శరీరం నుంచి బయటకు పంపడంలో ఉపయోగపడతాయని, ఫలితంగా ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా మెరుగవుతుందని ఈ అధ్యయనం చెబుతోంది. సాధారణ పరిస్థితుల్లో మన రోగ నిరోధక వ్యవస్థ పాడైన కణాలను తొలగిస్తూంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యమూ తగ్గిపోవడం వల్ల పాడైన కణాలు శరీరంలో పోగుపడుతూంటాయి.

ఈ పరిణామం కాస్తా మంట, వాపులకు.. తద్వారా వ్యాధులకు దారితీస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో పాడైన కణాలను శరీరం నుంచి తొలగించే మందుల తయారీకి ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. పది ఫ్లేవనాయిడ్లపై పరిశోధనలు జరగ్గా ఫిసెటిన్‌తో మంచి ఫలితాలు ఉన్నట్లు తెలిసింది. ఎలుకలతోపాటు మానవ కణజాలంపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు రావడంతో మానవ ప్రయోగాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫిసెటిన్‌ అనేది సహజసిద్ధమైన పదార్థం కావడం వల్ల మానవ ప్రయోగాలూ సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పాల్‌ రాబిన్స్‌ అంటున్నారు. 

మరిన్ని వార్తలు