నాలాగే ఎందరో!

23 Apr, 2014 23:16 IST|Sakshi
నాలాగే ఎందరో!

కనువిప్పు
 
అమ్మాయిలు కనిపిస్తే చాలు కామెంట్ చేయడం అనే అలవాటు నాకు ఉండేది. కాలేజిలో నా ముందు నుంచి  ఎవరైనా అమ్మాయి వెడితే చాలు... రకరకాల కామెంట్లు చేసేవాడిని. నేను కామెంట్ చేస్తుంటే ఫ్రెండ్స్ తెగ ఎంజాయ్ చేసేవాళ్లు. ఒకసారి ఒక అమ్మాయిని ఏడిపిస్తే చాలా పెద్ద గొడవ జరిగింది.
ప్రిన్సిపాల్‌గారు పిలిచి నన్ను బాగా తిట్టారు.
 
అయినా నాలో ఎలాంటి మార్పూ రాలేదు. ఎప్పుడూ ఎవరో ఒక అమ్మాయిని ఏదో రకంగా ఏడిపిస్తూనే ఉండేవాడిని. ఒకరోజు ప్రిన్సిపాల్‌గారు మా నాన్నను పిలిచి నా ప్రవర్తన గురించి పూసగుచ్చినట్లు చెప్పారు. ఇంకోసారి కంప్లైంట్  వస్తే కాలేజి నుంచి డిస్‌మిస్ చేస్తానని హెచ్చరించారు.
 ఆరోజు నాన్న కొట్టడం ఒక్కటే తక్కువ.
 ‘‘నా వయసులో ఎవరైనా  ఇలాగే చేస్తారు. ఏదో సరదాగా చేస్తుంటాను. అంత సీరియస్ కావడం దేనికి?’’ అన్నాను నేను.
 ‘‘నిన్ను ఆ దేవుడు కూడా మార్చలేడు’’ అని తిడుతూ బయటికి వెళ్లారు నాన్న.
 దేవుడు మార్చలేదుగానీ...ఒక సంఘటన నన్ను పూర్తిగా మార్చేసింది.
 మా చెల్లిని ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్లమని అమ్మ చెబితే తీసుకెళ్లాను. వెనక నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
 ‘‘ఏం ఫిగర్ గురూ!’’
 ‘‘కాస్త లావుగా ఉందిగానీ..’’
 కోపంతో వెనక్కి తిరిగి చూశాను. పెద్ద గుంపు ఉంది. కండలు తిరిగి దృఢంగా ఉన్నారు. వాళ్లతో గొడవ పడితే ఎముకల్లో సున్నం లేకుండా కొడతారని ఊహించడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఆ రోజంతా విపరీతంగా బాధ పడ్డాను.
 ‘‘నీకు బాధ పడే అర్హత ఉందా?’’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఎందుకంటే అలాంటి కామెంట్స్ ఎన్నో సార్లు చేసి ఉన్నాను. నాలాగే ఎందరో బాధ పడి ఉంటారు. ఇక అప్పటి నుంచి ఏ అమ్మాయినీ పొరపాటున కూడా కామెంట్ చేయలేదు.
 

- వి.ఆర్, ఒంగోలు
 

మరిన్ని వార్తలు