సిక్స్‌ప్యాక్‌ ట్రై చేస్తున్నారా?

4 Nov, 2019 02:49 IST|Sakshi

యాబ్స్‌ అబ్సెషన్‌

తీవ్రమైన యాబ్స్‌ వ్యాయామాల వల్ల పొట్ట దగ్గర దహించడానికి కొవ్వు దొరకనప్పుడు... ముఖంపైనా, భుజాల్లోనా ఉన్న కొవ్వును ఈ వ్యాయామాలు దహించి వేస్తాయి. అందుకే సిక్స్‌ ప్యాక్‌ కోసం శ్రమించే వారి ముఖం, బుగ్గలలోని కొవ్వు పూర్తిగా దహనమైపోయి వారి బుగ్గలు లోపలికి పీక్కుపోయినట్లు అవుతుంది.

సిక్స్‌ ప్యాక్స్‌ అంటూ కడుపుపైన ఉండే ఆరు కండరాలు స్పష్టంగా కనిపించేలా వ్యాయామాలు చేయడం చాలామందికి ఇష్టం. ఇందుకోసం కడుపు కండరాలకు చాలా ఎక్కువ శ్రమ కలిగేట్లుగా ‘యాబ్స్‌ ఎక్సర్‌సైజ్‌’లు చేస్తుంటారు. మనిషుల్లో ప్రతి ఒక్కరికీ కడుపుపైనా యాబ్స్‌ కండరాలు ఉంటాయి. అవి ప్రస్ఫుటంగా పైకితేలేందుకు చేసే వ్యాయామాల్లో ఒక జాగ్రత్త పాటించడం మంచిది. అదేమిటో తెలుసుకునే ముందర అసలు మన దేశవాసు ల్లో పొట్ట ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.

పొట్ట ఎందుకొస్తుంది
అప్పట్లో మన దేశంలో తరచూ కరువులు వస్తుండేవి. ఆహారం దొరకని సమయాల్లో.... తనకు తిండి దొరికినప్పుడే ఆ అదనపు ఆహారాన్నికొవ్వు రూపంలో నిల్వ ఉంచుకునేలా శరీరం తనను తాను సంసిద్ధం చేసుకుంటుంది.  జీవులు తమ మనుగడ కోసం అనుసరించే ‘అడాప్టేషన్‌’ ప్రక్రియలో భాగంగా ఇది జరుగుతుండేది. 17, 18వ శతాబ్దాల్లో తరచూ కరవులు వచ్చే సమయంలో వాటిని అధిగమించి మనుగడ సాధించేందుకు వీలుగా మన దేశవాసుల్లో... (మరీ ముఖ్యంగా దక్షిణభారతదేశ వాసుల్లో) ఇలా ఒక జన్యుపరివర్తన జరిగింది. ఆ జన్యువు ప్రాబల్యంతో ఒక వయసు తర్వాత పొట్ట చుట్టూ  కొవ్వు పేరుకోవడం మొదలైంది.

ఆహారం దొరకని సమయాల్లో ఆ కొవ్వును వినియోగించుకోడానికి వీలుగా ఈ జన్యుపరివర్తన సంభవించిందని దక్షిణ భారత దేశ జన్యుపటలంపై అధ్యయనం చేసిన కొందరి సిద్ధాంతమిది. అయితే ఇప్పుడు హరిత విప్లవం తర్వాత ఆహార ధాన్యాల లభ్యత బాగా పెరిగింది.  పైగా స్వాతంత్య్రానంతరం దేశంలోని ఒక చోటి నుంచి మరొక చోటికి రవాణా సౌకర్యాలు విస్తరించాయి. ఆ కారణంగా ఆ ధాన్యాలను ఎక్కడికైనా తరలించడం సులభం కావడంతో మొదట్లోలా కరువుకాటకాలు తగ్గిపోయాయి. కానీ మన దేహంలో పొట్ట వచ్చేందుకు దోహదపడే జన్యువు కారణంగా పొట్ట రావడం మాత్రం ఒక వయసు తర్వాత అలాగే కొనసాగుతూ ఉంది.

సిక్స్‌ ప్యాక్‌ ఎలా ప్రమాదం?
మనం పొట్టపైన కండరాలను పైకి తేలించేందుక తీవ్రమైన యాబ్స్‌ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నప్పుడు... అవి కేవలం పొట్టపైన ఉన్న కొవ్వును మాత్రమే గాక... శరీరంలోని ఇతర ప్రాంతాల్లోని కొవ్వునూ దహనం చేస్తాయి. మన శరీరంలోని కొవ్వు చాలా ప్రాంతాల్లో నిల్వ ఉంటుంది. ఉదాహరణకు ముఖంలోని చెంపల భాగంలో, భుజాల్లో కొవ్వు పేరుకుంటుంది. అందుకే కొందరిలో మరీ ఎక్కువగా కొవ్వు చేరి ఉండటం వల్ల
బుగ్గలు బూరెల్లా, భుజాలూ గుండ్రంగా కనిపిస్తుంటాయి.

తీవ్రమైన యాబ్స్‌ వ్యాయామాల వల్ల పొట్ట దగ్గర దహించడానికి కొవ్వు దొరకనప్పుడు... ముఖంపైనా, భుజాల్లోనా లేదా కీలక అవయవాల రక్షణ కోసం ఉన్న కొవ్వును ఈ వ్యాయామాలు దహిస్తాయి. అందుకే సిక్స్‌ ప్యాక్‌ కోసం  చాలా తీవ్రంగా శ్రమించే వారి ముఖం, బుగ్గలు లోపలికి పీక్కుపోయినట్లు కనిపిస్తాయి. సిక్స్‌ప్యాక్‌ కోసం వ్యాయామం చేసేవారు ఒక జాగ్రత్త పాటించాలి. తమ ముఖం పూర్తిగా పీక్కుపోయినట్లుగా అయిపోయి... ముఖం ఆకృతి మారిపోయేలా ఉన్న దశలో ఆ వ్యాయామాల్ని ఆపేయాలి.

ముఖం అందం తగ్గేంత వ్యాయామం చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఒకసారి సిక్స్‌ప్యాక్‌ సాధించాక అది ఎప్పటికీ అలాగే ఉండిపోదు.  అదలా ఉండిపోవడం కోసం ఎప్పుడూ యాబ్స్‌ వ్యాయామాల్ని కొనసాగిస్తూనే ఉండాలి. లేదంటే మన జన్యువుల వల్ల మళ్లీ పొట్ట చుట్టూ కొవ్వు చేరుతూ ఉంటుంది. మీకు మీ ముఖ ఆకర్షణ కూడా ముఖ్యమేనా లేక యాబ్స్‌ పట్లనే అబ్సెస్‌ అయి ఉన్నారా అన్నది మీరే తేల్చుకుని, మీ వ్యాయామ తీవ్రతను ఎంచుకోవాలి.

మరిన్ని వార్తలు