కొవ్వులన్నీ హానికరమేనా?

17 Oct, 2019 02:33 IST|Sakshi

చాలా మంది కొవ్వులను హాని చేసే ఆహారపదార్థంగా చూస్తారు. నూనెలతో చేసిన పదార్థాలంటేనే చాలు... ఆమడ దూరం పరిగెడుతుంటారు.  నూనెను ఉపయోగించాల్సి వస్తే... కొలెస్ట్రాల్‌ ఫ్రీ ఆయిల్‌ను వాడుతుంటారు. నిజానికి వెజిటబుల్‌ కింగ్‌డమ్‌లోని మొక్కల నుంచి కొలెస్ట్రాల్‌ ఎంతమాత్రమూ తయారుకాదు. మనం వాడే నూనెలన్నీ మొక్కల గింజల నుంచే వస్తాయి కాబట్టి అవన్నీ కొలెస్ట్రాల్‌ లేనివే.

కొవ్వుల గురించి తెలుసుకుందాం...
మన ఆహారంలో కొవ్వులు ఎంతగానో అవసరం. ఎందుకంటే 1 గ్రాము కొవ్వు నుంచి 9 క్యాలరీల శక్తి లభిస్తుంది.  కొవ్వుల్లో 1) మోనో– అన్‌శాచురేటెడ్, 2) పాలీ–అన్‌శాచ్యురేటెడ్, 3) శాచురేటెడ్, 4) ట్రాన్స్‌ఫ్యాట్‌... అనే నాలుగు రకాల కొవ్వులు ఉంటాయి. వీటిలో మొదటి మూడురకాల కొవ్వులు పరిమితంగా అవసరమే.  మోనో–అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌... వేరుశనగ, ఆలివ్‌ ఆయిల్‌ వంటి నూనెల్లో ఉంటాయి. ఇక సఫోలా, పన్‌ఫ్లవర్, వేరుశనగతోపాటు, అవకాడో వంటి నూనెల్లో పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి.

వీటిలో మోనో–అన్‌శాచురేటెడ్, పాలీ–అన్‌శాచురేటెడ్‌ నూనెలను మార్చి మార్చి వాడుతూ ఉండటం వల్ల అవి గుండెకు ఒక రక్షణగా పనిచేస్తుంటాయి. నమ్మలేకపోయినా ఇది వాస్తవం. ఇక నెయ్యి, డాల్డా వంటివాటిని శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌గా పేర్కొంటాం. వీటిని చాలా చాలా పరిమితంగా మాత్రమే వాడాలి. ఇక చేపలు, చేపనూనె, సోయాబీన్‌నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అనే తరహా ఆరోగ్యకరమైన పాలీ అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు ఎక్కువ. ఇవి ఎక్కవగా తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.  

కొవ్వులతో ప్రయోజనాలివి...
నూనెల వల్ల ఒంట్లోకి పేరుకునే కొవ్వులు బయటి వేడిమి, చల్లదనం నుంచి ఒంట్లోని అంతర్గతఅవయవాలను కాపాడతాయి. కిడ్నీలు, కాలేయం, గుండె వంటివాటికి ప్యాడింగ్‌గా ఉండటంతో పాటు షాక్‌అబ్జార్బర్స్‌లా కూడా పనిచేస్తాయి. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఉదరంలోని అవయవాల చుట్టూ ఉండే కొవ్వును విసరల్‌ ఫ్యాట్‌ అంటారు. ఇది అధికంగా ఉండే గుండెజబ్బులు ఎక్కువగా వస్తాయి. ఇదీ పరిమితి...ఒక థంబ్‌రూల్‌ నియమం ప్రకారం... ప్రతి ఒక్క వ్యక్తి నెలకు అరలీటర్‌ (500 ఎమ్‌ఎల్‌) నుంచి ముప్పావులీటర్‌ (750 ఎమ్‌.ఎల్‌)కు మించకుండా నూనె వాడటం మంచిది.

అంతకంటే మించితే అది చేటు చేస్తుంది. ఆ పరిమితికి మించితే అది స్థూలకాయం, గుండెజబ్బులు, డయాబెటిస్, ఆర్థరైటిస్, అధికరక్తపోటు వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంటుంది. మాంసాహారులు వారానికి కనీసం మూడుసార్లకు తగ్గకుండా చేపలు తినడం మంచిది. ఇక మనకు కనిపించకుండా వాడే కొవ్వులు (ఇన్విజిబుల్‌ ఫ్యాట్స్‌)... అంటే నట్స్, డ్రైఫ్రూట్స్, మాంసాహారాలు, పాలు వంటి వాటిల్లో ఉండే కొవ్వులను పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. కొందరు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటుందంటూ గుడ్ల జోలికే పోరు. కానీ మన ఒంట్లోకి ఆహారంతో వచ్చే కొలెస్ట్రాల్‌ కేవలం 16% మాత్రమే. మిగతాదంతా మన కాలేయంలోనే తయారవుతుంది.

కాబట్టి కొలెస్ట్రాల్‌ భయంతో గుడ్లకు దూరంగా ఉంటే ఆరోగ్యానికీ, ప్రోటీన్లకూ దూరంగా ఉన్నట్లే. అందుకే గుడ్లను తప్పనిసరిగా తినాలి. 1990లలో అమెరికన్‌ గైడ్‌లైన్స్‌ వల్ల కొవ్వుల వినియోగం బాగా తగ్గి... అదే సమయంలో రిఫైన్‌డ్‌ కార్బోహైడ్రేట్ల వినియోగం బాగా పెరిగింది. ఈ కార్బోహైడ్రేట్ల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. దాంతో కొవ్వుల వినియోగం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ కొవ్వులు మళ్లీ ప్రమాదకరం కాబట్టి... అందుకు బదులుగా ఎక్కువ ప్రోటీన్‌తో పాటు ఎక్కువ పీచుపదార్థాలు ఉండే ఆహారం తీసుకోవడం మేలు.

కృత్రిమ కొవ్వులు మాత్రం డేంజరే...
ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసేందుకు మార్జరిన్‌ వంటి కొవ్వులను ఉపయోగిస్తుంటారు. ఇవే ట్రాన్స్‌ఫ్యాట్స్‌ అంటూ మనం పిలిచే నాలుగో తరహా కొవ్వులు. వీటిని చాలాకాలం నిల్వ ఉండాల్సిన (షెల్ఫ్‌ లైఫ్‌ ఎక్కువగా ఉండాల్సిన) చిప్స్, బేకరీ ఉత్పాదనల్లో వాడుతుంటారు. వాటి నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ దూరంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది.
డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ,
సీనియర్‌ కార్డియాలజిస్ట్,
మాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్‌ మాదాపూర్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు