ఆధ్యాత్మికం ఆరోగ్యం సామాజికం

3 Nov, 2019 03:42 IST|Sakshi

శివకేశవులకి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో భక్తులంతా భగవన్నామ స్మరణలో మునిగి తేలుతూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఉపవాసం, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే కార్తీకమాసంలో ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి.

దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి ‘ఆశుతోషుడు’ అని పేరు.

విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి. శక్తిలేని వారు ఉదయం స్నానం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు పళ్ళు తీసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీ మాసంలో చేసుకునే వ్రతాలు.

ఈ మాసంలో ఇవి చేయడం మంచిది: ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం నియమనిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలం చెప్పనలవి కానిది.

కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహరణలను బట్టి తెలుసుకోవచ్చు.

కార్తీకమాసంలో ప్రతిరోజూ విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. ఇంట్లో కూడా ప్రతిరోజూ సంధ్యాదీపాన్ని వెలిగించాలి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం. ఈ మాసమంతా కార్తీకపురాణాన్ని రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం.

ఈ మాసంలో ఇవి చేయరాదు
తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోవడం, ద్రోహ బుద్ధి, పాపపు ఆలోచనలు, దైవదూషణ, దీపారాధనలకు తప్ప నువ్వుల నూనెను ఇతరత్రా అవసరాలకు ఉపయోగించడం, మినుములు తినడం, నలుగుపెట్టుకుని స్నానం చేయడం.

వృక్షారాధన
విగ్రహారాధన ఏర్పడక ముందు, మన పూర్వీకులు ప్రకృతినే పూజించేవారు. వారి దృష్టిలో తమకు ఆహారాన్నీ, నీడనూ, నారబట్టలనూ అందించే వృక్షాలు గొప్ప దేవతలు.  మనిషి ఎంతగా ఎదిగినా ప్రకృతికి లోబడక తప్పదని పెద్దలకు తెలుసు. అందుకే వృక్షాలను కూడా దేవతార్చనలో భాగం చేశారు. వినాయక చవితి, క్షీరాబ్ది ద్వాదశి వంటి సందర్భాలలో అయితే వృక్షాలదే ప్రధాన పాత్ర. అలాంటి వృక్షాలలో ప్రధానమైన ఉసిరికి కార్తీక మాసంలో వీలైనంత ప్రాధాన్యతను ఇచ్చారు.

ఈ మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తూ విష్ణుమూర్తిగా భావించి పూజించాలన్నది పెద్దల మాట. కార్తీక సోమవారం లేదా మాసంలోని ఏదో ఒకరోజు ఉసిరిచెట్టు కింద భోజనం చేయడం మంచిది. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షింతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండిత సత్కారం చేసి భగవన్నామ స్మరణతో భోజనం చేయడం వల్ల  సర్వపాపాలు నశిస్తాయని నమ్మకం.

బిల్వపత్రాలతో... తులసి దళాలతో...
మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును ‘శివేష్ట’ అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలం. అంటే సిరిని తెచ్చే ఫలమని అర్థం. మారేడు పత్రాలు త్రిశిఖలా మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని,  మోక్షం ప్రాప్తిస్తుందనీ శాస్త్రోక్తి. కనుకనే శివపూజలో బిల్వ పత్రాలు తప్పనిసరిగా ఉంటాయి. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వవృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు.

బిల్వ పత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత కూడా దాగి ఉంది. ఈ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చడం వంటికి మేలు. జబ్బులు రావు. బాహ్య, అంతః కరణాలు శుద్ధిగా వుండేట్లు చేసి, దేహాన్ని శ్రేష్ఠంగా ఉంచుతుంది. గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్ఛత కోల్పోయే అవకాశం వుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్ఛతను కలుగచేస్తాయి. అది మారేడు విశిష్టత. వాతావరణంలో ఎక్కడ చెడు ఉన్నా, దాన్ని హరించి మెరుగుపరచడమే మారేడు లక్షణం.ఇన్ని విశిష్టతలున్నాయి కనుకనే శివుడికి మారేడు అంటే  ప్రీతి. ఇక విష్ణుపూజలో తులసిని విరివిగా వాడుతారు.

తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుందని, తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవని, ఉదయాన్నే తులసిని దర్శించుకోవడం సకల పాపహరమనీ ప్రతీతి. Mఅయ్యప్ప దీక్ష, సాయి దీక్ష, భవానీ దీక్ష, హనుమద్దీక్ష... ఇలా వివిధ దీక్షలు తీసుకునేవారు, గోవిందమాల, శివమాల... ఇలా వివిధ మాలల ధారణ చేసేవారు సాధారణంగా కార్తీకమాసంలోనే చేయడం సంప్రదాయం. ఇవన్నీ నియమబద్ధ జీవనానికి మార్గదర్శనం చేస్తాయి. శరీరమే కాదు, అంతఃకరణ కూడా పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. అప్పుడే ఈ మాసంలో ఆచరించే నియమాలకు సార్థకత.

– డి.వరలక్ష్మి

కార్తీక మాసంలో సాగే వనభోజనాలు మన సంప్రదాయాలను చాటిచెబుతాయి. ‘వనం’ అనే పదానికి ‘అరణ్యాన్ని ప్రేమించడమ’ని అమరకోశం చెబుతుంది. కార్తీకమాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో, విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేసినవారి సకల పాపాలూ తొలగిపోతాయన్నది పురాణంలోని మాట. కార్తీకమాసపు రోజుల్లో బయట గడిపేందుకు వాతావరణం అనువుగా ఉంటుంది. వర్షాలు అప్పటికి తగ్గుముఖం పడతాయి కాబట్టి కీటకాల బెడద కూడా అంతగా ఉండదు. చెట్లన్నీ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి.

ఆరుబయల్లో అందరూ కలిసి వంటలు వండుకోవడానికైనా, ఔషధ భరితమైన ఉసిరి వంటి చెట్ల గాలిని పీల్చుకోవడాని కైనా వనభోజనాలు సరైన సందర్భాలు. అందరూ కుటుంబాలతో వెళ్లడం, చెట్ల కింద రకరకాల వంటలు వండుకుని తినడం ఒక అనుభవం. అయితే... ఉసిరి చెట్టు ఉన్న వనంలో వనభోజనాలు చేయడం ఆరోగ్యకరం అంటారు పెద్దలు. వినోదం, ఆరోగ్యం, సామాజికం... ఇలా ఏ కోణంలోంచి చూసినా వన భోజనాలకు సాటి మరో సందర్భం కానరాదు! కార్తీక పురాణంలో కూడా వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ సంప్రదాయాన్ని తరచి చూస్తే వనభోజనానికి ఎందుకంత ప్రాధాన్యతో అర్థమవుతుంది.

తులసి పూజ..
తులసి ఇంటి ప్రాంగణంలో ఉండటం ఆ ఇంటి వారి సాంప్రదాయ నిష్టను సూచిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున తులసి పూజ చేయాలి. ఆవు నెయ్యితో తడిపిన వత్తులతో దీపాలు వెలిగించాలి. తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి, పరమాన్నం నివేదించాలి. అనంతరం 365 వత్తులతో హారతి ఇవ్వాలి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు