సిరుల తల్లికి మార్గశిర మాసోత్సవాలు

24 Nov, 2019 04:11 IST|Sakshi

ఉత్తరాంధ్ర జిల్లా వాసులకు సత్యంగల తల్లిగా.. కోరిన వరాలిచ్చే కల్పవల్లిగా, ఆంధ్రజనావళికి అమ్మగా భాసిల్లుతోంది విశాఖపట్నం నగరం ఓడరేవు ప్రాంతంలో బురుజుపేటలో వెలసిన శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు. తనని సేవించడానికి వర్ణ, వర్గ వివక్షతలేవి ఉండకూడదని అమ్మవారు తనకు గుడి కట్టవద్దని భక్తులకు ఆదేశం ఇవ్వడంతో ఆ తలంపును విరమించుకున్నారు. పూజలు చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఎవరికి వారే అమ్మవారికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించి సేవించుకొనే సంప్రదాయం ఈ ఆలయ ప్రత్యేకత.

 శ్రీకనక మహాలక్ష్మీ విగ్రహం ఇతర దేవాలయాల వలే గాక గోపురం లేని బహిరంగ మండపంలో ప్రతిష్ఠింపబడింది. భక్తులు తమకు పుట్టిన పసికందును కూడా అమ్మవారి ఒడిలో ఉంచి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతుంటారు. అమ్మవారికి ప్రీతికరమైన గురువారం తెల్లవారింది మొదలు రాత్రి వరకు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలతో పూజించి, నారికేళం సమర్పించడానికి వచ్చే భక్తులకు అంతుండదు. అమ్మవారి ఆలయం 24 గంటలు తెరిచే ఉంటుంది. ఎప్పుడైనా దర్శించుకోవచ్చు.

రాష్ట్రంలో 10 దేవాలయాల్లో ఒకటి
రాష్ట్రంలోని పది ప్రధాన దేవాలయాల్లో కనకమహాలక్ష్మి దేవాలయం ఒకటి. మార్గశిర మాసోత్సవాల్లో నెలరోజులు నిత్యకల్యాణం, పచ్చతోరణంగా అమ్మవారి సన్నిధి కనబడుతోంది.

మార్గశిర మాసోత్సవాలు..
శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 26 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మార్గశిర మాసోత్సవాల్లో వచ్చే గురువారాల్లో లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నెల 28, డిసెంబరు 5, 12, 19, 26 తేదీల్లో వచ్చే గురువారాల్లో ప్రత్యేకపూజలు, పంచామృతాభిషేకాలు, విశేషపూజలు నిర్వహిస్తుంటారు. డిసెంబర్‌ 15న వేదసభ, 21న రథోత్సవం, 22న అర్చక సదస్సు, 26న సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. 19న మహాన్నదానం జరపనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో మాదిరిగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు. మార్గశిర  మాసం చివరి గురువారం మరింత పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టనున్నారు.
- చిటికిరెడ్డి వెంకటరమణ, సాక్షి, విశాఖ దక్షిణ

మార్గశిర గురువారాల్లో జరిగే విశిష్ట కార్యక్రమాలు
►బుధవారం రాత్రి(తెల్లవారితే గురువారం)
►12.05 నుంచి 1.30 గంటల వరకు విశేష పంచామృతాభిషేక సేవ, సహస్ర నామార్చన పూజ, స్వర్ణాభరణ అలంకరణ
►1.30 నుంచి ఉదయం 11.30 గంటల వరకు సర్వదర్శనం
►11.30 నుంచి 12 గంటల వరకు మహానివేదన(రాజభోగం)
►మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వదర్శనం
►సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు అమ్మవారికి విశేష పంచామృతాభిషేక సేవ, సహస్ర నామార్చన , స్వర్ణాభరణ అలంకరణ
►రాత్రి 7 గంటల నుంచి సర్వదర్శనం, సాంస్కృతిక కార్యక్రమాలు

►ఉదయం 5 నుంచి 6 గంటల వరకు పంచామృతాభిషేకం, అమ్మవారికి సహస్ర నామార్చన
►ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సర్వదర్శనం
►11.30 నుంచి మ«ధ్యాహ్నం 12.30 గంటల వరకుపంచామృతాభిషేకం, అష్టోత్తర నామార్చన
►12.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సర్వదర్శనం
►సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు  విశేష పంచామృతాభిషేకం
►రాత్రి 7 నుంచి వేకువజాము 4.30 గంటల వరకు సర్వదర్శనం
►మండపంలో జరుగు వైదిక కార్యక్రమాలు.. (గురువారం మినహా..)
►ఉదయం 8 నుంచి 10 గంటల వరకు పంచామృతాభిషేకం, శ్రీచక్ర నవావర్ణార్చన
►ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు  మార్గశిర మాస విశేష కుంకుమార్చన
►ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మార్గశిర మాస శ్రీలక్ష్మీ పూజ, వేదపారాయణ, మహావిద్యా పారాయణ, సప్తశతీ పారాయణ
►ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు అష్టోత్తర కుంకుమార్చన

మరిన్ని వార్తలు