ఆ మత్తుతో... ఎన్నో ప్రయోజనాలు

12 Sep, 2018 00:58 IST|Sakshi

గంజాయి దమ్ము బిగించి కొడితే మత్తులో తేలిపోతామని చాలామంది అనుకుంటారుగానీ.. ఆ మత్తు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకూ చెక్‌ పెడుతుందని చెబుతున్నారు యూనివర్శిటీ ఆఫ్‌ న్యూ మెక్సికో శాస్త్రవేత్తలు. దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని వీరు తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. మొబైల్‌ అప్లికేషన్‌ ఆధారంగా వీరు ఈ అధ్యయనం నిర్వహించారు. విపరీతమైన నొప్పి, నిద్రలేమి, మూర్ఛ, మానసిక కుంగుబాటు వంటి దాదాపు 27 ఆరోగ్య సమస్యలకు సంబంధించి దాదాపు లక్ష మంది నుంచి సమాచారం సేకరించి విశ్లేషించారు.
 

గంజాయితో తమ లక్షణాలు దాదాపు సగానికి తగ్గిపోయాయని అధ్యయనంలో పాల్గొన్న వారు ‘రిలీఫ్‌’ ఆప్‌ ద్వారా తెలపడం విశేషం. గంజాయి మొగ్గలను నేరుగా వాడటం ద్వారా చాలామంది నిద్రలేమి సమస్యలను అధిగమించారని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జాకబ్‌ మిగ్యుల్‌ విజిల్‌ తెలిపారు. అల్లోపతి వైద్యవిధానంలో ఇచ్చే మందులతో అనేక దుష్ప్రభావాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గంజాయి ప్రభావశీలతపై  విస్తత స్థాయిలో సమాచారం సేకరించే లక్ష్యంతో తాము ఈ అధ్యయనం జరిపినట్లు విజిల్‌ అంటున్నారు.  

మరిన్ని వార్తలు