మూడు ముళ్ల అబద్ధం

4 Apr, 2019 00:13 IST|Sakshi

వంద అబద్ధాలు చెప్పి అయినా ఒక పెళ్లి చేయాలని పెద్దలు అంటారు.అబద్ధం ఎందుకు చెప్పాలి? నిజాలు చెప్పి పెళ్లి చెయ్యలేమా?అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు కాదా?వంద నిజాలు చెప్పాక, వాటికి అంగీకరించిపెళ్లికి ఇరుపక్షాలూ రాజీపడితే, అప్పుడు పెళ్లి జరిగితే భార్యాభర్తల మధ్య పొరపొచ్ఛాలకు తావుండదు.ఒక్క నిజం మీద నిలబడిన పెళ్లి వంద అబద్ధాల మీద నిలబడిన పెళ్లి కంటే దృఢమైనది.

పెళ్లి గురించి ఆడపిల్ల ఎన్నో కలలు కంటుంది.నిజమే.కాని పెళ్లి గురించి మగపిల్లాడు కూడా ఎన్నో కలలు కంటాడు.సైకియాట్రిస్ట్‌ ఎదుట ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నారు.వారం అయ్యినట్టుంది వారు సరిగ్గా తిని, నిద్ర పోయి, శుభ్రపడి.ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టున్నారు. ఎవరెవరి సహాయమో అర్థిస్తున్నట్టున్నారు. వాళ్లకొచ్చిన సమస్య పంచాయితీతో తీరేది కాదా?అది ఒక సైకియాట్రిస్ట్‌ చేతిలోనే తీరుతుందా?‘ఏంటమ్మా... మీ సమస్య?’ సైకియాట్రిస్ట్‌ అడిగాడు.‘మా అబ్బాయి ఇంట్లో నుంచి తరిమేశాడయ్యా’‘ఎందుకు?’‘మేం వాడికి ద్రోహం చేశామని’‘చేశారా?’‘లేదు’‘మరెవరు చేశారు?’వాళ్లిద్దరు నిస్సహాయంగా ఒకరిముఖం వొకరు చూసుకున్నారు. ఫణీంద్ర బాగా చదువుకున్నాడు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో మంచి ఉద్యోగం క్యాంపస్‌ సెలెక్షన్‌లోనే వచ్చింది. తల్లిదండ్రి కష్టపడి చదివించారని అతడికి వారంటే చాలా ఇష్టం.

తల్లిదండ్రులకు కూడా అతడంటే చాలా ప్రాణం. ఫణీంద్ర మొదటి శాలరీ నుంచే సేవింగ్స్‌ మొదలుపెట్టి పాతికేళ్ల వయసుకే ఒక ఫ్లాట్‌ లోన్‌తో తీసుకున్నారు. తల్లిదండ్రులు, కొడుకు, ఒక కారు ఇంట్లో కావలసిన పరికరాలు... అన్నీ ఉన్నాయి... ఒక్క కోడలు తప్ప.‘ఆడపిల్లలు దొరకట్లేదురా... ఇవాళ రేపు’ అన్నారు వాళ్లు కొడుకుతో.‘మంచి అమ్మాయిని వెతకండమ్మా... మీ ఇద్దరి కాపురంలా మాది కూడా హాయిగా గడచిపోవాలి. మంచి మేరీడ్‌ లైఫ్‌ కావాలని ఉంది నాకు. డిస్ట్రబెన్స్‌ ఉండకూడదు. జీవితాన్ని గొప్పగా కాకపోయినా సంతోషంగా గడిపేయాలి’ అన్నాడు ఫణీంద్ర.అతడికి గుళ్లూ గోపురాలు అంటే ఇష్టం. సంప్రదాయ విలువల గురించి ఫేస్‌బుక్‌లో పోస్టులు కూడా పెడుతుంటాడు.మేట్రిమొని యాడ్‌ ద్వారా ఫణీంద్ర తల్లిదండ్రులు ఒక సంబంధం తెచ్చారు. అమ్మాయి ఫణీంద్రతో సమానంగా చదువుకుంది. ఫణీంద్రలాగే ఉద్యోగం చేస్తోంది. అస్తిపాస్తులు కూడా ఉన్నాయి.‘మంచి సంబంధంరా’ అన్నారు వాళ్లు.‘సరే... మాట్లాడి చూస్తాను’ అన్నాడు ఫణీంద్ర.దివ్యతో అతనికి మీటింగ్‌ అరేంజ్‌ అయ్యింది. రెండు మూడు సార్లు వాళ్లు రెస్టరెంట్లకూ హ్యాంగౌట్‌లకు తిరిగారు.

దివ్య బాగుంది... ఇష్టంగా అనిపించింది గానీ మనస్ఫూర్తిగా తనను ఇష్టపడుతున్నట్టు లేదు... నిండుగా తనతో జీవితాన్ని ఆశిస్తున్నట్టు లేదు అని ఫణీంద్రకు కొంత సందేహం వచ్చింది.అదే మాట తల్లిదండ్రులతో అన్నాడు.‘మరో సంబంధం చూద్దాంలే’‘అదేంట్రా... అంత మంచి సంబంధానికి ఏం తక్కువ. పెళ్లయితే అంతా సర్దుకుంటుంది. ఆడపిల్ల మనసు రెండు మూడు మీటింగుల్లో తెలియదు’ అన్నారు వాళ్లు.‘మీరూ ఒకసారి చెక్‌ చేయండమ్మా’‘చూశాంరా.. అంతా బాగానే ఉంది’పెళ్లయిపోయింది.కాపురం మొదలయిపోయింది.ఇద్దరూ ఆఫీసులకు వెళ్లి వస్తున్నారు.దివ్య బాధ్యతగా భర్త అవసరాలు చూస్తోంది. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తోంది. చెప్పినట్టు వింటోంది. అత్తమామలను గౌరవంగా చూసుకుంటుంది... కాని ఎక్కడా ప్రేమ లేదని ఫణీంద్రకు అనిపించడం మొదలుపెట్టింది.చివరకు అతడు ఆమెను ఆమె ఆఫీస్‌ కొలీగ్‌తో రోడ్డు మీద చూశాడు.తర్వాత ఆరా తీశాడు.ఆ తర్వాత నిస్పృహతో కూలబడ్డాడు.దివ్యకు ఆఫీసులో తన కంటే ఏడేళ్ల వయసు పెద్ద ఉన్న ఒక వ్యక్తితో ప్రేమ ఉంది. కాని వాళ్ల పద్ధతి, సంప్రదాయం వేరు.

దివ్య తల్లిదండ్రులకు ఆ పెళ్లి ఇష్టం లేదు. అందుకని ఫణీంద్రతో పెళ్లి జరిపించారు.‘మీరు బలవంతంగా నాకు పెళ్లి చేసినా నాకు నా ప్రేమ కావాల్సిందే’ అని ముందే హెచ్చరించింది దివ్య.పెళ్లయితే అంతా మారుతుందనుకున్నారు వాళ్లు. కాని మారలేదు. ఫణీంద్ర ఇదంతా తెలుసుకుని భారీ ఎత్తున గొడవకు దిగాడు. మూడు విషయాలు అతణ్ణి తీవ్రంగా బాధించాయి. తన తల్లిదండ్రులు బాధ్యతగా పెళ్లి చేయలేదు– అనుమానం వ్యక్తం చేసినా. దివ్య తల్లిదండ్రులు నిజాన్ని దాచి పెట్టి పెళ్లి చేశారు– అంతా తెలిసినా. దివ్య తనకు తానుగా కూడా అసలు సంగతి చెప్పక మోసం చేసింది.ఇన్ని మోసాలా? అని ఫణీంద్ర తట్టుకోలేకపోయాడు.సంఘంలో పరువూ మర్యాద గురించి అతడికి పదే పదే ఎరుక వచ్చింది.‘నేను డివోర్సు తీసుకుంటాను’ అని దివ్య అంది.ఫణీంద్ర దానికీ ఒప్పుకోలేదు.‘చూడు దివ్యా. పెళ్లనేది ఒక్కసారే జరుగుతుంది.

స్త్రీ జీవితంలోనే కాదు పురుషుడి జీవితంలో కూడా పెళ్లి చాలా ముఖ్యం. నువ్వు డివోర్స్‌ తీసుకొని నా పరువు గంగలో ముంచకు’ అన్నాడు.కాని దివ్య వినలేదు.పెళ్లి పెటాకులైంది.ఫణీంద్ర డిప్రెషన్‌లో కూరుకుపోయాడు.అత్తామామలను ఏమీ చేయలేడు. భార్యను ఏమీ అనలేదు. ఇక కళ్లెదురుగా ఉన్నది నిస్సహాయులైన తల్లిదండ్రులు. తన జీవితం నాశనం కావడానికి వారే కారణం అని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. వాళ్లు ఎంత ఏడ్చి మొత్తుకున్నా నిర్దాక్షిణ్యంగా తానొక్కడే ఉంటున్నాడు. ‘ఇదీ డాక్టర్‌ జరిగింది’ అన్నారా తల్లిదండ్రులు సైకియాట్రిస్ట్‌తో.సైకియాట్రిస్ట్‌ అతి కష్టం మీద ఫణీంద్రకు కాల్‌ చేసి మాట కలిపి క్లినిక్‌కు వచ్చేలా చేశాడు.‘ఫణీంద్ర. మన వ్యవస్థ పట్ల గౌరవం ఉండటం మంచిదే కాని పెళ్లితోనే మనిషి మర్యాద ముడిపడి ఉంటుందని, ఒక బంధం చెదిరిపోతే ఇక జీవితమే నాశనం అయిపోతుందని అనుకోవడం సరికాదు.

చాలామంది పురుషుల జీవితాలలో ఇలా జరుగుతుంది. పూర్వం కాన్పుల్లో ఎందరో స్త్రీలు మరణించేవారు. ఆ వెంటనే ఆ పురుషులు మరో పెళ్లి చేసుకునేవారు. వారిని సంఘం ఏమైనా చిన్న చూపు చూసిందా? ఇవాళ మేట్రిమొనీ యాడ్స్‌లో ద్వితీయ వివాహం అంటే ఒక సపరేట్‌ కాలమే నడుపుతున్నారు. అందులో ఎందరో స్త్రీ పురుషులు ఉన్నారు. అంతెందుకు, మనకు తెలిసిన సెలబ్రిటీలు తమ సంతానం మొదటి పెళ్లి ఫెయిల్‌ అయితే రెండో పెళ్లి కూడా అంతే ఘనంగా చేయడం దానికి ఏ మాత్రం ఇబ్బంది పడకపోవడం గమనిస్తున్నాం. సమాజం ఏ పద్ధతిలో ముందుకు పోతుంటే మనమూ ఆ పద్ధతిలోనే పోవాలి.

నిన్ను నిన్నుగా ప్రేమించే అమ్మాయి నీ జీవితం పంచుకునే అమ్మాయి ఉండదని ఎందుకు అనుకుంటున్నావు’ అన్నాడు  సైకియాట్రిస్ట్‌.ఫణీంద్ర సాలోచనగా చూశాడు.‘మరో విషయం... ఎవరో మూడో వ్యక్తి కోసం నువ్వు తల్లిదండ్రులను క్షోభ పెడుతున్నావు. వారు నీకు చేసిందంతా మర్చిపోతున్నావు. వారు లేకుండా నువ్వు లేవు. అలాగే నువ్వు లేకుండా వారు లేరు’ అన్నాడు.అతనికి కొన్ని మందులు అవసరం అయ్యాయి.ఆరు నెలలు గడిచిపోయాయి.ఫణీంద్ర మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.మొన్నటి శుక్రవారం హైదరాబాద్‌ ఐమాక్స్‌ ఎదుట కొత్త సినిమా మీద బైట్‌ ఇచ్చినవాళ్లలో అతడూ ఉండటం టీవీ చూసుంటే మీకు కనిపించి ఉండేది.

కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

మరిన్ని వార్తలు