చేతులు కాలకముందే...

27 May, 2015 12:56 IST|Sakshi
చేతులు కాలకముందే...

మ్యారేజ్ కౌన్సెలింగ్

దారం తెగిపోయాక ఎన్ని ముడులేసినా ప్రయోజనం లేదు.  బంధం తెంపుకున్నాక తిరిగి అందులోకి ప్రవేశం లేదు.  ప్రకృతి చెక్కిన అందమైన శిల్పం- కుటుంబం.  తుదకంటా దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తల మీదే ఉంది. సమస్య ఉందంటారా... అయితే పరిష్కారం ఉంది...

మీనా తలిదండ్రులు దిగువ మధ్యతరగతికి చెందినవారు. కట్నమిచ్చి పెళ్లి చేసే స్తోమత లేదు. వీరి వద్దకు మధ్యవర్తుల ద్వారా ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి తలిదండ్రులు చాలా సంపన్నులనీ, అమ్మాయి బాగుంటే చాలనీ, కానీ కూడా కట్నం అక్కరలేదని చెప్పారు. దాంతో మీనా తలిదండ్రులు ఉబ్బితబ్బిబ్బయి, వెనకా ముందు విచారించకుండా పెళ్లి చేసేశారు. మీనా అత్తగారింటికి వెళ్లింది.

మొదటి రాత్రి నుంచి, భర్త సందీప్ ఆమెతో ఎప్పుడూ మాట్లాడింది లేదు. సంసారం చేసిందీ లేదు. అత్తగారి పెత్తనంలో మీనా ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ గడిపేది. భర్తకు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం ఉండేది. ఒకరోజు మీనా అత్తమామలు ఏదో అర్జంటు పని మీద ఊరెళ్లారు. ఇంతలో మీనా భర్త సందీప్ కళ్లు తిరిగి పడిపోయాడు. మీనా పక్కింటి వారి సాయంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆయన చెప్పిన అన్ని టెస్టులూ చేయించింది. వాటిలో అసలు బండారం బయటపడింది. సందీప్ చాలా కాలంగా ఎయిడ్స్‌తో బాధపడుతున్నాడని తెలిసింది. డాక్టర్ ముందు సందీప్ ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు. తనకు అంతకు ముందే పెళ్లయిందని, ఈ విషయం బయట పడటం వల్లే తాము విడిపోయామని, తల్లి బలవంతం వల్లే తాను ఈ పెళ్లికి ఒప్పుకోవలసి వచ్చిందని చెప్పాడు.

విషయం తెలిసి మీనా, ఆమె తలిదండ్రులు అవాక్కయారు. తేరుకున్నాక సందీప్ తలిదండ్రులను పిలిపించి, బంధువుల ముందు పంచాయితీ పెట్టించారు. అబ్బాయికి ఎయిడ్స్ ఉన్న మాట నిజమేనని, అయితే తమ తదనంతరం అతన్ని చూసుకునే వారు ఉండరనే భయం వల్లనే ఈ విషయాన్ని దాచి ఈ పెళ్లి చేశామని ఒప్పుకున్నారు. మీనా తలిదండ్రులు, బంధువులు కలిసి వెంటనే దగ్గరలోని లాయర్‌ను కలిశారు.

ఆయన సలహా మేరకు వారి పెళ్లయి ఆరునెలలే అయింది, వారి మధ్య వైవాహిక బంధం ఏమీ ఏర్పడలేదు కాబట్టి వారి వివాహాన్ని నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేసి, రద్దు చేయవలసిందిగా కోరుతూ కోర్టులో డైవోర్స్ పిటిషన్ వేశారు. దానికి తోడు అబ్బాయి స్థితిమంతుడు కాబట్టి మీనాకు పర్మనెంట్ ఎలిమనీ (శాశ్వత భరణం) కూడా ఇప్పించమని కోర్టు వారిని కోరారు. మీనా సమస్యను సానుభూతితో అర్థం చేసుకున్న కోర్టు వెంటనే వారి వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అమ్మాయి లేదా అబ్బాయి తలిదండ్రులు అవతలి వారి విద్యార్హతలు, ఉద్యోగం, కుటుంబ చరిత్ర, ఆర్థిక స్థితిగతులు, మెడికల్ రికార్డులు వంటి వాటిని కూడా పరిశీలించవలసిన అవసరాన్ని ఈ కేసు ద్వారా మనకు తెలుస్తోంది.
 
ప్రశ్న - జవాబు
 
మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను వదిలి, గత నాలుగేళ్లుగా వేరే స్త్రీతో కలిసి జీవిస్తున్నాడు. ఆవిడతో వివాహ బంధం లేకుండా సహజీవనం సాగిస్తున్నాడు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. దురదృష్టవశాత్తూ నేను ఇంట్లో లేని సమయంలో నా చిన్న కూతుర్ని తీసుకుని ఆయన వెళ్లిపోయాడు. ప్రస్తుతం మా చిన్నపాప ఆయనతోనే ఉంటోంది. ఆ పాప అంటే నాకు చాలా ఇష్టం. తనని నా దగ్గరకు పంపమని ఎన్నిసార్లు బతిమాలుకున్నా పంపడం లేదు. పాప ఇప్పుడు 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. త్వరలో పెద్దపిల్ల కాబోయే ఆ పాపకు ఈ సమయంలో తల్లి అవసరం ఎంతో ఉంటుంది. పాప నా దగ్గరకు వచ్చేస్తానని ఏడ్చినా ఆయన పంపడం లేదు. నేను ఏం చేయాలి?
 - జమున, శంషాబాద్


మీరు వెంటనే కష్టడీ ఆఫ్ చైల్డ్ కోసం కేసు వేయండి. ఫ్యామిలీ కోర్టులో జడ్జిగారు మీ ఇద్దర్నీ, పాపను విడివిడిగా విచారించి పాప కష్టడీ ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకుంటారు. చట్టప్రకారం తండ్రే పిల్లలకు సహజమైన సంరక్షకుడు. అయినా గానీ, ఆడపిల్లకు ఈ వయసులో తల్లి అవసరం చాలా ఉంటుంది కాబట్టి, పాప అభిప్రాయానికి విలువ ఇచ్చి ఆమె ఎవరి దగ్గర ఉండాలనుకుంటే (తల్లి, తండ్రి ఇద్దరిలో) వారికి ఆ కష్టడీ ఇవ్వడం  జరుగుతుంది.

 నాది క్యాంప్‌లు ఎక్కువ తిరిగే ఉద్యోగం. పెళ్లై 15 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల బాబు. నేను లేని సమయంలో నా భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. మా తలిదండ్రులు అదేమని ప్రశ్నిస్తే, అరిచి గొడవపెట్టి వారి నోరు మూయించేది. ఎంతోకాలం పాటు జరిగిన ఈ వ్యవహారాన్ని ఓ రోజు నా కళ్లతో చూశాక నమ్మక తప్పలేదు. ఆ రోజు పెద్దలందరి ముందు ఆమె తలిదండ్రులు, అన్నదమ్ములను పిలిచి పంచాయితీ పెట్టగా అది నిజమే అని ఒప్పుకుని క్షమాపణ వేడుకుంది. ఇంకెప్పుడూ అలా చెయ్యనని పెద్ద మనుషుల సమక్షంలో స్వయంగా కాగితంపై రాసి ఇచ్చింది. కానీ నా మనస్సు విరిగిపోయింది. నాకు ఇక ఆమెతో కలిసి జీవించాలనిపించడం లేదు. నేను ఏమి చేయాలి?
 - కరుణాకర్, చౌటుప్పల్


 మీరు మీ జ్యూరిస్‌డిక్షన్‌లోని జిల్లా కోర్టులో వీటన్నింటినీ కూలంకషంగా వివరిస్తూ, ఇల్లిసిట్ ఇంటిమసీ గ్రౌండ్ చూపెడుతూ, క్రూయల్టీ కింద విడాకులకు కేసు ఫైల్ చేయండి. బాబును ఎలాగూ మీరు మీతోనే ఉంచుకోవడానికి సిద్ధమయ్యారు కాబట్టి, కష్టడీ మీకే వస్తుంది.

 మా వివాహమై పది సంవత్సరాలు అయింది. మేమిద్దరం అమెరికాలోనే ఉంటున్నాము. కొన్ని కారణాల వల్ల మేము ఇండియాలో డైవోర్స్ తీసుకోవాలనుకుంటున్నాము. నేను ఇండియాకు రాగలను కానీ, ఆరు నెలల వరకూ ఆయనకు తీరిక లేదు. నేనేం చేయాలి?
 - విద్య, కాలిఫోర్నియా


 మీరు ఇండియాలో డైవోర్స్ పిటిషన్ వేయాలంటే మీరు వివాహం చేసుకున్న ప్లేస్, చివరగా మీరు కలిసి జీవించిన ప్లేస్‌లో లేదా భార్య ఎక్కడ ఉంటోందో, అక్కడి జ్యూరిస్‌డిక్షన్‌లో కేసు ఫైల్ చేయవచ్చు. మీకు పెళ్లయినదీ, మీరిద్దరూ కలిసి చివరలో జీవించినదీ హైదరాబాద్‌లోనే కాబట్టి, మీరు హైదరాబాద్‌లోనే డైవోర్స్ అప్లికేషన్ ఫైల్ చేయవచ్చు. మీరు ఇద్దరూ పరస్పర అంగీకారంతో పిటిషన్ ఫైల్ చేస్తున్నారు కాబట్టి, పిటిషన్‌లో సంతకాలు పెట్టి మీ సమక్షంలో ఫైల్ చేయవచ్చు. మీ భర్త ఇక్కడకు రాలేరంటున్నారు కాబట్టి పిటిషన్ కాపీ ఆయనకు కొరియర్‌లో పంపి, ఆయన సంతకాలు అక్కడ లోకల్ అడ్వొకేట్‌తో అటెస్టేషన్ చేయించి. తెప్పించుకుని ఇక్కడ ఫైల్ చేయవచ్చు. ఆరునెలలు పూర్తి కాగానే మళ్లీ మరోసారి ఇద్దరూ కోర్టులో జడ్జిగారి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడు ఎవిడెన్స్ అఫిడవిట్ వేస్తే మీకు డైవోర్స్ గ్రాంట్ అవుతాయి. మీ సౌలభ్యాన్ని బట్టి అందుబాటులో ఉన్న అవకాశాన్ని వినియోగించుకోండి.

నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది. నా భర్త స్క్రిజోఫీనియాతో బాధపడుతున్నారు. పెళ్లికి ముందు అది దాచి పెళ్లి చేశారు. నేను ఉన్నతోద్యోగంలో ఉన్నాను. నా జీవితం పాడయిందని నా తలిదండ్రులు, అన్నదమ్ములు బాధపడని క్షణం లేదు. ఆయన రోజూ మందులు వాడుతున్నారు. ప్రిస్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు పెళ్లి చేశారని అత్తమామలని అడిగితే, పెళ్లి చేస్తే పిచ్చి తగ్గుతుందని ఎవరో చెబితే చేశామంటున్నారు. వ్యాధి మూడవ దశలో వుంది. అంత తొందరగా నయం కాదని డాక్టర్లు చెబుతున్నారు. నాకు అతనితో కలిసి జీవించాలని లేదు. నేను ఏం చేయాలి?
 - అరవింద, హైదరాబాద్


 మీరు వెంటనే మెడికల్ గ్రౌండ్స్ అన్నీ జత చేస్తూ వ్యాధి విషయం దాచి, మోసపూరితంగా పెళ్లి చేశారని వివరించండి. మ్యారేజ్‌ను నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేయమని కోరుతూ ఒక సంవత్సరంలోపు డైవోర్స్ పిటిషన్ ఫైల్ చేయండి. అతని వ్యాధి వల్ల సంసారం చేయడం కష్టతరం కాబట్టి మీకు డైవోర్స్ గ్రాంట్ అవుతుంది. తర్వాత మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చినట్లు ప్లాన్ చేసుకోవచ్చు.
 
 నిశ్చల సిద్ధారెడ్డి
 అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్
 
 

మరిన్ని వార్తలు