గీత బాటలో...

13 May, 2014 23:37 IST|Sakshi
గీత బాటలో...

 స్ఫూర్తి
 
 ఇక్కడ మేకపిల్లతో కనిపిస్తున్న మహిళ పేరు గీతాఫర్తియాల్. మొన్నటివరకూ ఆమెను ఓ నలభై మేకల యజమానిగానే చూశారందరూ. ఇప్పుడు గీత చిరునామా మారిపోయింది. ఒక పక్క మేకలను మేపుకుంటూనే వాటిపై వచ్చిన ఆదాయంతో హిందీ సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది గీత. ఉత్తరాఖాండ్ హిమాలయ కొండల ప్రాంతంలో ఉన్న కొతెరా గ్రామానికి చెందిన గీత ఈ మధ్యనే అల్మొరా విశ్వవిద్యాలయంలో తన చదువు పూర్తి చేసింది.

అప్పటివరకూ అందరూ గీతను  ఏవో పుస్తకాలు చదువుకునే అమ్మాయిగానే  చూశారు. తీరా ఇంత చదువు చదివిందని తెలియగానే అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆ ప్రాంతంలో మేకల్ని అమ్ముకుని బతికేవారు ఎక్కువ. ముఖ్యంగా మహిళలు. వాటిపై వచ్చిన ఆదాయంతో పెళ్లిళ్లు చేయడమొక్కటే తెలిసిన మహిళలకు గీత ఆదర్శంగా నిలబడింది. మాస్టర్ డిగ్రీ చేతిలో ఉన్న గీత ప్రస్తుతం తన మేకలను అన్నకు అప్పగించి ఉద్యోగం వేటలో ఉంది. ‘ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో మరిన్ని మేకల్ని కొని వాటిపై వచ్చిన ఆదాయంతో మరిన్ని మంచి పనులు చేయాలనుకుంటున్నాను’ అని చెప్పే గీత మాటలు పెంపుడు జంతువులను నమ్ముకుని బతికే ప్రతి మహిళకూ ఆదర్శమే.

మరిన్ని వార్తలు