చిరాయువుకిటుకు తెలిసిందా?

21 May, 2014 23:15 IST|Sakshi
చిరాయువుకిటుకు తెలిసిందా?

పుట్టినవాడు గిట్టక తప్పదు.. మరణించినవాడు మళ్లీ పుట్టకా తప్పదని భగవద్గీత చెబుతుందిగానీ... మనిషి మాత్రం మరణాన్ని జయించాలని యుగాలుగా ఆరాట పడుతూనే ఉన్నాడు. అంతకంతకూ అభివృద్ధి చెందుతున్న వైద్య, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలు ఈ కాంక్షను ఎంతో కొంత తీరుస్తున్నాయి కూడా. ఇప్పటికే మనిషి సగటు ఆయుష్షు దశాబ్దానికి పైగా పెరిగిపోయింది. మరి భవిష్యత్తులో ఏమవుతుంది? మరిన్ని ఎక్కువ ఏళ్లు జీవించగలమా? ఒకవేళ ఇది సాధ్యమైనా వృద్ధాప్యంలోనూ రోగాలు, రొష్టులు లేకుండా చేయగలమా? సాధ్యమే అంటున్నారు... శాస్త్రవేత్తలు.
 
1980తో పోలిస్తే ఇప్పుడు ప్రపంచ జనాభాలో అరవై ఏళ్లు పైబడిన వారి సంఖ్య రెట్టింపు అయింది. 2050 నాటికి వీరి సంఖ్య 200 కోట్లకు చేరుతుందని అంచనా. బాగానే ఉందిగానీ... ఈ వయోవృద్ధులతో ఓ కొత్త సమస్య ఏర్పడే అవకాశముంది. శరీరం సహకరించక రోగాల బారిన పడటం.. గుండెపోట్లు, వ్యాధులు, క్యాన్సర్లు పెరిగిపోతాయి. మరణాలు అనివార్యమవుతాయి. ఈ నేపథ్యంలో ఆయుష్షును పెంచుతూనే.. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా చూసేందుకు రిచర్డ్ వాకర్ ప్రయత్నాలు చేస్తున్నారు.
 
పరిశోధనశాలలకే పరిమితమా?

మనిషిని మరింత ఎక్కువ కాలం జీవించేలా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కొన్ని పరిశోధనశాలల్లో అద్భుత ఫలితాలను ఇచ్చాయి... ఇస్తున్నాయి కూడా. శాస్త్రవేత్తలు కొన్ని నిర్దిష్ట జన్యువులను నియంత్రించడం, మార్పులు చేయడం ద్వారా చుంచు ఎలుకలు, ఈగలు, కొన్ని రకాల కీటకాల జీవితకాలాన్ని గణనీయమైన స్థాయిలో పెంచగలిగారు. కొందరు రాపమైసిన్, రివర్సెట్రాల్ (రెడ్‌వైన్‌లోని పదార్థం) వంటి మందులు వాడటం ద్వారా ఎక్కువ కాలం బతికేయవచ్చునని ప్రతిపాదించారు.

అయితే విసృ్తతస్థాయి పరిశోధనల ద్వారా ఇవేమంత సమర్థమైనవి కావని తేలింది. అయితే ఇవే మార్పులు మనిషిలోనూ చేస్తే అవే రకమైన ఫలితాలు ఉంటాయా? అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. మనుషుల్లో వృద్ధాప్యానికి సంబంధించి ఇప్పటివరకూ కొన్ని జన్యువులను మాత్రమే గుర్తించడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. అయితే రిచర్డ్ వాకర్ వంటి శాస్త్రవేత్తలు మాత్రం వృద్ధాప్యాన్ని అరికట్టే కిటుకు మనిషి జన్యువుల్లోనే ఉందని గట్టిగా నమ్ముతున్నారు. ఆ దిశగానే తమ పరిశోధనలు చేస్తున్నారు.
 
అరుదైన వ్యాధి కీలకం..
 
రిచర్డ్ వాకర్ పరిశోధనల్లో సిండ్రోమ్ -ఎక్స్ అనే అత్యంత అరుదైన వ్యాధి కీలకంగా మారుతోంది. ఎంత వయసు వచ్చినా... చిన్న పిల్లల మాదిరిగానే ఉండటం ఈ వ్యాధి లక్షణం. డీఎన్‌ఏలోని కొన్ని లోపాల కారణంగా ఇలా జరుగుతుందని... ఆ మార్పులేవో తెలుసుకోగలిగితే మనిషిని చిరాయువుగా మార్చేందుకు వాటిని  ఉపయోగించుకోవచ్చునన్నది వాకర్ అంచనా. అయితే దీనిపై పరిశోధనల చేసేందుకు ఆయన కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

2005లో బ్రూక్ గ్రీన్‌బర్గ్ అనే బాలికతో వాకర్ తన పరిశోధనలు మొదలుపెట్టారు. ఆ తరువాత అమెరికాలోనే ఉన్న మరో ముగ్గురు వ్యాధిగ్రస్తులపై పరిశోధనలు చేశారు. బ్రూక్ గ్రీన్‌బర్గ్ వయసు 12 ఏళ్లు. అయినా ఏడాది పాప మాదిరిగానే ఉంటుంది. ఆమె శరీరంలోని వేర్వేరు అవయవాలు వేర్వేరు వేగాలతో ఎదుగుతున్నట్లు వాకర్ గుర్తించారు. పళ్లు ఎనిమిదేళ్ల వయసు, ఎముకలు పదేళ్లు.. మానసిక వయసు మాత్రం ఏడాదిలోపే ఉన్నట్లు వాకర్ పరిశోధనల్లో తేలింది.

బ్రూక్‌తోపాటు మరో ముగ్గురి డీఎన్‌ఏలోని కొంతభాగాన్ని విశ్లేషించినప్పుడు వాకర్‌కు ప్రత్యేకమైన తేడాలేవీ కనిపించలేదు. కానీ... బ్రూక్ జన్యుక్రమాన్ని పూర్తిగా విశ్ల్లేషించిన మరో శాస్త్రవేత్త ఎరిక్ స్కామట్ మాత్రం మూడు ప్రత్యేకమైన మార్పులను గుర్తించారు. సాధారణ జన్యుక్రమాల్లో ఈ మార్పులు ఎన్నడూ కనిపించలేదన్నది ఎరిక్ వాదన. అయితే మరి కొంతమంది సిండ్రోమ్ -ఎక్స్ బాధితుల్లోనూ ఇదేరకమైన మార్పులు కనిపిస్తేగానీ ఒక నిర్ధారణకు రాలేమని ఎరిక్ భావిస్తున్నారు. ఈ కారణంగానే ఎరిక్ పరిశోధనలు ఇప్పటివరకూ ప్రచురితం కాలేదు కూడా.
 

మరిన్ని వార్తలు