వీటిని ఎందుకు నిషేధించారంటే..!

15 Apr, 2014 00:23 IST|Sakshi
వీటిని ఎందుకు నిషేధించారంటే..!

నిషేధిత మందులు
 జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ అనారోగ్యాలు వస్తే మందుల దుకాణానికి వెళ్లి తెలిసిన మందులేవో వేసుకోవడం పరిపాటి. కానీ వాటిల్లో కొన్ని నిషేధించిన మందులని చాలామందికి తెలియకపోవచ్చు. నిషేధించినప్పటికీ దుకాణాల్లో దొరుకుతున్న కొన్ని మందుల వివరాలు, వాటిని నిషేధించడానికి కారణాలు ఇవి.
 
 జలుబు, దగ్గును తగ్గించే ఫెనిల్‌ప్రోపనోలమైన్ వాడకం వల్ల దీర్ఘకాలంలో పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.
 
 నొప్పి నివారణి అనాల్జిన్ వల్ల, వాపులకు వాడే ఆక్సిఫెన్‌బుటాజోన్ వల్ల ఎముకల్లోని మూలుగు బలహీనపడుతుంది.
 
 జ్వరం, ఒళ్లు నొప్పులకు వాడే నిమెసులైడ్ కారణంగా కాలేయం దెబ్బతింటుంది.
 
ఎసిడిటీ, మలబద్దకం తగ్గడానికి వాడే సిసాప్రైడ్ వాడడం వల్ల గుండె పనితీరు క్రమం తప్పుతుంది(ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్).
 
 ఒత్తిడిని తగ్గించే డ్రోపెరిడోల్ వల్ల కూడా గుండె పనితీరులో ఒడుదొడుకులు వస్తాయి.

డయేరియాను తగ్గించే ఫురాజోలిడోన్, గాయాలకు రాసే పూతమందు (యాంటీబ్యాక్టీరియల్ క్రీమ్) నైట్రోఫురాజోన్ వల్ల క్యాన్సర్ ముప్పు ఉంటుంది, క్వినిడోస్లార్ వల్ల కంటి చూపు మందగించే ప్రమాదం ఉంటుంది.నులిపురుగులు తగ్గడానికి వాడే పైపరేజైన్‌తో నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

మరిన్ని వార్తలు