నీకూడా నేనున్నట్లే

6 Nov, 2017 00:01 IST|Sakshi

గాయాన్ని దాచిపెట్టమని చెబితే గాయం మానదు. రేగుతుంది! గాయం పెడుతున్న బాధను పంచుకుంటే... అదే గాయం.. ఉద్యమానికి ఓ గేయం అవుతుంది. హ్యాష్‌టాగ్‌ ‘మీటూ’ ప్రపంచంలో ఉన్న గాయాలను ఇప్పుడు యుద్ధభేరిగా వినిపిస్తోంది. ‘నేను సైతం’ అనేది ఒక యజ్ఞంలో సమిధ అవడం అయితే.. ‘నేను కూడా’ అనేది.. నీకూడా నేనున్నానని చెప్పడం.
 

పద్నాలుగేళ్ల అమ్మాయి, ఇరవై నాలుగేళ్ల యువతి ఒకేలా ఉండరు. వేధింపులను భయపడడంలో మాత్రం ఇద్దరూ ఒకేలా ఉంటారు! ‘అక్కా.. వాడు ఏదోలా చూస్తున్నాడు’. అవునా! వాడి వైపు చూడకు. ‘అక్కా.. వాడు నన్ను కామెంట్‌ చేశాడు’. ‘తిరిగి కామెంట్‌ చేయలేదు కదా’ ‘అక్కా.. వాడు నన్ను టచ్‌ చేశాడు’. నాతో చెప్తే చెప్పావ్‌.. ఎక్కడా అనకు. ‘అక్కా.. వాడు గెస్ట్‌హౌస్‌కి రమ్మన్నాడు’ ‘మానేయ్‌.. ఇది కాకపోతే ఇంకో ఉద్యోగం’

1996. బ్రూక్లిన్, న్యూయార్క్‌. తరానా బర్క్‌ (24) తన ఆఫీస్‌ నుంచి బయటికి వచ్చింది. ఎవడో విజిల్‌ వేసుకుంటూ, ఆమెను రాసుకుని పోయాడు. కెవ్వుమంది. ‘స్టుపిడ్‌’ అని తిట్టుకుంది. ‘గర్ల్స్‌ ఫర్‌ జెండర్‌ ఈక్విటీ’ అనే సంస్థలో ఆమె ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌. భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం ఆమె ప్రొఫెషన్‌కే తలవంపు. కానీ డైరెక్టర్‌ కన్నా ముందు.. ఆమె ఒక ఆడపిల్ల.

ఆడపిల్లకన్నా ముందు.. ఆమె ఒక నల్లవాళ్ల పిల్ల. ఆఫ్రికా నుంచి వచ్చి అమెరికాలో సెటిల్‌ అయిన వాళ్ల అమ్మాయి. అయితే మాత్రం? అమెరికాలోనే పుట్టింది కాబట్టి అమెరికా ఆమెది కూడా అవదా? అవుతుంది. అమెరికాలో ఉన్నవాళ్లందరికీ ఉన్న స్వేచ్ఛ ఆమెకూ ఉండాలి కదా! ఉంటుంది. మరెందుకంత భయం? స్త్రీ ధైర్యంగా బయటికి వచ్చి ఏ స్వేచ్ఛనైనా సాధించగలదు. మగవాడి వేధింపుల నుంచి స్వేచ్ఛ కోసం మాత్రం అంత తేలిగ్గా బయటికి రాలేదు. బయటికి రావడం అంటే పరువును బజారుకు ఈడ్చుకోవడం మరి!

రెండో రోజు.. డ్యూటీలో ఉంది బర్క్‌. ‘‘నీ కోసం ఎవరో వచ్చారు బర్క్‌. నీతో మాట్లాడాలట!’’ గుండె ఝల్లుమంది అంత పెద్ద అమ్మాయికి! ‘‘ఎవరు వాడు?’’ అంది. ‘‘వాడు కాదు. అమ్మాయి. హెవన్‌ అట పేరు. నీతో పర్సనల్‌గా ఏదో చెప్పుకోవాలట’’. బర్క్‌ అంతకు ముందు రోజు ‘ఆల్‌–గర్ల్‌’ బాండింగ్‌ సెషన్‌లో అమ్మాయిలకు ధైర్యం నూరిపోయింది. అబ్బాయిల కన్నా మనం ఎందులోనూ తక్కువకాదు అని కాన్ఫిడెన్స్‌ ఇచ్చింది. ఆ సెషన్‌కు వచ్చిన అమ్మాయిలలో ఒక అమ్మాయి హెవెన్‌. పద్నాలుగేళ్లుంటాయి. బ్లాక్‌ హెయిర్‌. బ్లాక్‌ ఐస్‌. సన్నగా అందంగా ఉంది. కానీ ‘బ్లాక్‌’. అమెరికాలో బ్లాక్‌ అంటే చిన్నచూపు. హెవెన్‌ది కూడా అలాంటి ప్రాబ్లమే అయివుంటుంది అనుకుంది బర్క్‌.

‘‘అక్కా.. నేను చెప్పేది వినే టైమ్‌ ఉందా నీకు’’ అంది హెవెన్‌ నేరుగా. బర్క్‌ అప్పటికే పని ఒత్తిడిలో బాగా అలసిపోయి ఉంది. ఏముంటుంది ఆ పిల్ల కొత్తగా చెప్పుకునేది? నిన్న వాడెవడో తనని రాసుకుంటూ వెళ్లినట్లే.. ఇంకొకడెవరో ఈ అమ్మాయిని హెరాస్‌ చేసి ఉంటాడు అనుకుంది. ‘‘అక్కా నాకు చచ్చిపోవాలనిపిస్తోంది’’ అంది హెవన్‌. బర్క్‌ అలసట ఒక్కసారిగా ఎగిరిపోయింది. హెవెన్‌ని దగ్గరకు లాక్కుని గట్టిగా తన గుండెలకు అదుముకుంది. తల నిమిరింది.   ‘‘వాట్‌ హ్యాపెండ్‌ బేబీ’’ అని అడిగింది బర్క్‌. ‘‘అక్కా.. ఇక్కడ కాదు. నీ గదిలోకి వెళ్దాం’’ అంది హెవెన్‌. ఇద్దరూ లోపలికి వెళ్లారు. ‘‘తలుపెయ్‌ అక్కా..’’ అంది హెవన్‌. బర్క్‌ తలుపు వేసింది.

ఒంటి మీద ఉన్న బట్టలు తీసి బర్క్‌ ఎదురుగా నిలబడింది హెవెన్‌. బర్క్‌ అదిరిపడింది. హెవెన్‌ శరీరంలో ఎదుగుతున్న సున్నిత భాగాలు కమిలిపోయి ఉన్నాయి! హెవెన్‌ తల్లికి ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆ వ్యక్తి తనకెంత నరకం చూపిస్తున్నదీ, తన దేహంపై ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నదీ ఒకటొకటిగా చెప్పడం మొదలు పెట్టింది హెవెన్‌. బర్క్‌ వినలేకపోతోంది. ఆమెకు కళ్లు తిరుగుతున్నట్లుగా, కడుపులో దేవినట్లుగా అనిపిస్తోంది.

‘‘హెవెన్‌.. నేను అర్థం చేసుకోగలను.. అయితే నాకు కాదు.. ఇంకొక ఫిమేల్‌ కౌన్సెలర్‌ ఉంది. ఆమెకు చెప్పు. ముందు బట్టలు వేసుకో’’ అని చెప్పింది. ఇంకే ఘోరాలు వినవలసి వస్తుందో అని ఆమె అలా చెప్పింది. బర్క్‌ సున్నిత మనస్కురాలు. హెవెన్‌ హర్ట్‌ అయింది. ‘అక్కా.. నేనింత బాధపడుతున్నాను కదా.. నువ్వు కనీసం నా బాధను వినలేవా?’’ అన్నట్లు చూసింది. గాయాన్ని విప్పి చూపిస్తున్నప్పుడు.. విప్పకు కట్టేయ్‌ అనడం అంటే.. గాయాన్ని మరింత రేపడమే. బర్క్‌ చేసింది అదే పని! హెవెన్‌ వెళ్లిపోతుంటే.. ఆమెను వెనకనుంచి చూస్తూ ఉండిపోయింది బర్క్‌. ‘మీటూ’ అని ఆ అమ్మాయికి చెప్పాలనుకుంది కానీ.. చెప్పలేకపోయింది.


2006. హార్లెమ్, న్యూయార్క్‌. పదేళ్లు నలిగిపోయింది బర్క్‌. కౌన్సెలింగ్‌ డైరెక్టర్‌గా బాధితురాళ్లైన యంగ్‌ గర్ల్స్‌ని చాలామందినే చూసింది, మాట్లాడింది బర్క్‌. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు హెవనే గుర్తుకొచ్చేది. చిన్న పిల్ల! ఇప్పుడెలా ఉందో? ఇరవై నాలుగేళ్లు వచ్చి ఉంటాయి తనకు. అంటే పదేళ్ల క్రితం తన వయసెంతో ఇప్పుడు హెవెన్‌ వయసు అంత. ఆ పిల్లే నయం! బాధను చెప్పుకునే ధైర్యం ఉంది. ఆ బాధను వినడానికి తను భయపడింది. మనసును ముల్లులా గుచ్చుతోంది బర్క్‌ను ఆ ఆలోచన.

బర్క్‌ ఆలోచిస్తూనే ఉంది. ఆడపిల్లలకు అండగా ఉండాలనుకున్న వాళ్లెవరైనా.. ముందు, వాళ్లు ధైర్యంగా ఉండాలి. దేనికీ అవమానంగా ఫీల్‌ అవకూడదు. నేను ఒంటరిదాన్ని అనుకోకూడదు. ఆ తర్వాత, సహాయం కోరి వచ్చినవారిని ఆదుకోవాలి. ‘నిన్ను చూడ్డానికే, నువ్వు చెప్పింది వినడానికే, నిన్ను అర్థం చేసుకోడానికే నేనిక్కడ ఉన్నాను. నీ కోసం ఉన్నాను’ అని చెప్పగలగాలి. ఒకే బాధను అనుభవిస్తున్న వాళ్ల మధ్య బంధం ఏర్పడుతుంది. ఆ విధంగా చూస్తే ఈ లోకంలో వివక్షకు, లైంగిక వేధింపులకు గురవుతున్న అమ్మాయిలంతా ఒకరికొకరు రక్తసంబంధీకులే. అప్పుడు ఒకరి బాధ.. ఆ ఒక్కరి బాధే కాదు. ఒకరి ఆలోచన ఆ ఒక్కరి కోసమే ఆలోచన కాదు.

ఒక నిర్ణయానికి వచ్చింది బర్క్‌. ఒక ఉద్యమంలా బాధితులందరినీ ఒక చోటికి తేవాలనుకుంది. ‘మీటూ’ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. ‘అయ్యో.. నీకలా జరిగిందా?’ అని బాధపడడానికీ, ‘నాక్కూడా అలా జరిగింది’ అని బాధను పంచుకోడానికి మధ్య చాలా తేడా ఉంది. టీనేజర్ల నుంచి అరవైకి చేరువవుతున్న వాళ్ల వరకు ఆడవాళ్లంతా ఒక్కొక్కరుగా బయటికి వచ్చి తన అనుభవాన్ని మిగతావారితో షేర్‌ చేసుకోవడంతో ‘మీటూ’ ఉద్యమానికి ఊపు వచ్చింది. ఆ రోజు ఆ పద్నాలుగేళ్ల అమ్మాయితో అనలేకపోయిన ‘మీటూ’ అనే మాటనే తన తన కాంపెయిన్‌కి పేరుగా పెట్టుకున్నారు బర్క్‌. ‘మైస్పేస్‌’ అనే వెబ్‌సైట్‌లో మీటూ అనే స్లాట్‌ తీసుకుంది.

మరి.. ‘మీటూ’ అని ఆ పద్నాలుగేళ్ల అమ్మాయి హెవెన్‌తో ఆ రోజున ఆమె చెప్పుకోలేకపోయిన ఆ అనుభవం ఏమిటి? రేప్‌ అండ్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌. పదమూడేళ్ల వయసులో దగ్గరి బంధువు ఒకరు బర్క్‌ను రేప్‌ చేశాడు. బయటికి చెప్తే చంపేస్తానని అతడు అనలేదు. ‘‘చెప్పుకో.. నీ ఇష్టం. నీ పరువే పోతుంది’’ అన్నాడు. ‘పరువు పోయిన ఆడపిల్లను ఈ లోకం బతకనివ్వదు’ అని అన్నాడు.

‘ఒకసారి పరువు పోయాక మగవాళ్లంతా ఇప్పుడు నేను ఏదైతే చేశానో అదే చేయడానికి నిన్ను వెంటాడతారు’ అని కూడా అన్నాడు. బర్క్‌ భయపడింది. ఆ మాటలు ఆమెలో నాటుకుపోయాయి. బయటికి చెప్పలేదు. అలా చెప్పకపోవడంతో ఆ బంధువుకి అనుమతి పత్రం లభించినట్లయింది. తర్వాత మరో రెండుసార్లు ఆమెను రేప్‌ చేశాడు. ఎప్పటికో కానీ అతడి పీడ వదల్లేదు బర్క్‌కి.ఇదైనా బర్క్‌ చెప్పుకుంటే బయట పడిన విషయం కాదు! ‘మీటూ’ కథల్లో ఓ అజ్ఞాత కథ ఆమెను పట్టించింది. నిజానికి ఆమె ‘మీటూ’ కూడా సోషల్‌ మీడియాలో అజ్ఞాతంగానే కొనసాగుతోంది. మొన్న అక్టోబర్‌ 15 వరకు కూడా బర్క్‌ గురించీ, బర్క్‌ మీటూ గురించి ఎవరికీ తెలీదు.


2017 అదే హార్లెమ్‌. అదే న్యూయార్క్‌. బర్క్‌ మాత్రం ఇప్పుడు కొత్త మనిషి! నలభై నాలుగేళ్ల బర్క్‌కు అక్టోబరు నెలలో ఓ ఉదయం ప్రముఖ హాలీవుడ్‌ నటి అలిస్సా మిలానో నుంచి ఫోన్‌ వెళ్లింది. ఆమె వయసు కూడా నలభై నాలుగేళ్లే. ఆ ఇద్దరు సమవయస్కుల మధ్య సంభాషణ ఇది. ‘‘గుడ్‌ మార్నింగ్‌ తరానా బర్క్‌. ఐ యామ్‌ అలిస్సా మిలానో’’. ‘‘వావ్‌.. చెప్పండి అలిస్సా’’. ‘‘కొద్ది రోజుల క్రితం సోషల్‌ మీడియాలో నేను పెట్టిన హ్యాష్‌ట్యాగ్‌.. ‘మీటూ’ పేరుతోనే పదేళ్ల క్రితమే మీరు కాంపెయిన్‌ నడిపారని తెలిసి ఎగై్జట్‌మెంట్‌తో ఫోన్‌ చేస్తున్నాను’’. ‘‘యా చూశాను మిస్‌ అలిస్సా. దటీజ్‌ గుడ్‌. మీటూ అన్న కాన్సెప్ట్‌ నా ఒక్కరిదే కాదు. మనందరిదీ. ఒకే బాధ.. ఒకే భావం.. (నవ్వుతూ).

‘‘ధన్యవాదాలు మిస్‌ బర్క్‌’’ ‘‘ధన్యవాదాలు మిస్‌ అలిస్సా’’. సంభాషణ పూర్తయింది. దీనిని అలిస్సా ఇంటర్నెట్‌లో షేర్‌ చెయ్యడంతో.. మీటూ అనే ఒక మహోద్యమానికి, మహిళా ఉద్యమానికి ఆద్యురాలిగా బర్క్‌ వెలుగులోకి వచ్చారు. అయితే ఆ వెలుగులో తను కాకుండా.. బాలికలు, యువతులు పడుతున్న లైంగిక వేధింపులు ఈ లోకానికి కనిపించాలని, ఆ పాడు లోకం కళ్లు తెరుచుకోవాలని ఆమె కోరుకుంటున్నారు.  


ఏంటీ.. ‘మీటూ’?
ప్రపంచ వ్యాప్తంగా మహిళలందరినీ ఏకం చేస్తున్న సోషల్‌ మీడియా ఉద్యమం. హార్వీ వైన్‌స్టీన్‌ అనే 65 ఏళ్ల హాలీవుడ్‌ నిర్మాత సినిమా చాన్సులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలను కొన్నేళ్లుగా లైంగికంగా వేధించుకుని తింటూ, వారిపై అత్యాచారాలు జరుపుతున్నాడని పన్నెండు మంది మహిళలు గత అక్టోబర్‌లో బయటికి వచ్చి బాహాటంగా చెప్పడంతో.. ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్ని ఉన్నాయోనన్న చర్చ మొదలైంది. అలాంటి వాళ్లెవరైనా ఉంటే తమ అనుభవాలను పంచుకోవడం కోసం అలిస్సా మిలానో అనే హాలీవుడ్‌ నటి సోషల్‌ మీడియాలో ఏర్పాటు చేసిన హ్యాష్‌ ట్యాగే.. ‘మీటూ’.


తొలి గంటలోనే..!
‘మీటూ’ హ్యాష్‌ ట్యాగ్‌ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం అయిన తొలిగంటలోనే ఫేస్‌ బుక్‌లో 40 లక్షల 70 వేల మంది దీనిని ఉపయోగించారు! కోటీ 20 లక్షల పోస్టులు వెల్లువెత్తాయి. ఇండియా, పాకిస్థాన్, బ్రిటన్‌లతో పాటు మొత్తం 85 దేశాలలో ఈ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఐరోపా పార్లమెంట్‌ అయితే ‘మీటూ’ పై ఒక ప్రత్యేక సమావేశాన్నే నిర్వహించింది!


మన వాళ్లు
‘మీటూ’ అంటూ మన సెలబ్రిటీలు ఇంతవరకు లోపలికి రాలేదు. కానీ బయటి నుంచి సపోర్ట్‌ చేశారు. రాధికా ఆప్టే, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా.. ‘మీటూ’ ఉద్యమానికి మద్దుతు పలికారు.

మరిన్ని వార్తలు