పదం పలికింది – పాట నిలిచింది

5 Feb, 2018 00:52 IST|Sakshi

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై

ఒక పాత్ర మానసిక స్థితికీ, దాని మేధోస్థాయికీ తగిన పదాలతో రాసిన పాట విన్నప్పుడు ఒక రసస్పందన ఏదో కలుగుతుంది. అలాంటి అనుభూతే 1982లో వచ్చిన ‘మేఘసందేశం’ చిత్రంలోని ‘ఆకాశ దేశాన ఆషాఢ మాసాన’ కలిగిస్తుంది. గీత రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి. అందులో మొదటి చరణంలో నాయకుడు– ‘వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై

ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని / కడిమి వోలె నిలిచానని’ అని పాడతాడు. రెండో చరణంలో– ‘రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై / ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని / శిథిల జీవినైనానని’ అని తన మనోవేదననూ, మరణ యాతననూ వెల్లడిస్తాడు.

నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద, జగ్గయ్య నటించగా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం సమకూర్చింది రమేశ్‌ నాయుడు. పాడింది కె.జె.యేసుదాస్‌. ఈ చిత్రాన్ని కృష్ణశాస్త్రికి అంకితమివ్వడం గమనించదగ్గది. ఇది అక్కినేని 200వ చిత్రం కావడం మరో విశేషం.

మరిన్ని వార్తలు