మెనోపాజ్ దాటాక గుండె జబ్బులు ఎక్కువా?

11 Sep, 2016 22:56 IST|Sakshi
మెనోపాజ్ దాటాక గుండె జబ్బులు ఎక్కువా?

కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 43 ఏళ్లు. మెనోపాజ్ దాటిన మహిళలకు గుండెజబ్బులు ఎక్కువని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఇది వాస్తవమేనా?
- శ్రీలేఖ, కాకినాడ


గతంలో పురుషులతో పోలిస్తే... మహిళల్లో గుండెజబ్బులు తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు స్త్రీలలోనూ గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది. ఎప్పటికప్పుడు మారిపోతున్న జీవనశైలి, క్రమపద్ధతిలో లేని నిద్ర, ఆహార నియమాలు, పనుల ఒత్తిళ్లు... లాంటి పరిస్థితులన్నీ మహిళల్లోనూ ఇప్పుడు గుండెజబ్బులను పెంచుతున్నాయి.
 
గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాలు సన్నబారడం లేదా మూసుకుపోవడం వల్ల గుండెజబ్బులు వస్తాయి. కరొనరీ ఆర్టరీ డిసీజ్ అని పిలిచే ఈ జబ్బు గుండెపోటుకు దారితీస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళలపై ఈ ప్రమాదం పదేళ్లు ఆలస్యమవుతుంది. మెనోపాజ్ తర్వాత ఈ ముప్పు మరింత పెరిగే మాట వాస్తవమే. మెనోపాజ్ తర్వాత శరీరానికి మేలు చేసే కొలెస్ట్రాల్ తగ్గి, చెడు (బ్యాడ్) కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ పెరుగుతాయి. పెరిగే వయసుతో అధిక రక్తపోటు కూడా మొదలవుతుంది. ఇవన్నీ గుండెజబ్బుల ముప్పును పెంచే అంశాలే.

నడక వంటి వ్యాయామంతో పాటు ముందు నుంచీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వయసుతో నిమిత్తం లేకుండా గుండెజబ్బులను చాలావరకు అదుపులో ఉంచవచ్చు

ప్రతిరోజూ కనీసం అరగంట నడక లేదా పరుగు లేదా ఏరోబిక్ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. వారంలో కనీసం ఐదురోజులైనా ఈ వ్యాయామాలు చేయాలి  ఆహారంలో ఉప్పును చాలా పరిమితంగా తీసుకోవాలి. పండ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయల మోతాదును పెంచాలి. అలాగే శాచురేటెడ్ కొవ్వులు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి  మీ మానసిక ఒత్తిడిని సాధ్యమైనంతగా తగ్గించాలి. రోజూ కనీసం ఓ పది నిమిషాలు ధ్యానం చేయాలి

నూనెలను చాలా పరిమితంగా తీసుకోవాలి.  వయసును బట్టి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే సమస్యను ముందుగానే గుర్తించవచ్చు. ఇందుకోసం క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి  గుండెజబ్బులకు దారితీసే అంశాలపై (రిస్క్ ఫ్యాక్టర్లపై) దృష్టి సారించాలి. ఉదాహరణకు అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, డయాబెటిస్ లాంటివి ఉంటే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ గుండెజబ్బులను నివారించుకుంటే వాటి వల్ల కలిగే ప్రమాదాన్నీ నివారించుకున్నట్లేనని తెలుసుకోండి.
- డాక్టర్ హేమంత్ కౌకుంట్ల
 కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.
 
గర్భాశయంలో కణుతులు... తగ్గుతాయా?
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 42 ఏళ్లు. నాకు కొంతకాలంగా రుతుస్రావం ఎక్కువరోజులు కొనసాగటం, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడడంతో గైనకాలజిస్టును సంప్రదించాను. వారు స్కాన్ చేయించి నా గర్భాశయంలో కణితులు ఏర్పడ్డాయని, వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినా మళ్లీ ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. హోమియోతో ఈ వ్యాధి నయం అయ్యే అవకాశం ఉందా?
- పి.పి.జె, మచిలీపట్నం
 
చాలామంది స్త్రీలలో ఈ గర్భాశయ కణితుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడడంతోపాటు వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం వంటి చర్యలకు దారితీస్తుంది. తద్వారా వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురికావడం జరుగుతుంది కానీ హోమియో చికిత్స ద్వారా ఈ వ్యాధికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా పూర్తిగా నయం అయే అవకాశం ఉంది.  సాధారణంగా గర్భాశయంలో ఏర్పడే కణితులను యుటిరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయపు కండర కణజాలంతో ఏర్పడతాయి. 16-50 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు ఈ వ్యాధి బారిన పడే అవకాశ ఉంది. నెలసరి ఆగిపోయిన మహిళలలో వీటి ప్రభావం తక్కువగా ఉంటుంది. సంతానోత్పత్తి వయస్సు గల వారినే ఇది ఎక్కువగా ప్రభావితం చేయడం వల్ల ఇది సంతానలేమికి కూడా దారితీస్తోంది.
 
ఈ కణితులు ఒకటిగా లేదా చిన్న చిన్న కణితులు మిల్లీమీటరు మొదలుకొని కొన్ని సెంటీమీటర్ల పరిమాణం వరకు పెరుగుతాయి. గర్భాశయంలో ఇవి ఏర్పడే ప్రాంతపు ఉనికి, పరిమాణం రీత్యా వీటిని మూడు రకాలుగా విభజించడం జరిగింది.
 
ఇన్‌ట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్: గర్భాశయం లోపలి గోడల మధ్యలో ఏర్పడే ఇవి చాలా సాధారణంగా కనిపిస్తాయి.
 సబ్ సీరోజల్: గర్భాశయం వెలుపలి గోడలపై ఏర్పడే ఈ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్ద పరిమాణంలో పెరిగే అవకాశం ఉంది.
 సబ్‌మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్: ఇవి గర్భాశయంలో ఉండే మ్యూకోజల్ పొరలో ఏర్పడి గర్భాశయపు కుహరంలోకి పెరుగుతాయి.
 
కారణాలు: హార్మోన్ల అసమతుల్యత, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల ఇవి ఏర్పడే అవకాశ ఉంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి అధికంగా ఉండటం వల్ల ఇవి ఏర్పడే అవకాశ ఉంటుంది. నెలసరి ఆగిపోయిన మహిళలలో ఈ హార్మోన్ ఉత్పాదన తక్కువగా ఉండటం వల్ల అవి కుచించుకుపోతాయి. స్థూలకాయం, మద్యపానం, కెఫీన్ వాడకం వంటి అంశాలు ఈ కణితులు ఏర్పడటాన్ని ప్రేరేపిస్తాయి.
 
లక్షణాలు: రుతుస్రావం ఎక్కువ రోజులపాటు కొనసాగడం, అధిక రక్తస్రావం కావడం, రెండు రుతుచక్రాల మధ్యలో రక్తస్రావం అవడం, నడుమునొప్పి, కడుపులోనొప్పి, కాళ్లలో నొప్పి. అధిక రక్తస్రావం మూలంగా రక్తహీనత ఏర్పడటం. తరచు మూత్రానికి వెళ్లాల్సి రావడం, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటివి.
 
చికిత్స: హోమియోలో అందించే జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ చికిత్సావిధానం ద్వారా ఈ గర్భాశయ కణితులను పూర్తిగా కరిగించడమే కాకుండా, హార్మోన్ల అసమతుల్యతను, రుతుచక్రాన్ని సరిచేయడం ద్వారా వ్యాధి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మళ్లీ వ్యాధి తిరగబెట్టకుండా సంపూర్ణంగా నయం అవుతంది.
- డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
 సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్

మరిన్ని వార్తలు