ఎక్కువ మగాళ్లు తక్కువ సమానులు

28 Dec, 2015 01:00 IST|Sakshi
ఎక్కువ మగాళ్లు తక్కువ సమానులు

పురుషుల మీద లోకానికి మరీ చిన్నచూపు. ‘సమ’న్యాయం వర్ధిల్లే ప్రజాస్వామిక సమాజాల్లోనైతే మరీనూ! ఇలాంటి ప్రజాస్వామిక సమాజాలు పురుషులను పురుషుల్లా బతకనివ్వవు. వీకర్‌సెక్స్‌ను వెనకేసుకు రావడానికి అక్కర్లేనన్ని చట్టాలు చేసిపారేసి, మగాళ్ల బతుకులను ముళ్లబాటగా మార్చేస్తాయి. మగ బతుకుల గురించి ప్రాపంచిక దృక్పథం వరకు పోవద్దు గానీ, మన దేశంలోని పరిస్థితులనే సింహావలోకనం చేసుకుంటే... ఎన్నని చెప్పగలం లెండి... కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది.

చాలా ప్రజాస్వామిక దేశాల్లోలాగానే మన దేశంలోనూ రాజ్యాంగానిది ‘సమ’న్యాయ దృక్పథమే! దాని ప్రకారం పురుషులకూ సమాన హక్కులు పొందే వీలుందని విర్రవీగితే మాత్రం చట్టంతో చెలగాటమాడినట్లే! మన చట్టాల దృష్టిలో మహిళలు కాస్త ఎక్కువ సమానులు.
 అలాగని మన సమాజంలో పురుషులందరూ కూడా సర్వసమానులు కాదు.

పురుషులలో కూడా కొందరు ఎక్కువ సమానులు ఉందురు. అట్టివారు సహజంగా చట్టాలకు చుట్టాలై ఉందురు. ప్రభుత్వాన్ని సైతం కనుసన్నలలో శాసించగల అర్థబలసంపన్నులు, బాలీవుడ్ కథానాయకాగ్రేసరులు, అధికార పార్టీలకు అనుంగు అస్మదీయులు వంటి వారు ఈ కోవలోకి వస్తారు.

 అయితే, మన సమాజంలో ఎలాంటి అర్థబలం, అంగబలం లేకుండా, సాదాసీదాగా దించినతల ఎత్తకుండా సంసారపక్షంగా బతుకుబండిని భారంగా లాగించే మగాళ్లే ఎక్కువ. సమాజంలో ఎలాంటి నేరాలు, ఘోరాలు జరిగినా, అలాంటి ఘోరనేరాలతో సంసారపక్షపు పురుషాధములకు ఎలాంటి సంబంధం లేకున్నా, మహిళా సమాజం నుంచి నిందలు, నిష్టూరాలు తప్పవు. ఎవడో ఒకడు... ఎక్కడో ఒకచోట... ఏదో ఒక ఏఅఘాయిత్యానికి తెగబడతాడు.

ఇక అంతే! సమస్త మగజాతికి వ్యతిరేకంగా టీవీ చానెళ్లు, పత్రికల సాక్షిగా ‘నారీభేరి’ మోగుతుంది. ప్రమీలా రాజ్యానికి వెళ్లిన అర్జునుడికి ఆ రోజుల్లో కనుక రాజపూజితంగా గడిచిపోయింది గానీ, ఈ రోజుల్లో అయితేనా! పొరపాటున లేడీస్ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కి, ముఖం వాచేలా చీవాట్లు తినకుండా బయటపడమనండి చూద్దాం... ఫల్గుణుడి ప్రతాపమెంతో తెలుస్తుంది.
 

మరిన్ని వార్తలు