ఆకాశం అందింది

13 Jun, 2018 00:07 IST|Sakshi

ఆదర్శం

శకుంతల కాలే. మహారాష్ట్ర స్టేట్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ అండ్‌ హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ చైర్‌ పర్సన్‌. ఈ ఏడాది మహారాష్ట్ర ఎస్‌.ఎస్‌.సి. ఫలితాలు ఆవిడ చేతుల మీదుగానే విడుదల అయ్యాయి. ఎస్‌.ఎస్‌.సి. వరకైనా చదివే ఆర్థిక పరిస్థితి లేని ఒక పల్లెటూరి అమ్మాయి ఈ స్థాయికి చేరడం వెనుక ఉన్నవి కేవలం ఆమె కృషి, పట్టుదల, దీక్ష మాత్రమే.

పుణే జిల్లా అంబేగావ్‌ అనే చిన్న పల్లెటూరు శకుంతలది. చిన్నతనంలోనే..  నాలుగో తరగతి చదువుతుండగానే తన తండ్రిని కోల్పోయింది. తల్లి నిరక్షరాస్యురాలు. భర్త పోయాక తప్పనిసరి పరిస్థితుల్లో పొలం పనులకు వెళ్లవలసి వచ్చింది. వ్యవసాయ కూలీగా వచ్చే డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోయేది కాదు. శకుంతలను ఎలా చదివించగలదు. పైచదువులకు ఎలా పంపగలదు? ఎలాగో కష్టపడి పదో తరగతి వరకు చదివించింది కూతుర్ని. అంతకంటే ముందే.. పద్నాలుగో ఏటే శకుంతలకు పెళ్లి చేసేసింది. ఆ తరవాతే పదో తరగతి పరీక్షలు రాసింది శకుంతల. 

పద్నాలుగేళ్లకే పెళ్లి
‘‘మా ఊళ్లో జూనియర్‌ కాలేజీ లేదు. దూరాలకు పంపించి చదివించే స్థోమతా లేదు అమ్మకు. అందువల్లే నాకు అంత చిన్నవయసులో వివాహం చేసేసింది అమ్మ’’ అంటుంది శకుంతల. వివాహం అయ్యాక శకుంతల అత్తవారింటికి చేరింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. అక్కడా అంతే. ఆడపిల్లల చదువుకి ప్రాధాన్యం లేదు. అయితే ‘‘నా అదృష్టం కొద్దీ మా అత్తమామలు కాస్త లోకాన్ని చూసినవారు. నన్ను చదువుకోమని ప్రోత్సహించారు’ అంటూ సంబరంగా చెబుతుంది శకుంతల. అలా ఇంట్లో అందరూ సహకరిస్తుండటంతో, ఏదో ఒకటి సాధించాలనే కోరిక బయలుదేరింది ఆమెలో. ఈ విషయంలో ‘సావిత్రి ఫూలే పుణే విశ్వవిద్యాలయానికి’ రుణపడ్డానని చెప్తుంది శకుంతల. ఆ కాలేజీలో దూర విద్య ఉంది. అందువల్ల ఆ సెంటర్‌ నుంచి డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్, బీఏ, ఎంఏ (మరాఠీ) పూర్తి చేసింది. 

రేడియోనే ఎన్‌సైక్లోపీడియా
‘‘డీఈడీ పూర్తి చేసిన తరవాత, నేను చదువుకున్న పాఠశాలలోనే టీచర్‌గా పనిచేశాను. సౌకర్యాలు ఉంటే, ఎదగగలమని  చాలామంది అభిప్రాయపడతారు. కాని ప్రతికూల పరిస్థితుల్లో, వ్యక్తిగా ఏ మాత్రం ఎదగడానికి అవకాశం లేని పరిస్థితుల్లోనే ఒక బలమైన శక్తి ఎలాగో వచ్చేస్తుందనుకుంటాను. నాలోనే ఆ శక్తి, పట్టుదల మొదలయ్యాయి. ఎలాగైనా సరే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో పాసవ్వాలని దీక్ష పట్టాను’’ అని చెబుతుంది శకుంతల. పరీక్షలకు కావలసిన మెటీరియల్‌ అందుబాటులో లేవు, కనీసం వార్తలు చూద్దామంటే టీవీ సదుపాయం కూడా లేదు. ఆ గ్రామంలో ఏ సమాచారం తెలుసుకోవాలన్నా ఆమెకు రేడియోనే ఆధారం. తన కల నెరవేరాలంటే అందుబాటులో ఉన్న సాధనాన్నే వినియోగించుకోవాలనుకుంది శకుంతల. రేడియోలో వచ్చే వార్తలు వింటూనే జనరల్‌ నాలెడ్జి పెంచుకుంది.

ఉమెన్స్‌డే రోజే పీహెచ్‌డీ
ఉదయం మూడు గంటలకే లేవడం, గ్రామంలో దూరంగా ఉన్న బావి నుంచి నీళ్లు తోడి తెచ్చుకోవడం, ఇంటిపనులన్నీ పూర్తి చేసుకోవడం, స్కూల్‌కి వెళ్లడం.. ఇదీ శకుంతల దినచర్య. మధ్యలో కాస్త తీరిక దొరికినా, ఆ కాస్తలోనే ప్రిపరేషన్‌.అలా 1993లో సర్వీస్‌ కమిషన్‌ క్లాస్‌ 2 పరీక్ష పాస్‌ అయింది. ‘‘నా కల నెరవేరింది. ఆకాశాన్ని అందుకున్నంత ఆనందం కలిగింది. పట్టుదల ఉంటే ఎవరైనా, దేన్నైనా సాధించగలరు అని తెలుసుకున్నాను’’ అంటున్న శకుంతల కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందింది. షోలాపూర్‌లో విద్యాశాఖలో ఉద్యోగం సంపాదించింది.‘‘1995లో నేను క్లాస్‌ 1 ఆఫీసర్‌ని అయ్యాను. స్త్రీవిద్య విభాగానికి హెడ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాను. గ్రామీణ నవలా సాహిత్యంలో మహిళల పాత్రచిత్రణ అనే అంశంపై పీహెచ్‌డీ చేశాను. యాధృచ్చికంగా అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించిన సంవత్సరమే నా పీహెచ్‌డి పట్టా అందుకున్నాను’’ అంటున్న శకుంతల మహిళలకు ఓ ఆదర్శం. గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఆమె స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ అండ్‌ హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ చైర్‌ పర్సన్‌గా నియమితులయ్యారు. 
– రోహిణి 

మరిన్ని వార్తలు