రేసిజానికి అర్థం మార్చేసింది!

12 Jun, 2020 04:01 IST|Sakshi
మెరియం వెబ్‌స్టర్‌ డిక్షనరీ, కెన్నెడీ మిచమ్‌

చేర్పు మొక్కకి శ్రద్ధగా అంటు కడతారు.
కలిసిపోవాలి. కొత్తవి వికసించాలి. యూ.ఎస్‌.లో అలా లేదు.
శ్రద్ధగా అంటు విడగొడుతున్నారు!
‘‘షిట్‌.. నల్లవాళ్లను కలుపుకోవడమా!’’
సి..స్ట..మే..టì...క్‌.. రేసిజం!!
పైకి కనిపించని జాత్యహంకారం.
డిక్షనరీలో ఇంత
లోతైన అర్థం లేదు.
పాతను తీసి, ఇప్పుడా లోతును
చేర్చబోతోంది వెబ్‌స్టర్‌.
అదీ ఒక విద్యార్థిని మాట మీద!

యూనివర్సిటీ నుంచి కెన్నెడీ మిచమ్‌ ఫ్రెష్‌గా బయటికి వచ్చిందని చెప్పడానికి లేదు. నల్లజాతి అమ్మాయి. స్కూల్లో, కాలేజ్‌లో, యూనివర్సిటీలో నలిగి నలిగి.. ‘అమ్మ దేవుడా’ అని డిగ్రీతో బయటపడింది. తెల్ల చూపులు, తెల్ల మాటలు, తెల్ల సోషల్‌ డిస్టెన్స్‌లు.. అన్నీ అయి, అయోవాలోని డ్రేక్‌ విశ్వవిద్యాలయం నుంచి అకడమిక్‌ క్యాప్‌తో గేటు దాటగానే.. మినియాపలీస్‌లో పెద్ద పిడుగు. అదిరిపడింది. జార్జి ఫ్లాయిడ్‌ విషాద మరణం!

అదురుపాట్లు మిచమ్‌కు కొత్తేం కాదు. జాత్యహంకారానికి అలవాటు పడలేకపోతోంది. మిస్సోరీలోని ఫ్లోరిసెంట్‌లో ఉంటుంది తను. అక్కడికి దగ్గర్లోనే ఫెర్గూసన్‌. 2014లో మైఖేల్‌ బ్రౌన్‌ అనే పద్దెనిమిదేళ్ల నల్లజాతి యువకుడిని ఒక పోలీసు అధికారి కాల్చి చంపింది ఫెర్గూసన్‌లోనే. నేటి ‘బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌’ ఉద్యమానికి నాంది అది. మిచమ్‌కి అప్పుడు పదహారేళ్లు. ఇంటికొచ్చాక పెద్దవాళ్లను అడిగింది.. ‘ఒక మనిషిని అలా ఎలా చంపేస్తారు?’ అని. ‘రేసిజం’ అన్నారు.

ఆ మాటకు అర్థం కోసం ‘మెరియం వెబ్‌స్టర్‌’ డిక్షనరీలో వెతికింది. పుట్టిన జాతి నుంచి సంక్రమించే ఆధిక్యభావన అని ఉంది! ఆ అర్థం కరెక్టు కాదనిపించింది మిచమ్‌కు. ఆధిక్యభావన ఉంటే ఉండొచ్చు.. మనిషిని మనిషిలా చూడాలి కదా.. అనుకుంది. అమెరికాలో అత్యధికంగా విక్రయం అయ్యే నూటా ఎనభై ఐదేళ్ల నాటి మెరియం వెబ్‌స్టర్‌ డిక్షనరీని గొప్ప భాషా పండితులే రూపొందించి ఉండొచ్చు. కానీ బయట కనిపించే రేసిజానికి, డిక్షనరీలో కనిపిస్తున్న అర్థం సరిపోవడం లేదు
∙∙
‘రేసిజం’ అంటే డిక్షనరీలో ఉన్న అర్థం కరెక్టేనా అని ప్రొఫెసర్‌లను అడిగింది మిచమ్‌. ‘అవును కరెక్టే కదా’ అన్నారు. ‘పైపై అర్థం కాదు సర్, వాస్తవ పరిస్థితికి ఆ అర్థం సరిపోతుందా?’ అని మళ్లీ అడిగింది. రెండోసారి వాళ్లు సమాధానం చెప్పలేదు. సోషల్‌ మీడియాలో ఈ టాపిక్‌ని తెచ్చింది. ‘నీకర్థం కాదులే’ అని కొందరన్నారు. ‘చదువుకోడానికి నీకు రిజర్వేషన్‌ ఉంది కదా. అదే రేసిజం’ అని నవ్వారు కొందరు. వాళ్ల మాటలు కూడా మిచల్‌కు రేసిజంలానే అనిపించాయి. కానీ అవి డిక్షనరీ అర్థం పరిధిలోకి రానివి! వాళ్ల మాటల్నే సరిగా నిర్వచించలేనప్పుడు జార్జిఫ్లాయిడ్‌ను చంపేసిన పోలీసు మోకాలిలోని జాత్యహంకారానికి మెరియం వెబ్‌స్టర్‌ సరైన అర్థాన్ని ఎలా చెప్పగలుగుతుంది? ఫ్లాయిడ్‌ మే 25న చనిపోయాడు.

మిచల్‌ మే 28న ఆ డిక్షనరీ పబ్లిషర్‌లకు మెయిల్‌ పెట్టింది. ‘‘మీ డిక్షనరీలో రేసిజం అనే మాటకు ఉన్న అర్థం తప్పు. దానిని మార్చాలి’’ అని తను అనుకున్న అర్థం ఏమిటో రాసి పంపింది. వెంటనే వెబ్‌స్టర్‌ ఎడిటర్‌ ఆమెకు రిప్లయ్‌ ఇచ్చారు. ‘‘ఆగస్టులో మార్కెట్‌లోకి వచ్చే డిక్షనరీలో రేసిజానికి మా పాత అర్థాన్ని తొలగించి, మీ కొత్త అర్థాన్ని చేరుస్తున్నాం’’ అని తెలిపారు! ‘ఐ వాజ్‌ సూపర్‌ హ్యాపీ’ అంటోంది మిచమ్‌ ఆ రిప్లయ్‌ని చూసినప్పుడు తనకేం అనిపించిందో చెబుతూ. రేసిజాన్ని వెబ్‌స్టర్‌ ‘ఆధిక్య భావన’ అంది. మిచమ్‌ ‘అల్పులనే భావన’ అంది. అల్పులు అనే భావన మనసులో లేకపోతే అధిక్యం అనే భావనే ఉండదని మిచమ్‌ ఉద్దేశం. నల్లవాళ్లకు ఎందులోనూ అధికారం లేకుండా చేసేందుకు, ఒక ప్రణాళిక ప్రకారం (సి..స్ట..మే..ట...క్‌..గా) సాగుతున్న వివక్షే రేసిజం అనే అర్థం రావాలని మిచమ్‌ తపన. ఆ తపనని మెరియం వెబ్‌స్టర్‌ డిక్షనరీ గుర్తించి, గౌరవించింది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు