మైక్రోసాఫ్ట్ వండర్ టెక్ హాలో లెన్స్!

27 Jan, 2015 23:57 IST|Sakshi
మైక్రోసాఫ్ట్ వండర్ టెక్ హాలో లెన్స్!

డెస్క్‌టాప్ కంప్యూటర్  పేరు చెప్పగానే.... ఓ స్క్రీన్, మౌస్.. కీబోర్డు కళ్లముందు కదులుతాయి. అనంత విశ్వం కూడా  ఈ బుల్లిపెట్టెలోనే ఇమిడిపోతుంది.  ఆ స్క్రీన్‌పైనే రకరకాల ప్రాంతాల్లో  రకరకాల సమాచారాన్ని చూసుకుంటూ  అర్థం చేసుకుంటూ మార్చుకుంటూ  గడిపేస్తాం మనం. ఇకపై ఆ అవసరం లేదంటోంది   మైక్రోసాఫ్ట్. కొన్ని నెలల్లో అందుబాటులోకి రానున్న హాలోలెన్స్ టెక్నాల జీతో మీరున్న గదే పీసీ తెరగా మారిపోతుందంటోంది. ఏమిటీ హాలోలెన్స్ టెక్నాలజీ? ఎలా పనిచేస్తుంది?
 
హాలీవుడ్ సినిమా ఐరన్‌మ్యాన్ చూశారా? దాంట్లో జార్విస్ పేరుతో ఓ సూపర్ కంప్యూటర్ ఉంటుంది. దాని సీపీయూ ఎక్కడుంటుందో సినిమాలో చూపించలేదుగానీ... హీరో మాటలనే ఆదేశాలుగా స్వీకరిస్తూ, మాట్లాడుతూ పనిచేస్తుందది. అంతేకాదు. హీరో డిజైన్ చేస్తున్న శక్తిమంతమైన సూట్ తాలూకూ వివరాలన్నింటినీ హీరో ఉన్న చోటే గాల్లో ప్రదర్శిస్తూంటుంది. హీరో గాల్లో చేతులు ఊపుతూ, కదుపుతూ ఆ డిజైన్‌లో మార్పులు చేర్పులు చేస్తూంటాడు. మైక్రోసాఫ్ట్ తన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘విండోస్ 10’లోకి చేర్చిన హాలోలెన్స్ కూడా దాదాపుగా ఇదేమాదిరిగా పనిచేస్తుంది. కాకపోతే ఐరన్‌మ్యాన్‌లో హీరో కళ్లజోడు లాంటిది పెట్టుకోడు. హాలోలెన్స్‌కు హైటెక్ గ్లాస్ లాంటి పరికరం అవసరమవుతుంది. అంతే!

ఊహూ... ఇది గూగుల్ గ్లాస్ మాదిరిగా కళ్లజోడులోని అద్దంపై కంప్యూటర్ స్క్రీన్‌ను ప్రొజెక్ట్ చేయదు. హాలోగ్రామ్‌ల ఆధారంగా పనిచేసే తొలి కంప్యూటర్ ఇదని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. మన కంటికి కనిపించే వస్తువులు ఎలాగైతే పదార్థాలతో తయారవుతాయో అలాగే హాలోగ్రామ్‌లో కనిపించే వస్తువులు అచ్చంగా కాంతితో తయారవుతాయి. హాలోలెన్స్ కోసం మైక్రోసాఫ్ట్ ప్రత్యేకంగా ఓ హాలోగ్రామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సిద్ధం చేసింది. కళ్లజోడు లాంటి ఈ పరికరాన్ని తగిలించుకుని నచ్చిన ఫీచర్లను మీ గదిలోని రకరకాల వస్తువులపై ఉంచవచ్చు. వాటితో ఆడుకోవచ్చు. ఉదాహరణకు మీ పీసీలో వీడియో ప్లేయర్‌ను తీసుకుందాం. దీన్ని మీ గది గోడపై ‘పిన్’ చేయవచ్చు. అలాగే ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫైళ్లు ఉన్న ఫోల్డర్‌ను బీరువా ముందుభాగంలో... ఫొటోలు, ఆడియోఫైళ్లను కాఫీటేబుల్‌పై.. అలా అన్నమాట. ఈ పనులన్నీ చక్కబెట్టేందుకు హెచ్‌పీయూలో ప్రత్యేకమైన సెన్సర్లు, హైడెఫినిషన్ లెన్స్‌లు ఉంటాయి.

అయితే ఏంటి?

ఎన్ని హైటెక్ హంగులున్నా ఇది కూడా ఓ పీసీనే కదా? నాకు కలిగే అదనపు ప్రయోజనమేమిటి అనుకుంటున్నారా? చాలానే ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ మాటల్లో చెప్పాలంటే... ‘‘మీరు ప్రపంచాన్ని చూసే దృష్టి మారినప్పుడు ప్రపంచమూ మారిపోతుంది’’ అని. హాలోలెన్స్ టెక్నాలజీతో మీరు పీసీని కీబోర్డు, మౌస్‌లతో వాడరు. నేరుగా మీ చేతులనే ఉపయోగించుకుంటూ ఫైళ్లను నియంత్రిస్తూంటారు. ఒక దగ్గర స్థిరంగా కూర్చోవాల్సిన పని అంతకంటే లేదు. ఎంచక్కా అటు ఇటూ నడుస్తూనే పీసీతో చేసే అన్ని పనులు చేసుకోవచ్చు. 2డీలో ఉన్న ఫైళ్లను త్రీడీలో చూసుకోగలగడం, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోగలగడం దీంట్లోని మరో ప్రత్యేకత. ఒకవైపు మీ ఫైళ్లు చూస్తూనే... ఇతర వస్తువులను కూడా మామూలుగా చూడగలిగేలా హాలోలెన్స్ వస్తువులన్నీ పారదర్శకంగా ఉంటాయి.

గూగుల్ గ్లాస్‌తోపాటు అకలస్ రిఫ్ట్ వంటి వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్‌సెట్లు కొన్ని ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నప్పటికీ వాటికంటే మైక్రోసాఫ్ట్ హాలోలెన్స్ భిన్నమైందని నిపుణుల అంచనా. వీఆర్ సెట్స్ గేమింగ్ ఏరియాను పరిమితం చేస్తే హాలోలెన్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తుంది. మైక్రోసాఫ్ట్ ఇతర ఉత్పత్తులు ఎక్స్‌బాక్స్, కైనిక్ట్‌లతో కలిసి పనిచేయగల సామర్థ్యం ఉంటే హాలోలెన్స్ కంప్యూటర్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లేనని అంటున్నారు. చూద్దాం... ఏమవుతుందో?
 

మరిన్ని వార్తలు