ఆ రోజు అర్ధరాత్రి...

1 Oct, 2014 23:22 IST|Sakshi
ఆ రోజు అర్ధరాత్రి...

 కనువిప్పు
 
హారర్ సినిమాలు చూడడం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. సినిమా చూస్తున్నంత సేపు భయమనిపించేది కాదు. అయిపోయాక మాత్రం అందులోని సన్నివేశాలు గుర్తుకు వచ్చి తెగ భయపడేవాడిని. నాన్నను గట్టిగా పట్టుకొని పడుకునేవాడిని. ‘‘చూడడం ఎందుకు? భయపడడం ఎందుకు?’’ అని నాన్న నాకు క్లాసు తీసుకున్నా...నా అలవాటును మాత్రం మార్చుకోలేక పోయేవాడిని.
 
హాల్లో చూసిన సినిమాలు చాలవన్నట్లు హారర్ సినిమాల డీవిడీలు తెచ్చుకొని చూసేవాడిని. ఇంటర్మీడియట్‌లో చేరడం కోసం విజయవాడకు వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి రూమ్ తీసుకున్నాను. ఇక్కడ కూడా నా అలవాటు మారలేదు. పైగా హారర్ నవలలు కూడా చదివేవాడిని.
 
ఒకసారి... మా రూమ్మేట్‌లు ఇద్దరు ఏదో పనుండి ఊరికి వెళ్లారు. రూమ్‌లో నేను ఒక్కడినే ఉన్నాను. ఆరోజు త్వరగా పడుకున్నాను. అర్ధరాత్రి తరువాత... ఏదో చప్పుడై లేచాను. ఎవరో తలుపు బాదినట్లు అనుమానం వచ్చింది. ధైర్యం చేసి తలుపు తీశాను. అటూ ఇటూ చూశాను. ఎవరో నా వైపు వస్తున్నట్లు అనిపించి ‘కాపాడండి...’ అని గట్టిగా అరిచాను. అలా అరుస్తూనే ఉన్నాను. నా అరుపుల దెబ్బకు ఇంటి ఓనర్‌తో సహా కాలనీలో చాలామంది నిద్ర లేచారు.
 
వాళ్లు ఎంత ధైర్యం చెప్పినా నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ రాత్రి ఇంటి ఓనర్ వాళ్ల ఇంట్లోనే పడు కున్నాను. విషయం తెలిసి మా నాన్నగారు వచ్చారు. నేను పిచ్చిపిచ్చిగా మాట్లాడడం చూసి కలత చెందారు. నన్ను హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. చాలారోజుల పాటు సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్‌మెంట్ చేయించుకున్నాను. దీంతో చదువు అటకెక్కింది. చాలా నష్టం జరిగింది. దాన్ని నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ చదువు మీద శ్రద్ధ పెడుతున్నాను. మంచి మార్కులు సాధించి నాన్న కళ్లలో సంతోషం నింపాలని రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్నాను.
 
-డి.కె, విజయవాడ
 

మరిన్ని వార్తలు