పాలలో వెన్న శాతం పెంచుకునేదెలా?

14 Jan, 2020 06:44 IST|Sakshi

డెయిరీ డైరీ–23

పాలసేకరణ సాధారణంగా గ్రామ స్థాయిలో సంఘాల ద్వారా, ప్రైవేటు డెయిరీల ద్వారా, పాడి సమాఖ్యల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇలాకాక బయట వెండర్లకు కూడా రైతులు పాలను విక్రయిస్తూ ఉంటారు. పాల కేంద్రాల్లో పాలలోని వెన్న శాతాన్ని బట్టి ధరను నిర్ణయిస్తారు. గేదె పాలలో వెన్న శాతం ఎక్కువ కాబట్టి 6–7% ఉంటే లీటరుకు రూ. 35–40 వస్తాయి. అదే ఆవు పాలలో 4–4.5 శాతం ఉంటే లీటరుకు రూ. 25–30 వస్తాయి. వెన్న శాతం పెంపుదలకు రైతులు పాటించాల్సిన సూచనలు..

► ఎక్కువ వెన్న శాతం గల పాలు ఇచ్చే జాతుల పశువులను ఎన్నుకోవాలి. ఆవు పాలలో కంటే గేదె పాలలో వెన్న శాతం ఎక్కువ. హెచ్‌.ఎఫ్‌. ఆవు పాలలో కన్నా జెర్సీ ఆవు పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది.
► తొలి ఈత పశువుల్లో కంటే, 2–3 ఈతల పశువుల్లో వెన్న ఎక్కువగా ఉంటుంది. పశువు ఈనిన తర్వాత 4–6 వారాలకు పాలలో వెన్న శాతం అత్యధిక స్థాయికి చేరుతుంది. రైతులు పాడి పశువులను కొనేటప్పుడు వరుసగా 3 పూటలు గమనించాలి. పాడి చివరి దశలో పాల దిగుబడి తగ్గి, వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి.
► పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను పిండి కేంద్రానికి పోయాలి. మలి ధారల్లో సుమారు 10 శాతం వెన్న ఉంటుంది. వీటిని డూదకు తాగించడం మంచిది కాదు.
► పాలను పితికే సమయం ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే పాలు ఎగసేపుకునే అవకాశాలున్నాయి.
► పాలను త్వరగా పిండేయాలి. ఎందుచేతనంటే, పాల సేపునకు అవసరమయ్యే ఆక్సిటోసిన్‌ అనే హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో కేవలం 8 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ లోపే పాలు పించేయాలి. ఇలా చేస్తే ఆఖరి ధారల వరకు పూర్తి వెన్న శాతం పొందవచ్చు.
► పాలు తీసే సమయంలో పశువుకు బెదురు, చిరాకు చేయకూడదు.
► పశువులకు పీచు పదార్థాలున్న మేతను మేపాలి. వీటి వినియోగానికి పశువు పెద్ద పొట్టలోని సూక్ష్మక్రిములు సహకరిస్తూ, కొన్ని ఆమ్లాలు ఉత్పత్తి చేస్తాయి. వీటి నిష్పత్తిని బట్టి వెన్న శాతం ఉంటుంది.
► పశువుకు తప్పనిసరిగా రోజుకు 3–4 కిలోమీటర్ల నడక వ్యాయామం అవసరం.
► వ్యాధుల బారిన పడకుండా ముఖ్యంగా గాలికుంటు వ్యాధి నుంచి పశువులను రక్షించుకోవాలి.
► పాల కేంద్రంలో పరీక్ష కోసం పాల నమూనా తీస్తున్నప్పుడు జాగ్రత్త అవసరం. దీనిపై రైతు దృష్టి పెట్టాలి.
► దాణా పదార్థాలయిన పత్తి గింజల చెక్క, సోయా చెక్క మొదలగు వాటి వల్ల పాల నాణ్యతా నిష్పత్తి పెరిగే అవకాశం ఉంది.
► గర్భకోశ వ్యాధుల వలన పాల వెన్న శాతం తగ్గుతుంది.

– డా. ఎం.వి.ఎ.ఎన్‌. సూర్యనారాయణ
(99485 90506), ప్రొఫెసర్‌–అధిపతి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లైవస్టాక్‌ ఫామ్‌ కాంప్లెక్స్, కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్, తిరుపతి

మరిన్ని వార్తలు