పాల ఉత్పత్తులతో సమస్య లేదు!

19 Aug, 2019 07:23 IST|Sakshi

పాలు ఆరోగ్యానికి మంచిది కావని మీకు ఇటీవలి కాలంలో ఎవరైనా చెప్పారా? వాళ్ల మాటల్లో నిజం లేదని అంటున్నారు హార్వర్డ్, టఫ్ట్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. గుండెజబ్బులతోపాటు, మధుమేహానికి, పాలకు సంబంధం లేదని తాము అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నామని వీరు చెబుతున్నారు. ఆహారంలో పాల ఉత్పత్తులను భాగంగా చేసుకున్న దాదాపు మూడు వేల మందిపై తాము అధ్యయనం చేశామని.. వీరికి మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తేలిందని ఓ శాస్త్రవేత్త తెలిపారు. అలాగే సుమారు రెండు లక్షల మందిని దశాబ్దాల పాటు పరిశీలించిన తరువాత తాము పాలతో గుండెజబ్బుల సమస్య ఎక్కువ కాదన్న అంచనాకు వచ్చామని వివరించారు. పాల ఉత్పత్తులతో అందే కొవ్వులకు బదులు మొక్కలతో లభించే కొవ్వులు, గింజలను వాడినప్పుడు గుండెజబ్బుల ప్రమాదం ఇంకో 24 శాతం తగ్గిందని వీరు అంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. మాంస ఉత్పత్తులతో సమస్య ఆరు శాతం వరకూ ఎక్కువ కావడం. మొక్కల ద్వారా లభించే కొవ్వులు, పాలతో వచ్చే వెన్నలోని కొవ్వులను పోల్చి చూసినప్పుడు మొదటి రకం కొవ్వులు ఆరోగ్యకరంగా ఉంటే.. రెండో రకం కొవ్వులను మితంగా వాడితే పెద్ద ప్రమాదమేమీ లేదని ఇంకో అధ్యయనం స్పష్టం చేసింది. మొత్తమ్మీద చూస్తే ఏ రకమైన కొవ్వులనైనా మితంగా వాడటం మేలని అర్థమవుతుంది.

మరిన్ని వార్తలు