ఒకేచోట కనీసం 3 ఎకరాలు విత్తాలి

18 Dec, 2018 05:50 IST|Sakshi
అండుకొర్ర కంకి , ఊద పంటను పరిశీలిస్తున్న విజయకుమార్‌

కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు (6నెలల పంటయిన అరికలను ఖరీఫ్‌లో మాత్రమే వేసుకోవాలి) వంటి సిరిధాన్యాలను రబీ పంట కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సాగు చేయదలచిన రైతులు ఒక్కరు గానీ, కొందరు కలిసి గానీ ఒకేచోట కనీసం 3 ఎకరాల నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తేనే పక్షుల తాకిడిని తట్టుకొని పంట దిగుబడిని తీసుకోగలుగుతారని కడప జిల్లా వేంపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త కె. విజయకుమార్‌ తెలిపారు. సిరిధాన్యాల పంటలను పిచ్చుకలు, ఇతర చిన్న సైజు పిట్టలు ఇష్టంగా తింటాయి. ఖరీఫ్‌ కాలంలో అయితే వర్షాధారంగా పంట భూములన్నిటిలోనూ పంటలు ఉంటాయని, గడ్డి గింజలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి పిట్టలు సిరిధాన్య పంటలపైకి మరీ అంతగా దాడి చేయవన్నారు. రబీలో చాలా వరకు భూములన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి సిరిధాన్యాలకు పిట్టల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అందుకని ఎకరం, రెండెకరాల్లో వేస్తే రైతుకు మిగిలేది అంతగా ఉండదంటూ.. కనీసం ఐదెకరాలు వేయడం మంచిదని విజయకుమార్‌ వివరించారు.

 ► గత జనవరిలో రైతుకు కిలో చొప్పున 6 వేల కిలోల సిరిధాన్యాల విత్తనాలను విజయకుమార్‌ ఉచితంగా ఇచ్చారు. విత్తనం తీసుకున్న రైతులు కొందరు సాగు చేశారు. కొందరు దాచి ఉంచారు. ప్లాస్టిక్‌ సంచిలో నుంచి తీసి గుడ్డ సంచి లేదా మట్టి పాత్రలో పోసి విత్తనాలను నిల్వ చేసుకున్న వారు నిశ్చింతగా ఇప్పుడైనా విత్తుకోవచ్చని ఆయన తెలిపారు.

 ► అయితే, కొందరు రైతులు ప్లాస్టిక్‌ ప్యాకెట్‌లో విత్తనాన్ని అలాగే ఉంచారు. వీరు ఆ విత్తనాన్ని విత్తుకునే ముందు విధిగా మొలక పరీక్ష చేసుకోవాలన్నారు. కొబ్బరి చిప్పలోనో, ప్లాస్టిక్‌ గ్లాసులోనో అడుగున చిన్న చిల్లి పెట్టి, మట్టి నింపాలి. తగుమాత్రంగా నీరు పోసి 2 గంటల తర్వాత 10–20 విత్తనాలు వేసి తేలికగా మట్టి కప్పేయాలి. రకాన్ని బట్టి 3–7 రోజుల మధ్య మొలక వస్తుంది. మొలక తక్కువగా ఉంటే ఆ ధాన్యం విత్తనానికి పనికిరాదని గుర్తించాలి. ఇప్పటికీ సాగు చేసే ఆలోచన లేని రైతులు విత్తనాన్ని వృథా చేయకుండా ఆసక్తి గల ఇతర రైతులకైనా ఇవ్వాలని విజయకుమార్‌ సూచించారు.

 ► ప్రస్తుత రబీ కాలంలో కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, బరిగెలు, గోల్డు బరిగలను సాగు చేయవచ్చు. వీటి పంటకాలం 10–80 రోజులు. ఎకరానికి 8–9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి నేలల్లోనైనా పండుతాయి. ఎకరాకు 3 కిలోల విత్తనం చాలు.

 ► కొర్రలో జడ కొర్ర, ముద్ద కొర్ర రకాలుంటాయి. ముద్ద కొర్రకంకిపై నూగు పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి పిచ్చుకలు తినడానికి అవకాశం ఉండదు. 85–95 రోజుల్లో కోతకు వస్తాయి. నల్లరేగడి, తువ్వ, ఎర్రచెక్క, ఇసుక నేలల్లో ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చౌడు గరప నేలల్లో దిగుబడి తక్కువగా వస్తుంది. 3 లేదా 4 తడులు అవసరం. ఎకరానికి 3 కిలోల విత్తనం చాలు.
 ► ఊదలు ఎటువంటి నేలల్లోనైనా సాగు చేయవచ్చు. ఒకమాదిరి జిగట, ఉప్పు నేలల్లోనూ, నీరు నిలువ ఉన్న నేలల్లోనూ సాగు చేయవచ్చు. భూమిని తేలికపాటుగా మెత్తగా దున్ని పశువుల ఎరువు ఎకరానికి 5 టన్నులు వేసి కలియదున్నాలి. అది లేకపోతే గొర్రెలు, ఆవుల మందను పొలంలో మళ్లించాలి. కలుపు లేకుండా చూసుకోవాలి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. భూమి సారవంతంగా ఉంటే 8–10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వంద నుంచి 110 రోజుల పంటకాలం. 5 సార్లు నీరు పారించాల్సి ఉంటుంది. వర్షాకాలంలో అయితే నీరు పారించాల్సిన అవసరం లేదు.

 ► అండుకొర్రను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. ఎటువంటి నేలల్లోనైనా పండుతుంది. నీరు నిల్వ ఉండే భూములు పనికిరావు. దీన్ని పల్చగా విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. పలచగా ఉంటే ఎక్కువ పిలకలు వస్తాయి. రసాయనిక ఎరువులు వాడకూడదు. యూరియా వేస్తే బాగా పెరిగి పడిపోతుంది. 90–105 రోజుల్లో పంట వస్తుంది. ముందుగా కోస్తే గింజలు నాసిరకంగా ఉంటాయి. బియ్యం సరిగ్గా ఉండవు. పిండి అవుతాయి.
సిరిధాన్యాలు ఏవైనా సరే గింజ ముదిరి, కర్రలు బాగా పండాకే కోయాలి. అప్పుడే మంచి నాణ్యమైన దిగుబడి∙వస్తుంది. మంచి ధర కూడా పలుకుతుంది. సిరిధాన్యాలు సాగు చేసిన భూమి ఏగిలి మారి సారవంతమవుతుంది. సిరిధాన్యాల సాగుపై సలహాల కోసం విజయకుమార్‌ (98496 48498) ను ఆంధ్రప్రదేశ్‌ రైతులు ఉ. 6–9 గం. మధ్యలో, తెలంగాణ రైతులు సా. 6–9 గం. మధ్య సంప్రదించవచ్చు.
 

మరిన్ని వార్తలు