ఆ నేను ఎవరు?

10 May, 2018 00:50 IST|Sakshi

కొన్ని సందర్భాల్లో కొందరు... ‘నేను’ అనే భావనను విడనాడి... తనను తాను మరచిపోయి... తననుంచి తాను విడిపోయి...  వేరొకరిగా మారిపోతారు. ఆ పరిస్థితినే ‘డిసోసియేషన్‌’ అంటారు. అలా విడిపోవడం ద్వారా వ్యక్తమయ్యే మానసిక రుగ్మతలే డిసోసియేషన్‌ డిజార్డర్స్‌. వాటిపై అవగాహన కోసమే ఈ కథనం.


ముందుగా ఒక కేస్‌స్టడీ పరిశీలిద్దాం...
రాణి ఒక పేదింటి పిల్ల. మునసబుగారి అబ్బాయి ఆమెను వేధిస్తున్నాడు. అతడిది ఆర్థికంగా, సామాజికంగా పెద్ద స్థాయి. అంతటి స్థాయిలో ఉన్న మునసబుగారి అబ్బాయిని ఎదిరించగలిగే మానసిక స్థైర్యంగానీ, బలంగాని రాణికి లేవు. అయితే మరి రాణి ఈ పరిస్థితిని అధిగమించగలిగేది ఎలా? ఇక్కడ ఒక మతలబు ఉంది. మెదడు చాలా తెలివైనది. తనను తాను ఎలా కాపాడుకోవాలో మెదడుకు సహజసిద్ధంగానే తెలుసు. రాణి శరీరంలోకి ఆమె ప్రమేయం లేకుండానే ఆ ఊరి అమ్మవారు ప్రవేశిస్తుంది.

ఆమె గొంతు (స్వరం), మాట, ప్రవర్తన అన్నింటిలోనూ చిత్రమైన మార్పు కలుగుతుంది. హావభావాలు మారిపోతాయి. రాణి అమ్మవారుగా మారిపోతుంది. అయితే తనలో సంభవించే ఈ మార్పులు రాణికి కూడా తెలియవు. మెదడు చేసే కొన్ని పనులు ‘సబ్‌–కాన్షియస్‌’ స్పృహతో జరగడం వల్ల బాహ్య స్పృహకు అవి జరుగుతున్న విషయమే తెలియకుండ జరుగుతాయి. తన చుట్టూ ఉన్న ప్రాకృతికమైన అంశాలను (నేచర్‌ను) అనుక్షణం పరిశీలించే మెదడు తనను ప్రమాదం నుంచి కాపాడుకోడానికి ఈ పరిస్థితిని ఎంచుకుంటుంది.

దీన్నే మనం పూనకం అంటాం.ఇప్పుడు అమ్మవారు పూనాక రాణి స్థాయి సృష్టిలో అందరికన్నా ఎక్కువ. ఆర్థికంగా, సామాజికంగా బలమైన మునసబు కొడుకు కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ. సాక్షాత్తూ ఆమే అమ్మవారు. ఊరిజనం అంతా ఆమెకు పూజలు చేస్తుంటారు. ఆమె ఆజ్ఞలను పాటిస్తుంటారు.  రాణి తాత్కాలికంగా తన సమస్యనుంచి బయటపడుతుంది.

అంతేకాదు... ఆమె కోరుకోని మరికొన్ని కోరికలూ తీరుతాయి. దాంతో ఇదే అలవాటుగా మారుతుంది. సమస్యలు కలిగినప్పుడల్లా ఆమె ఇతరులను పొసెస్‌ చేసుకుంటుంది. అంటే అమ్మవారు తనను పూనడాన్ని ఆహ్వానిస్తుంది.  కొన్నిసార్లు అమ్మవారే కాకుండా, కొందరిలో వేరే మనిషి గానీ,  వారు ఊహించుకునే లేని దెయ్యాలూ, భూతాలు పూనడం కూడా జరుగుతుంది.  

డీసోసియేషన్‌ కలిగే పరిస్థితులివి...
తీవ్రమైన ఒత్తిడి తట్టుకోలేనంత అలసట తీవ్రమైన డిప్రెషన్‌
చిన్నప్పుడు తీవ్రమైన ఒత్తిడికి గురైన పరిస్థితుల్లో దృఢమైన, సమన్వయంతో కూడిన ‘నేను’ అనే భావన బలంగా ఏర్పడదు. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే స్టేబుల్, ఇంటిగ్రేటెడ్‌ సెల్ఫ్‌ ఫీలింగ్‌ ఏర్పడదు. అలాంటి పరిస్థితుల్లో వ్యక్తి డీసోసియేషన్‌కు గురవుతాడు. అప్పుడు ఒకే వ్యక్తిలో అనేక వ్యక్తిత్వాలు (మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్స్‌) ఏర్పడవచ్చు.

ఉదాహరణకు అపరిచితుడు సినిమాలోని మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్స్‌ ఈ కోవకు చెందిందేనని చెప్పవచ్చు. ఒక వ్యక్తి తన శరీరాన్ని తనదిగా గుర్తించగలగడానికి స్పర్శ వంటి జ్ఞానేంద్రియాలూ పనిచేయాలి. అలాగే తన స్థితికి సంబంధించిన ఉనికి తెలుసుకునేందుకు ఒక నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. అదే లేకపోతే ఒక వ్యక్తికి ‘నా’ అనే భావన ఉండదు.

దీన్ని మరింత తేలిగ్గా అర్థమయ్యేలా తెలుసుకోవడం కోసం ఒక ఉదాహరణ చూద్దాం.  మన శరీరంలో ఒక భాగానికి మత్తు (అనస్థీషియా) ఇచ్చామనుకోండి. అప్పుడు అక్కడ చిన్నపాటి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నా సరే... అక్కడేదో జరుగుతోందని మనకు తెలియదు కదా. మనం  ఆ భాగాన్ని కళ్లతో చూడకపోతే ఆ భాగం మన శరీరంలోనిది కాదని కూడా అనిపించవచ్చు. డిసోసియేషన్‌లో కూడా ఇలాంటి భావనే వస్తుంటుంది.

అలాంటివే మరికొన్ని ఉదాహరణలు
కొందరు పీర్ల గుండం దగ్గర లేదా కొన్ని ప్రత్యేక ప్రార్థనల సమయంలో నిప్పుల మీద నడుస్తుంటారు. తీవ్రమైన భక్తిభావనకు లోనైనప్పుడు నిప్పుల మీద నడిస్తే బాధ అనే భావనే రాదు. దీన్నే ‘సెన్సరీ డిసోసియేషన్‌’ అంటే జ్ఞానేంద్రియాలకు... ప్రధానంగా స్పర్శకు సంబంధించిన డిసోసియేషన్‌గా చెప్పవచ్చు.
ఏదైనా తీవ్రమైన సంఘటన సంభవించినప్పుడు మన మెదడు మొద్దుబారిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. అందుకే కొందరికి యాక్సిడెంట్‌లో తీవ్రమైన గాయాలైనా కొంతసేపటి వరకు నొప్పి కలగకపోవడాన్ని చూస్తుంటాం. ఇది కూడా డిసోసియేషన్‌ వల్ల జరిగే పరిణామమే.
ఒక సబ్జెక్ట్‌పై చాలా ఆసక్తి కలిగినప్పుడు ఒక విద్యార్థి తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతోందో కూడా తెలియనంతగా అందులో లీనమైపోయినపోతాడు. అలాంటి సందర్భాల్లోనూ డిసోసియేషన్‌ కలుగుతుంది.
అత్యంత భక్తిభావనను మనసు నిండా నింపుకున్న వ్యక్తి ఒక్కోసారి తనలోకి దైవం చేరినట్లుగా అనుభూతి చెందుతాడు. ఇది కూడా ఒక తరహా డిసోసియేషనే. మానసిక వైద్య పరిభాషలో చెప్పాలంటే ఈ స్థితిని ‘పొసెషన్‌’ అంటారు. కాకపోతే ఇది సంస్కృతి ఆమోదించన అంశం కావడంతో పాటు ఆ వ్యక్తికి గానీ, ఇతరులకు ఇబ్బంది కలగనంతవరకు దీన్ని వ్యాధిగా పరిగణించరు.

డిసోసియేషన్‌ ఆమ్నీషియా : ఏదైనా కారణంతో మనసుకు తీవ్రమైన గాయం కలిగించిన / కలిగిస్తున్న పరిస్థితులనూ / సంఘటనలనూ మరచిపోవడం అన్నది ‘డిసోసియేషన్‌ ఆమ్నీషియా’ అనే కండిషన్‌లో కలుగుతుంది. ఈ మరపు అన్నది సాధారణ మరపు కంటే చాలా తీవ్రంగా ఉంటుంది.

డిసోసియేటివ్‌ ఫ్యూగ్‌ (దేశ దిమ్మరి) : ఒక వ్యక్తి తన నివాస స్థలం నుంచి లేదా తాను పనిచేసే చోటు నుంచి అనుకోకుండా ప్రయాణం మొదలుపెడతాడు. ఈ ప్రయాణంలో సెల్ఫ్‌కేర్‌ (శుభ్రత, ఆహారం, నిద్ర వంటి అంశాలు) మామూలుగా ఉన్నా... (వెనకకు తిరిగి వచ్చాక) తాను ఆ ప్రయాణంలో ఎక్కడికి వెళ్లిందీ, ఏం చేసిందీ అన్న అంశాలను పాక్షికంగానో / మొత్తంగానో మరచిపోతాడు.

ట్రాన్స్‌ / పొసెషన్‌ స్టేట్‌ అంటే...
ట్రాన్స్‌ : తాను అనే తన సొంత భావనను... ఇంగ్లిష్‌లో చెప్పాలంటే... తన ఐడెంటిటీని కోల్పోయే స్థితిని ట్రాన్స్‌ అంటారు. తన చుట్టూ జరుగుతున్న దానిని గుర్తించని లేదా కొన్నింటిని మాత్రమే గుర్తించే స్థితి ఇది.  తన భాష, కదలికలు, భంగిమలు చాలావరకు తగ్గిపోతాయి. ఈ స్థితిలో కేవలం రెండు మూడు మాటలే మాట్లాడుతారు. వ్యక్తిలో కేవలం ఒకే రకమైన ప్రవర్తన ఉండటం కనిపిస్తుంది.
పొసెషన్‌ కండిషన్‌ : ఒక వ్యక్తి శరీరంలోకి మరొకరు చేరడాన్ని పొసెషన్‌ అని ఇంతకుముందు ఒక ఉదాహరణలో చెప్పకున్నాం.  వ్యక్తిలో మరొక వ్యక్తి ప్రవేశించినట్లుగా  భూతం / దెయ్యం / శక్తి ఆవహించినట్లుగా కావడాన్ని ‘పొసెషన్‌ స్టేట్‌’ అంటారు.

డిసోసియేషన్‌తో కలిగే సమస్యలు :
డిసోసియేటివ్‌ మోటార్‌ డిజార్డర్స్‌ : తనలో ఎలాంటి శారీరక సమస్య లేకపోయినా, నరాలకు సంబంధించిన లోపాలు లేకపోయినా మాటపడిపోవడం (మ్యూటిజం), ఒళ్లు తూలడం, నడవలేకపోవడం, అడుగులు పడకపోవడం, బ్యాలెన్స్‌ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే అది డిసోసియేటివ్‌ మోటార్‌ డిజార్డర్‌ వల్ల కావచ్చు.
డిసోసియేటివ్‌ కన్వల్షన్స్‌ : శరీరంలో ఫిట్స్‌ వచ్చినప్పటిలా కదలికలు సంభవించడం జరుగుతుంది. అలాంటప్పుడు వీళ్లు కిందపడిపోయినా సాధారణంగా ఎలాంటి గాయం కాకపోవచ్చు. అయితే మూర్ఛ వ్యాధి ఉన్నవారిలోలా నాలుక కొరకడం, మూత్రవిసర్జన చేయడం మాత్రం ఉండకపోవచ్చు.  లేదా కొందరిలో చాలా అరుదుగా మాత్రమే ఉండవచ్చు.

డిసోసియేటివ్‌ అనస్థీషియా / సెన్సరీ లాస్‌ : శరీరంలోని ఒక భాగం లేదా మొత్తం శరీరంలో ఏ కారణం లేకుండా స్పర్శ లేకపోవడం. తాకినా, గిచ్చినా, మంటకు ఎక్స్‌పోజ్‌ చేసినా ఎలాంటి స్పర్శ జ్ఞానం కలగకపోవడం.  కొందరు తమ చూపు, వినికిడి శక్తి, వాసన చూసే శక్తి కోల్పోవడం కూడా జరగవచ్చు.
∙యుద్ధఖైదీలకు చేసే ‘బ్రెయిన్‌ వాష్‌’ కూడా ఒక రకమైన డిసోసియేషన్‌గా చెప్పవచ్చు.
∙కొందరికి తమ శరీరం నుంచి తాము విడిపోయి, బయటి నుంచి తమను తాము చూసుకున్న భావన కలుగుతుంది. ఇలాంటి అనుభూతి ‘నియర్‌ డెత్‌’ అనుభావాల్లోనూ కలుగుతుంది. ఇవి కూడా డిసోసియేషన్‌ వల్ల కలిగే అనుభూతులు మాత్రమే.

కన్వర్షన్‌ డిజార్డర్స్‌ :
తీవ్రమైన మానసిక సంఘర్షణ కలిగి, దాన్ని వ్యక్తీకరించలేనప్పుడు మన మెదడు మనకు తెలియకుడానే వాటిని శారీరక లక్షణాలుగా మార్చుకొని వ్యక్తీకరిస్తుంది. మానసిక సమస్యలు శారీరక లక్షణాలుగా వ్యక్తమైనప్పుడు దాన్ని కన్వర్షన్‌ డిజార్డర్‌ అంటారు.  తమకు తామే హాని చేసుకునేలా, లేదా ఇతరులకు హాని జరిగేలా ‘డిసోసియేషన్‌’ జరుగుతున్న సందర్భాల్లో రోగులు తప్పనిసరిగా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి, చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

డిసోసియేషన్‌ అంటే ఏమిటి?
గతంలో  ‘తాను’ అన్న భావనను విస్మరించే వ్యాధులన్నింటినీ కలుపుకొని ‘హిస్టీరియా’గా వ్యవహరించారు. ఒకప్పుడు హిస్టీరియాగా పేర్కొన్న అంశాలకు శాస్త్రీయమైన కారణాలు లభ్యమయ్యాక... వాటిని డిసోసియేషన్‌/కన్వర్షన్‌ డిజార్డర్స్‌గా వ్యవహరిస్తున్నారు.  డిసోసియేషన్‌ అంటే ఏమిటో తెలుసుకునే ముందు ‘నేను’ అంటే ఏమిటో తెలుసుకోవాలి.

ఒక వ్యక్తి తన మనసులో ఏర్పడే ఆలోచనలనూ, భావోద్వేగాలనూ... అవన్నీ తనవిగా గుర్తించడాన్ని కలుపుకొని ఇంగ్లిష్‌లో ‘ఐ’ అండ్‌ ‘మైన్‌’ అంటారు. దాన్నే తెలుగులో ‘నేను’ అనీ చెప్పవచ్చు. అందరిలోనూ ఉండే ఆ ‘నేను’ అనే ఫీలింగ్‌... కొంతమందిలో ఒక్కోసారి కొంతసేపు తొలగిపోతుంది. ఆ సమయంలో నేను నేను కానేమోనన్న భావన కలుగుతుంది. అలా జరిగే మానసిక స్థితిని ‘డీ–పర్సనలైజేషన్‌’ అంటారు.

కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో... అంటే... తీవ్రమైనంతగానూ, తట్టుకోలేనంతగానూ ఏర్పడ్డ మానసిక ఒత్తిడిలో గానీ లేదా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడ్డప్పుడు గానీ కొందరు తన సొంత భావోద్వేగాల నుంచి తామే విడివడతారు. ఇలా తన సొంత ఫీలింగ్స్‌ను తనవి కావన్నంతగా విడివడిపోయే కండిషన్‌ను ‘డిసోసియేషన్‌ ఆఫ్‌ అఫెక్ట్స్‌’ అనవచ్చు. భావోద్వేగాల తీవ్రతతో మనసు ఏమాత్రం పనిచేయని పరిస్థితుల్లో ఇలా జరుగుతుంది.

అపరిచితుడు సినిమాలో హీరో రకరకాల వ్యక్తిత్వాలుగా మారిపోతుంటాడు. ఆ సినిమాలో ఆ కండిషన్‌ను ‘మల్టీపుల్‌ పర్సనలిటీ డిజార్డర్‌’  అన్నారు. ఇది కూడా డిసోసియేటివ్‌ డిజార్డరే! కాకపోతే ప్రస్తుతం దీన్ని ‘డిసోసియేటివ్‌ ఐడెంటిటీ డిజార్డర్‌’ అంటున్నారు.

చికిత్స : ఏవైనా కారణాల వల్ల డిసోసియేషన్‌ లేదా కన్వర్షన్స్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు రోగిలో తాను కోల్పోయిన లేదా ఛిద్రమైన ‘సెల్ఫ్‌’ను పునరుద్ధరించడం ద్వారా ఈ జబ్బులకు చికిత్స చేయవచ్చు. అలా వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా, ఇగో స్ట్రెంగ్త్‌ను పెంచడం ద్వారా ఈ జబ్బులను పరిష్కారించవచ్చు. ఇందుకోసం తమ సమస్యలను తామే పరిష్కరించగలిగేలా వారిలో కొన్ని నైపుణ్యాలు (స్కిల్స్‌) పెంచడం, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ను కలిగించడం ద్వారా ఈ జబ్బులకు చికిత్స చేయడం జరుగుతుంది. అవసరమైన కొన్ని  మందులు కూడా ఇస్తారు. కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ వంటివీ ఇస్తారు.


- డాక్టర్‌ శ్రీనివాస్‌ ఎస్‌ఆర్‌ఆర్‌వై , ప్రొఫెసర్‌ అండ్‌ హెచ్‌ఓడి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైకియాట్రీ, కాకతీయ మెడికల్‌ కాలేజ్, వరంగల్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా