ఖనిజ లవణ మిశ్రమం ప్రాముఖ్యత

24 Sep, 2019 11:38 IST|Sakshi

పశువు ఆరోగ్య రక్షణలో, పునరుత్పత్తిలో ఖనిజ లవణాలు ప్రముఖ పాత్రవహిస్తాయి. ఇవి జీవ రసాల(హార్మోన్స్‌) పని తీరును ప్రభావితం చేసి తద్వారా శరీరంలో జరిగే జీవ చర్యలను నియంత్రిస్తాయి. జీవరసాలు వాటి సామర్థ్యం మేరకు ప్రతిభావంతంగా పని చేయడానికి ఖనిజ లవణాలు అవసరం.

ముఖ్యమైన ఖనిజ లవణాలు: 1. కాల్షియం 2. ఫాస్ఫరస్‌ 3. సోడియం 4. పొటాషియం 5. కాపర్‌ 6. కోబాల్ట్‌ 7. మెగ్నీషియం 8. క్లోరిన్‌ 9. ఐరన్‌. ఖనిజ లవణాల లోపం ఏర్పడితే పశువు ఎదుగుదల, జీర్ణప్రక్రియ, పునరుత్పత్తి ప్రక్రియలలో సమస్యలు ఏర్పడతాయి.

ఖనిజ లవణ మిశ్రమం వాడకం వలన లాభాలు :
♦ దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
♦ పశువులలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది.
♦ పెయ్య పడ్డలు సకాలంలో తొలి ఎదను చూపుతాయి.
♦ పాడి పశువుల పునరుత్పత్తి చక్రం సక్రమంగా జరుగుతుంది.
♦ పాల దిగుబడి పెరుగుతుంది.
♦ చూడి పశువులు ఈనిన తర్వాత పశువులలో మెయ్య దిగడం (ప్రొలాప్స్‌) లాంటి సమస్యలు ఉండవు.
♦ పశువుల ఈనిన తర్వాత వచ్చే మాయ పడకపోవడం, పాల జ్వరం లాంటి సమస్యలను నివారించవచ్చు.
♦ పశువులు బట్టలు, మట్టి, కాగితాలు లాంటి పదార్థాలు తినటం, మూత్రం తాగడం వంటి దురలవాట్లకు లోనుకావు.
♦ పశువుల చర్మం నిగనిగలాడుతూ ఆరోగ్యకరంగా ఉంటుంది.

ఖనిజ లవణం ఇవ్వవలసిన మోతాదు  
1 దూడలకు.. 5–20 గ్రాములు రోజుకు ఒకసారి.
2 పెయ్యలు / పడ్డలకు.. 20–30 గ్రాములు రోజుకు ఒకసారి.
3 పాడి పశువులకు.. 50–60 గ్రాములు రోజుకు ఒకసారి.
4 ఖనిజ లవణాన్ని దాణాతో కలిపి పశువుకు అందించాలి.
గమనిక : ప్రతి ఈతకు మధ్య 14–15 నెలల వ్యవధి ఉండేలా పాడి రైతులు జాగ్రత్తపడాలి. పాడి పశువుల నుంచి, వాటి జీవితకాలంలో ఎక్కువ దూడలు, అధిక పాల ఉత్పత్తి పొందేలా శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఆర్థికంగా అభివృద్ధి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు