జయము జయము

13 Sep, 2019 00:08 IST|Sakshi

క్రీడా మంత్రిత్వ శాఖ ఈసారి ‘పద్మ’ అవార్డుల కోసం అందరూ మహిళల్నే నామినేట్‌ చేసింది! మొత్తం 9 మంది.  ‘పద్మ విభూషణ్‌’కు మేరీ కోమ్‌ (బాక్సింగ్‌), ‘పద్మ భూషణ్‌’కు పి.వి.సింధు (బ్యాడ్మింటన్‌), ‘పద్మశ్రీ’కి వినేశ్‌ ఫోగట్‌ (రెజ్లింగ్‌), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (క్రికెట్‌), రాణి రాంపాల్‌ (హాకీ), సుమ శిరూర్‌ (షూటింగ్‌), మనికా బత్రా (టేబుల్‌ టెన్నిస్‌), కవలలు తాషి, నంగ్షీ మాలిక్‌ (పర్వతారోహణ) నామినేట్‌ అయ్యారు. ‘పద్మ విభూషణ్‌’గా నామినేట్‌ అయిన మేరీ కోమ్‌.. బాక్సింగ్‌లో ఆరుసార్లు వరల్డ్‌ ఛాంపియన్‌. పద్మభూషణ్‌ (2013), పద్మ శ్రీ (2006) గ్రహీత కూడా. ఇక మిగిలింది పద్మ విభూషణ్‌! క్రీడల్లో ఒక మహిళ పద్మ విభూషణ్‌కు నామినేట్‌ అవడం ఇదే మొదటిసారి.

ఇంతవరకు విశ్వనాధన్‌ ఆనంద్‌ (2007), సచిన్‌ టెండూల్కర్‌ (2008), సర్‌ ఎడ్మండ్‌ హిల్లరీ (చనిపోయాక 2008లో) లకు మాత్రమే స్పోర్ట్స్‌ కేటగిరీలో పద్మవిభూషణ్‌ లభించింది. ఈ ఏడాది పద్మభూషణ్‌కు నామినేట్‌ అయిన పి.వి.సింధు 2017లోనూ నామినేట్‌ అయ్యారు కానీ, విజేత కాలేకపోయారు. 2015లో ఆమెకు పద్మ శ్రీ దక్కింది. ‘భారతరత్న’ మనదేశంలో అత్యున్నత పురస్కారం. తర్వాతవి.. వరుసగా ‘పద్మ విభూషణ్‌’, ‘పద్మ భూషణ్‌’, ‘పద్మ శ్రీ’. ఏటా ‘రిపబ్లిక్‌ డే’కి ఒక రోజు ముందు ఈ అవార్డులను ప్రకటిస్తారు. అంతకన్నా ముందు వివిధ రంగాల నుంచి నామినేషన్లు వెళ్తాయి. వాటిలోంచి విజేతలు ఎంపికవుతారు.

మేరీ కోమ్‌కు ఛాన్సుంది!
మేరీ కోమ్‌ (36) రాజ్యసభ సభ్యురాలు కూడా. 2016 ఏప్రిల్‌లో బీజేపీ ప్రభుత్వం ఆమెను ఎంపీగా నామినేట్‌ చేసింది. ప్రస్తుతం ఆమె.. వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కి క్వాలిఫై అయ్యేందుకు దీక్షగా సాధన చేస్తున్నారు. కోమ్‌ 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ఈ మణిపురి బాక్సర్‌కు ఉన్న ట్రాక్‌ రికార్డుని బట్టి ఆమెకు పద్మవిభూషణ్‌ రావచ్చనే క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు