భూమి పుత్రికలు

3 Jan, 2017 23:19 IST|Sakshi
భూమి పుత్రికలు

సురక్ష

పేదింటి బాలికల పేరిట బెంగాల్‌ ప్రభుత్వం భూమి పట్టాలను మంజూరు చేయడంతో వారి జీవితానికి భరోసా ఏర్పడి క్రమంగా అక్కడ మైనర్‌ బాలికల వివాహలు తగ్గుముఖం పడుతున్నాయి. పదిహేనేళ్ల వయసున్న అమ్మాయిలు ప్రతి ఐదుగురిలో ఒకరికి పెళ్లి జరుగుతోంది. కాదు కాదు... పెళ్లి బంధంలోకి నెట్టివేతకు గురవుతున్నారు. అది కూడా, వాళ్లకంటే పదేళ్లకు పైగా వయసున్నవారు తాళి కడుతున్నారు. ఇది పశ్చిమబెంగాల్‌లోని మారుమూల గ్రామాల దుఃస్థితి. చిన్న వయసులోనే పెళ్లి... కుటుంబభారం, గర్భం మోయడం, పిల్లల్ని కనడం – ఈ చట్రంలో బందీలవుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడంతో పిల్లల్ని కనలేకపోవడం, కన్నా ఆ పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం... ఇదీ పరిస్థితి. యునిసెఫ్‌ సర్వే చేసి నివేదిక ప్రకటించే వరకు అక్కడి గ్రామీణ మహిళ జీవితం ఇంతే. బాలికల విద్య, ఆరోగ్యం మీద సర్వే చేసిన యునిసెఫ్‌ పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల గ్రామాలు తీవ్రమైన దారిద్య్రాన్ని అనుభవిస్తున్నాయని, ఆ ప్రభావం బాలికలు, మహిళల మీద పడుతోందని తెలిపింది.

చదువులేకపోవడం, బాల్యవివాహాలు, పోషకాహార లోపం, లైంగిక హింస, ట్రాఫికింగ్‌ భూతాల నడుమ మహిళలు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారని నివేదిక హెచ్చరించింది. యునిసెఫ్‌ హెచ్చరికతో వెస్ట్‌ బెంగాల్‌ ప్రభుత్వం నిద్ర లేచింది. ఎందుకిలా జరుగుతోందని ఆరాలు తీసింది. ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాలి. అమ్మాయి వయసు పెరిగే కొద్దీ మగపెళ్లి వారు ఎక్కువ కట్నం డిమాండ్‌ చేస్తారు. చిన్న పిల్ల అయితే తక్కువ కట్నంతో చేసుకుంటారు, కొంతమంది కట్నం లేకుండానూ చేసుకుంటారు. అందుకే పన్నెండేళ్లు నిండితే చాలు... స్కూలుకు పోతున్న అమ్మాయిని ఇంట్లో కూలేసి, పుస్తకాలు అటకెక్కించి, పుస్తెల తాడు మెళ్లో వేస్తున్నారు. అత్తవారింటికి పంపేసి తమ బరువు తీరిందని, తల్లితండ్రులుగా తమ బాధ్యతను కచ్చితంగా నిర్వర్తించామని ఊపిరి పీల్చుకుంటున్నారు.  అయితే ఈ ధోరణి ఇలాగే కొసాగితే ఆడపిల్లకు భవిష్యత్తే ఉండదని, ఏదో ఒకటి చేయకపోతే జరిగే అనర్థానికి కొన్ని తరాలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని తలచిన బెంగాల్‌ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. ఒక చిన్న ప్రయత్నంతో... ఈ సమస్యకు పెద్ద పరిష్కారం చూపించింది. దాంతో ఇప్పుడు ఆ గ్రామాల్లో బాలికల ముఖాలు ఆనందంతో వెలుగుతున్నాయి.
నిజానికి ఈ అద్భుతం జరగడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం చాలా చిన్నదే. అయితే అది వైవిధ్యమైంది. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను వ్యవసాయం మీద ఆధారపడిన భూమిలేని పేదవారికి పంపిణీ చేయడం మామూలుగా జరిగేపని. ఇప్పుడు ఆ భూములను బాలికలకు ఇస్తున్నారు. వారి పేరుతోనే పట్టాలు జారీ చేస్తున్నారు. వ్యవసాయం, కూరగాయల పెంపకంలో వారికి శిక్షణ ఇప్పించి, మెలకువలు నేర్పే పనిని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఇప్పుడు బాలికలున్న ప్రతి ఇంటి పెరడూ కూరగాయల మొక్కలతో పచ్చగా ఉంది. ఇంటి అవసరాలకు పోను మిగిలిన వాటిని బయట విక్రయిస్తున్నారు. కొంతమంది అమ్మాయిలు ఆ డబ్బును పై చదువులకు సద్వినియోగం చేసుకుంటు న్నారు.

ఒకప్పుడు ఆ గ్రామాల్లో ఆడపిల్ల అంటే తల మీద భారం అన్నట్లు ఉండేవారు తల్లితండ్రులు. అందుకే పన్నెండేళ్లు నిండితే చాలు... పెళ్లి చేసి భారాన్ని వదిలించుకున్నట్లు భావించేవారు. ఇప్పుడా గ్రామాల్లో తల్లిదండ్రులకు ఆడపిల్ల అంటే ఖర్చు కాదు... ఆస్తి! కట్నం కోసం కష్టపడక్కర్లేదు. కట్నం డబ్బు అల్లుడి దోసిట్లో పోసి తమ బిడ్డకు వేళకింత కడుపునిండా తిండి పెట్టమని వేడుకోవాల్సి అగత్యం లేదిప్పుడు. అమ్మాయి భూమి మీద హక్కు ఎప్పటికీ ఆ అమ్మాయిదే. తాను కడుపు నిండా తినగలుగుతుంది. నలుగురికి అన్నం పెట్టగలుగుతుంది. ఆరోగ్యకరమైన బిడ్డల్ని కనగలుగుతుంది.
 

మరిన్ని వార్తలు