వైరస్‌ను జయించిన మిరప వంగడాలు

17 Mar, 2020 07:22 IST|Sakshi
క్షేత్రప్రదర్శనలో మిరప తోటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు, రైతులు

మిరప.. ఉద్యాన పంటల్లో ప్రధానమైనది. దేశవ్యాప్తంగా 8 లక్షల హెక్టార్లలో సాగవుతుంటే, ఇందులో 20–22 శాతం ఆంధ్రప్రదేశ్‌లో పండిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణంలో 40 శాతంతో గుంటూరు జిల్లా అగ్రభాగాన నిలుస్తోంది. మిరపకు వెరస్‌ల బెడద అధికమన్న సంగతి తెలిసిందే. జెమిని వైరస్‌ / బొబ్బర తెగులు అనే పేర్లతో వ్యవహరిస్తున్న వైరస్‌ కొన్నేళ్లుగా మిర్చి రైతులను బెంబేలెత్తిస్తోంది. వైరస్‌ ఆశించిన చేలో పంటపై రైతు ఆశలు వదిలేసుకోవాల్సిందే. లేదా నిత్యం పంటచేలోనే ఉంటూ రకరకాల మందుల పిచికారీతో నిరంతరం యుద్ధమే చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో ఈ వైరస్‌ను తట్టుకొనే 3 మిర్చి వంగడాలను గుంటూరులోని లాం ఉద్యాన పరిశోధన కేంద్రం రూపొందించటం విశేషం. ఈ కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌.హరిప్రసాదరావు, సీనియర్‌ శాస్తవేత్త డాక్టర్‌ సి.వెంకటరమణ సారధ్యంలో జెమిని వైరస్‌/ బొబ్బర తెగులును తట్టుకోగలిగిన మిరప రకాలు ఎల్‌సీఏ–657, ఎల్‌సీఏ–680, ఎల్‌సీఏ–684లను రూపొందించారు.
చిరుసంచుల రూపంలో రైతులకు అందజేసి 2019–20 సీజనులో సాగు చేయించారు. చేబ్రోలు మండలం శలపాడులోని దొడ్డపనేని సాంబశివరావు చేలో పండించిన ఈ మూడు రకాలపై ఇటీవల క్షేత్రప్రదర్శన నిర్వహించారు.

గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సరల్‌ చిరంజీవ్‌ చౌరది, విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ ఆర్‌వీఎస్‌కే రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.మిరప సాగులో హైబ్రిడ్‌ విత్తనాలు స్వైరవిహారం చేస్తున్న ఈ కాలంలో విడుదలైన నూతన సూటి రకం వంగడాలు రైతులకు మేలుచేస్తాయని శాస్త్రవేత్తలు, రైతులు అంటున్నారు. విత్తనాలను ప్రతి ఏటా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా.. రైతు పండించిన పంట నుంచి సేకరించిన విత్తనాలను తిరిగి వాడుకోవచ్చు. – బి.ఎల్‌.నారాయణ,సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా

ఎల్‌సీఏ–657
మొక్కలు ఎత్తుగా, దృఢమైన కాండంతో 3–4 బాగా నిటారుగా ఉండే కొమ్మలతో పెరుగుతాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుతో మందంగా అనిపిస్తాయి. కాయలు ముదురు ఆకుపచ్చ రంగుతో మంచి నిగారింపుతో ఉంటాయి. ఎండుకాయలు మంచి ప్రకాశవంతమైన ఎరుపు రంగుతో, ఎక్కువ కారంగా ఉంటాయి. జెమిని వైరస్‌/ బొబ్బర/ మిరప ఆకుముడుత వైరస్‌ను తట్టుకుంటుంది. నీటి ఎద్దడిని కూడా తట్టుకోగలదు.

ఎల్‌సీఏ–680
ఈ రకం మిర్చి మొక్కలు ఎక్కువ కొమ్మలతో గుబురుగా పెరుగుతాయి. ఆకులు ఎక్కువగా ఉండి, కాయలన్నీ ఆకులతో కప్పబడినట్టుగా ఉంటాయి. కాయలు లావుగా ఉండి ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. పచ్చి మిరప సాగుకు అనువైన రకం. ఎండుకాయ మంచి రంగుతో నిగారింపుతో, మధ్యస్థ కారంగా ఉంటుంది. జెమిని వైరస్‌/ బొబ్బర/ మిరప ఆకుముడత వైరస్‌ను తట్టుకుంటుంది.

ఎల్‌సీఏ–684
ఈ రకం మిరప మొక్కలు ఎక్కువ కొమ్మలతో ఒక మోస్తరు గుబురుగా కనిపిస్తాయి. కాయలు ఆకుపచ్చ రంగులో సన్నగా 9–10 సెం.మీ పొడవుగా ఉంటాయి. పచ్చికాయలు పక్వతకు వచ్చినపుడు మెరూన్‌ రంగులో ఉన్నా తర్వాత ఆకర్షణీయమైన ఎరుపు రంగుకు మారతాయి. ఎండుకాయలో ముడతలు స్వల్పంగా ఉండి, ఎక్కువ కారంగా ఉంటాయి. జెమిని వైరస్‌/ బొబ్బర/ ఆకుముడత వైరస్‌ను తట్టుకునే రకం.

ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి
జెమిని వైరస్‌ / బొబ్బర తెగులును నూరు శాతం తట్టుకొని, ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడిని సాధించే మిరప రకాలు రూపొందించడానికి నాలుగైదేళ్లుగా మేం చేసిన కృషి ఫలితంచింది. ఈ వంగడాలు మా పరిశోధన స్థానంలో 20–25 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేశాయి. రాబోయే సీజన్లో వీటిని సాగు చేయాలని భావించే రైతులు లాం ఫారంలో తమను సంప్రదిస్తే.. చిరుసంచుల రూపంలో రైతుకు 25 గ్రాముల విత్తనాలను ఇస్తాం.– డా. సి.వెంకట రమణ, సీనియర్‌ శాస్తవేత్త,ఉద్యాన పరిశోధన కేంద్రం,లాం ఫారం, గుంటూరు

మరిన్ని వార్తలు