గుండె కోసే మిస్‌ వరల్డ్‌

4 Dec, 2017 01:52 IST|Sakshi

బాలీవుడ్‌ జీవులు ఎప్పుడూ పెద్ద వలను పట్టుకొని ఉంటారు... ఎవరు దొరుకుతారా పట్టేద్దామా అని. మిస్‌ యూనివర్స్, మిస్‌ వరల్డ్‌ పోటీల మీద వాళ్లు రెండు, నాలుగు, లేదంటే ఎన్ని వీలైతే అన్ని కళ్లు వేసి ఉంటారు. అక్కడ ఎవరైనా మన ఇండియన్స్‌ మెరిస్తే సిల్వర్‌ స్క్రీన్‌ మీద గోల్డెన్‌ కెరీర్‌ ఆఫర్‌ చేస్తుంటారు. గతంలో ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్, ప్రియాంకా చోప్రాలను అలాగే వాళ్లు వలేసి పట్టారు. ఇప్పుడు తాజాగా మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్‌ కోసం నెట్‌ రెడీ చేస్తుంటే ఆమె మాత్రం ‘ఆ..ఆ... ఆగండాగండి’ అని చేయి అడ్డం చూపుతోంది.

అద్భుతమైన అందం మానుషి సొంతం. ఆ చిర్నవ్వుకే కొన్ని కోట్ల మంది అలా పడి ఉండే అవకాశం ఉంది. బాలీవుడ్‌లో లెగ్‌ పెడితే ఇండస్ట్రీ షేక్‌ అవడం ఖాయం. కాని ఆమె మాత్రం ‘ముందు నా మెడిసిన్‌ పూర్తి చేయనివ్వండి’ అంటోంది. మానుషి కుటుంబం ఉండటం ఢిల్లీలోనే అయినా తను మాత్రం హర్యానాలోని సోనెపట్‌లో మెడిసిన్‌ చేస్తోంది. కార్డియాలజిస్ట్‌ కావడం అనేది తన కల. అంటే ఆమెను చూసి ఎంత మంది తమ గుండెను లయ తప్పించుకుంటారో అంతమంది ఆమె చేయి తగిలి గుండెను సెట్‌రైట్‌ చేయించుకుంటారన్న మాట.

మిస్‌ వరల్డ్‌ అయితే నా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేస్తాను. డాక్టర్‌గా ఉండి నా వైద్యంతో మేలు చేస్తాను అంటోంది మానుషి చిల్లర్‌. ఈ మాటలు ఎన్నిరోజులో చూడాలి. ఏ కరణ్‌ జోహారో, ఏ రణ్‌వీర్‌ సింగో పెద్ద ఆఫర్, మంచి రోల్‌ ఆఫర్‌ చేసి ఆమెను లాగకుండా ఉంటారా అనేది మిలియన్‌ డాలర్ల క్వశ్చన్‌. ఏమో... మన సురేశ్‌బాబు భారీ అడ్వాన్స్‌ ఇచ్చి వెంకటేశ్‌ పక్కన బుక్‌ చేయవచ్చు కూడా. కత్రీనా కైఫ్‌ను బుక్‌ చేయలేదూ?

మరిన్ని వార్తలు