నిల్చుంటే బ్యాలెన్స్ తప్పుతోంది...

22 Jun, 2015 23:43 IST|Sakshi

ఇఎన్‌టి కౌన్సెలింగ్
నా వయసు 47 ఏళ్లు. నాకు అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. కొన్నిసార్లు కింద పడిపోవడం కూడా జరిగింది. నాకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. ఒక డాక్టర్‌ను సంప్రదించి, బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేయించుకున్నాను. అన్నీ నార్మల్ అని రిపోర్టులు వచ్చాయి.  ఈ సమస్యతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
- వెంకటేశ్వరరావు, కోదాడ  
 
మీరు చెప్పిన వివరాలు పరిశీలిస్తే మీరు ‘బినైన్ పొజిషనల్ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవిలోని లోపలి భాగంలో వినికిడి కోసం, బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్ నియంత్రించే వ్యవస్థలను ‘వెస్టిబ్యులర్ వ్యవస్థ’ అంటారు. ఇందులో భాగాలలో  ఓటోలిత్ అనే కణాలు, హెయిర్ సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది.

మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్ వ్యవస్థకు సంబంధించిన క్లినికల్ పరీక్షలు చేయించుకోండి. కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్‌టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్ని రకాల వెస్టిబ్యుల్‌కు సంబంధించిన ఎక్సర్‌సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంది. ఆందోళన పడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు.
 
నాకు నత్తి వస్తోంది. త్వరత్వరగా మాట్లాడినప్పుడు నత్తి ఎక్కువవుతోంది. దాంతో ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో  తెలియజేయగలరు.
- వి. రమేశ్, జనగామ
మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్ అంటారు. దీనికి గల ముఖ్య కారణాల్లో జన్యుపరమైన అంశం ప్రధానమైనది. మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోడానికి మీరు మొదట అనుభవజ్ఞులైన స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించవలసి ఉంటుంది. కొన్నిసార్లు అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. మీరు దీని గురించి మానసికంగా బాధపడితే ఈ సమస్య ఎక్కువవుతుంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషించండి. ఇలా నత్తిని అధిగమించినవారు చాలామందే ఉన్నారు. మీ అంతట మీరు సమస్యనుంచి బయటపడలేకపోతే స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల నుంచి కౌన్సెలింగ్ తీసుకుని వారు చెప్పినట్లుగా ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు.

మరిన్ని వార్తలు