తప్పులను తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటాను!

9 Jun, 2014 22:18 IST|Sakshi
తప్పులను తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటాను!

మై ఫిలాసఫీ
 
జీవితం చాలామందికి పూలబాట కాకపోవచ్చు. పూలబాట అయినవాళ్లకు...అది శాశ్వతం కాకపోవచ్చు. ఈ ఎరుక మనలో ఉంటే కష్టాల్లోనైనా, సుఖాల్లోనైనా స్థిరచిత్తంతో ఉండే గుణం అలవడుతుంది.
     
‘నా శక్తి ఇది’ అని గొప్పగా చెప్పుకునే వాళ్లకు ‘నా బలహీనత ఇది’ అని చెప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. అప్పుడే లెక్క కుదురుతుంది!
     
మిగతా విషయాలను గుర్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా... నా తప్పులను మాత్రం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను.
     
కొన్ని సమయాల్లో ‘అహం’ వాస్తవాలను చూడడానికి నిరాకరిస్తుంది. అహాన్ని పక్కన పెడితే వాస్తవం చేరువవుతుంది. అహాన్ని వదులుకోవడం అంటే ఒక మెట్టు కిందకి దిగడం కాదు... రెండు మెట్లు పైకి ఎక్కడం.
     
ఉత్తినే సలహాల కోసం సలహాలు ఇచ్చే వారి దగ్గర సలహాలు తీసుకోవడం కంటే, తీసుకోకపోవడం వల్లే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
     
పాత్రలు నచ్చకపోయినా ‘నటించాలి’ అనే నియమమేదీ పెట్టుకోలేదు. ‘ఇంటర్నేషనల్ రిలేషన్స్’లో డిగ్రీ ఉంది. సిటీబ్యాంకులో ఉద్యోగం చేసిన అనుభవం ఉంది. చెప్పొచ్చేదేమిటంటే సినిమాలు నచ్చనప్పుడు హాయిగా ఉద్యోగం చేసుకోగలను. ఈ చిన్న జీవితంలో మనం చేయడానికి ఎంతో ఉందని నమ్ముతాను.
     
కష్టాలు, నష్టాల గురించి ఆలోచించడం వృథా. ఇంత పెద్ద జీవితంలో ఆలోచించడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆలోచనా శక్తిని వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు.
     
బాగా సంపాదించాలి, బాగా కీర్తి గడించాలి... ఇలాంటి కోరికలు ఏమీ లేవు. సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతాను. ఆర్థిక స్వాతంత్య్రానికి ప్రాధాన్యత ఇస్తాను. ఎప్పుడూ ఆనందంగా ఉండాలనుకుంటాను.

 - సోహా అలీ ఖాన్, హీరోయిన్
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు