చంపావత్‌ ప్రశ్నల భవంతి

16 Jan, 2019 23:43 IST|Sakshi

ఫైనాన్స్‌ కమిషన్‌ కేటాయింపులతో కట్టిన భవనాన్ని బహిష్టు కేంద్రంగా మార్చారంటే.. ప్రభుత్వం ఏమైనా అంటుందేమోనన్న భయం కన్నా, నెలసరి వచ్చిన మహిళలు ఎవర్నైనా అంటుకుంటారేమోనన్న భయమే చంపావత్‌ జిల్లా గ్రామస్తులలో, గ్రామ పంచాయతీల్లో వ్యాపించి ఉందని అనుకోవలసి వస్తోంది!

మాధవ్‌ శింగరాజు
‘ఫైనాన్స్‌ కమిషన్‌’ అనే మాట ఎంచేతో భయంగొల్పేలా ఉంటుంది. ఇంతకన్నా పోలీస్‌ కమిషన్‌ కొంచెం స్నేహపూర్వకంగా ఉంటుందేమో. ఉంటుందేమో కానీ, భారత రాజ్యాంగంలో పోలీస్‌ కమిషన్‌ అనేది లేదు. ఉంటే అది కూడా భయమో, అభయమో గొల్పుతూ ఉండేది ఇప్పటికి.ప్రస్తుతం దేశాన్ని నడిపిస్తున్నది పద్నాల్గవ ఫైనాన్స్‌ కమిషన్‌. కమిషన్‌ ఐదేళ్ల కాలపరిమితిలో ఇంకా రెండేళ్లు మిగిలే ఉన్నాయి. 2020 వరకు. అయినప్పటికీ రెండేళ్ల క్రితమే 2017లో పదిహేనవ ఫైనాన్స్‌ కమిషన్‌ కూడా రెడీ అయిపోయింది. 2020 నుంచి 25 వరకు. ఆ కమిషన్‌కు ఛైర్మన్‌ ఎన్‌.కె.సింగ్‌. పద్నాల్గవ ఫైనాన్స్‌ కమిషన్‌ తరఫున వచ్చిన కొంతమంది అధికారులు ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌ జిల్లాలో ఫైళ్లు పట్టుకుని తిరుగుతున్నారు! మొదట వాళ్లు ఆ జిల్లాలోని ఘర్‌చమ్‌ గ్రామానికి వెళ్లారు.

వాళ్లకేదో ఇన్ఫర్మేషన్‌ అందింది.. పంచాయతీ నిధులతో అక్కడ కొత్తగా కట్టిన ఒక భవంతి లెక్కల్లో అవకతవకలు జరిగాయని. ఆ నిధులు ఫైనాన్స్‌ కమిషన్‌ కేటాయించిన నిధులే. పని సక్రమంగానే జరిగింది. అయితే ఆ భవంతిని వినియోగిస్తున్న తీరే సక్రమంగా లేదు! లేకపోవడమే కాదు, పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదిగా కూడా ఉంది. భవంతి లోపలంతా మహిళలు ఉన్నారు! వాళ్లేమీ డ్రాక్వా మహిళలు, స్వయం సహాయ బృందాల మహిళలు కాదు. రుతుక్రమంలో ఉన్న మహిళలు! కేంద్ర నిధులతో పంచాయతీ కట్టించిన భవనంలో వీళ్లు ఉండడం ఏంటి? ఇది రెండో ప్రశ్న. ఊళ్లో రుతుక్రమంలో ఉన్న మహిళలందర్నీ ఇలా ఊరికి దూరంగా ఉంచడం ఏమిటి? ఇది మూడో ప్రశ్న. మరి మొదటి ప్రశ్న ఏమిటి? రుతుక్రమంలో ఉన్న మహిళను అసలు ఇంటి బయట ఉంచడం ఏమిటి? ప్రశ్నల క్రమం ఎలా ఉన్నా మహిళల్ని ఇలా ఇంటికి  దూరంగా , ఊరికి దూరంగా, రాజ్యాంగ హక్కుకు దూరంగా ఉంచడం సక్రమం కాదు.

భవన నిర్మాణంలో నిధుల దుర్వినియోగం జరిగిందని గ్రామస్తులు కొందరు జిల్లా మేజిస్ట్రేట్‌ రణ్‌బీర్‌ చౌహాన్‌ దృష్టికి తెచ్చినప్పుడు, ఆ భవనాన్ని ‘బహిష్టు కేంద్రం’లా వినియోగిస్తున్నట్లు బయటపడింది. చౌహాన్‌ నివ్వెరపోయారు. జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఇలాంటి ‘పంచాయతీ నిధుల బహిష్టు కేంద్రాలు’ ఉన్నాయేమో చూడాలని అధికారులను ఆదేశించారు. ఉన్నదీ లేనిదీ ఒకటీ రెండు రోజుల్లో తెలుస్తుంది. అయితే ఉండేందుకే అవకాశం ఉందనిపిస్తోంది.చంపావత్‌ జిల్లా.. భారత్‌–నేపాల్‌ సరిహద్దుల్లో ఉంది. నేపాల్‌ గ్రామాల్లో ‘నెలసరి పాక’ల (పీరియడ్‌ హట్స్‌) ఆచారం ఉంది. రుతుక్రమం వచ్చిన మహిళల్ని ఆ ఐదు రోజులూ వాటిలో ఉంచుతారు. ఆ అనాగరిక ఆచారానికి సరిహద్దుకు ఇవతల ఉన్న మన గ్రామాలు కూడా ప్రభావితం అవుతున్నాయనేందుకు నిదర్శనమే ఇప్పుడు బయట పడిన ఘర్‌చమ్‌ గ్రామంలోని  బహిష్టు కేంద్రం.

ఇటీవలే నేపాల్‌లోని బజురా జిల్లాలోని ఒక గ్రామంలో అంబా బొహారా (35), పన్నెండు, తొమ్మిదేళ్ల వయసు గల ఆమె కొడుకులిద్దరు నిద్రిస్తున్నప్పుడు నెలసరి పాకకు నిప్పంటుకుని ఊపిరి ఆడక ఆ ముగ్గురూ చనిపోయినట్లు వార్తలు వ చ్చాయి. గత నవంబర్‌లో వచ్చిన గజ తుఫాన్‌లో తమిళనాడులో విజయలక్ష్మి అనే పన్నెండేళ్ల బాలిక నెలసరి పాకలో ఉన్నప్పుడు ఈదురుగాలులకు కొబ్బరి చెట్టు కూలిపడి చనిపోయింది. ఆమె తల్లి గాయపడింది. ఇంకా ఇలాంటి వార్తలు మిగతా రాష్ట్రాల నుంచీ తరచూ వినిపిస్తూనే ఉన్నాయి కనుక ఆడపిల్లల విషయంలో నేపాలైనా, భారత్‌ అయినా, ఇంకో దేశమైనా ఒకటే అనుకోవాలి. ఇంకొకటి కూడా అనుకోవాలి. ఫైనాన్స్‌ కమిషన్‌ కేటాయింపులతో కట్టిన భవనాన్ని బహిష్టు కేంద్రంగా మార్చారంటే.. ప్రభుత్వం ఏమైనా అంటుందేమోనన్న భయం కన్నా, నెలసరి వచ్చిన మహిళలు ఎవర్నైనా అంటుకుంటారేమోనన్న భయమే గ్రామస్తులలో, గ్రామ పంచాయతీల్లో వ్యాపించి ఉందని అనుకోవాలి.

చంపావత్‌ జిల్లా మేజిస్ట్రేట్‌కు ఈ సంగతి తెలిసినప్పుడు మొదట ఆయన అన్నమాట.. ‘ఇదేంటీ!’ అని. రెండో మాట.. ‘అలా ఉంచేశారా, ప్యాడ్స్‌ ఏమైనా ఇచ్చారా?’ అని. మంచి మాట. అరవై ఏడేళ్లుగా ఫైనాన్స్‌ కమిషన్‌ దేశాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డబ్బు లెక్కలు చూస్తోంది. మహిళా సంక్షేమం అన్నది కమిషన్‌ పరిధిలోకి రాని విషయమే అయినా, అభివృద్ధిలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించిన విధంగానే, స్త్రీల జీవితాలను దుర్భరం చేసే దురాచారాలను పాటిస్తున్న గ్రామాలకు నిధులను తగ్గిస్తాం అన్న భయం పెట్టొచ్చు. డబ్బు ఇచ్చే కాదు, డబ్బును ఇవ్వకుండా కూడా అభివృద్ధిని సాధించవచ్చు.. స్త్రీ సంక్షేమం కూడా దేశాభివృద్ధిలో ఒక భాగం అనుకుంటే.   

      

  

మరిన్ని వార్తలు