పురుగుల భరతం పట్టే ద్విపత్ర ద్రావణం!

19 Mar, 2015 00:21 IST|Sakshi
పురుగుల భరతం పట్టే ద్విపత్ర ద్రావణం!

- అడవి జెముడు కొమ్మలు, సునాముఖి ఆకులతో
- ద్రావణం.. 10 రోజుల్లో సిద్ధం
- పంటలపై పిచికారీతో రసం పీల్చే పురుగుల పీడ విరగడ

స్థానికంగా అందుబాటులో ఉండే వనరులతోనే రైతులు స్వయంగా ఎరువులు, కషాయాలను, ద్రావణాలను తయారు చేసుకోవడం సేంద్రియ సేద్యంలో ముఖ్యాంశం. సేంద్రియ సేద్యంలో ఎదురయ్యే సవాళ్లను

అధిగమించడానికి రైతులు నిరంతరం కొత్తదారుల కోసం అన్వేషిస్తూ ఉంటారు. తమ పరిసరాల్లోని చెట్టూ చేమను సేద్య అవసరాల కోసం మరింత సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తూ.. ప్రయోగాలు చేసే సేంద్రియ రైతు నిత్యాన్వేషి కొమ్మూరి విజయకుమార్.

రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా పారదోలే సరికొత్త ద్విపత్ర ద్రావణాన్ని తమ పంటలపై వాడుతూ, తోటి రైతులకూ నేర్పిస్తున్నారు. ఆకులు, అలములను నీటిలో మరిగించి తయారు చేసే కషాయాల కన్నా.. పులియబెట్టి తయారు చేసే ద్రావణాలు చీడపీడలపై ప్రభావశీలంగా పనిచేస్తున్నాయని ఆయన స్వానుభవంతో అంటుంటారు.
 
వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి వెలంవారిపల్లెకు చెందిన విజయకుమార్(98496 48498) తమ ప్రాంతంలో విరివిగా లభించే అడవి జెముడు, సునాముఖి మొక్కలతో తయారు చేసిన ద్రావణ ం వివిధ పంటలపై రసం పీల్చే పురుగులను చక్కగా అరికడుతున్నదంటున్నారు. విజయకుమార్ ఏమంటున్నారంటే...
 
ఎలా తయారు చేస్తారు?

పొలాలు, గుట్టలు, కొండల్లో ముళ్లతో ఉండే అడవి జెముడు మొక్కలు విరివిగా కన్పిస్తుంటాయి. వీటిని మేకలు తింటాయి. ఆ మొక్కల కొమ్మలు కిలో తీసుకోవాలి. సునాముఖి పచ్చి ఆకును కిలో తీసుకోవాలి. వీటిని ముందుగా విడివిడిగా బాగా దంచి, వాటితోపాటు 4 లీటర్ల ఆవు మూత్రాన్ని డ్రమ్ము/తొట్టిలో వేసి బాగా కలియదిప్పాలి. ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచి, అడపా దడపా కలుపుతూ పులియబెట్టాలి. 10 రోజుల పాటు పులిసిన ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. లీటరు ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి.
 
అన్ని పంటలకూ ఉపయోగమే..
పెసర, మినుము, కంది, వేరుశనగ... ఇలా దాదాపు అన్ని పంటల పైన ఈ ద్రావణాన్ని వినియోగించవచ్చు. పురుగు ఉధృతిని బట్టి పంటకాలంలో మూడుసార్లు ఈ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వేసవి కాలంలో... పంట 20 రోజుల దశలో ఉన్నప్పుడు మొదటిసారి 100 లీటర్ల నీటిలో లీటరు ద్రావణాన్ని కలిపి వాడాలి. రెండోసారి 80 లీటర్ల నీటిలో లీటరు ద్రావణాన్ని, మూడోసారి 60 లీటర్ల నీటిలో లీటరు ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి. చలికాలంలో అయితే.. పంట 15 రోజుల దశలో ఉన్నప్పుడే మొదటిసారి ద్రావణాన్ని వినియోగించాలి. భూమి, మొక్కలు బాగా తడిసేలా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఒకసారి ద్విపత్ర ద్రావణాన్ని తయారు చేసుకుంటే దాన్ని సంవత్సర కాలం వరకూ నిల్వ చేసుకోవచ్చు.
 
రెక్కల పురుగులు.. తెల్లదోమ..
ద్విపత్ర ద్రావణం రెక్కల పురుగుల గుడ్లను సమర్థవంతంగా నాశనం చేస్తుంది. అలాగే తెల్లదోమను కూడా నివారిస్తుంది. తెల్లదోమ నివారణకు ద్రావణాన్ని పిచికారీ చేసే వారు దానిలో కొంచెం సర్ఫ్ పొడిని కానీ లేదా కుంకుడుకాయ రసాన్ని కానీ కలుపుకుంటే మంచిది.
 
ఈ ద్రావణం బాగా పనిచేస్తోంది..
సునాముఖి, అడవి జెముడుతో తయారు చేసిన ద్విపత్ర ద్రావణం పంటలపై బాగా పని చేస్తోందని వేంపల్లె మండలం బుగ్గకొట్టాలకు చెందిన రైతు వెంకట్రాముడు చెప్పారు. సంజీవని ఎరువు, ద్రావణాల వాడకం వల్ల ఖర్చు తగ్గిందని వేంపల్లె మండలం టి.వెలంవారి    పల్లెకు చెందిన రైతు పక్కీరప్ప తెలిపారు.
- మాచుపల్లి ప్రభాకర్‌రెడ్డి, కడప అగ్రికల్చర్

>
మరిన్ని వార్తలు