ఆశాజనకంగా వరి – చేపల మిశ్రమ సాగు!

19 May, 2020 06:48 IST|Sakshi

వరి సాగు చేసే ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు, అభ్యుదయ రైతులతో వరి తోపాటు చేపలను కలిపి సాగు చేయిస్తే వారికి ఆదాయం పెరగడంతోపాటు భూతాపోన్నతి తగ్గి పర్యావరణానికీ మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వరి బియ్యంతోపాటు చేపలు కూడా అందుబాటులోకి రావడం వల్ల పేద రైతు కుటుంబాలకు పౌష్టికాహారం అందుతుంది. నీటిని నిల్వగట్టే వరి చేలల్లో చేపలు, పీతలు, రొయ్యలతోపాటు బాతులను సైతం పెంచుతూ సమీకృత వ్యవసాయం చేయింవచ్చు.

నీటిని నిల్వ గట్టే పద్ధతిలో వరి సాగు చేయటం వల్ల భూగోళాన్ని వేడెక్కించే మిథేన్‌ వాయువు వెలువడుతోంది. వాతావరణంలోకి చేరుతున్న మిథేన్‌లో 10–20 శాతం వరి పొలాల వల్లనే. కార్బన్‌ డయాక్సయిడ్‌ కన్నా మిథేన్‌ 25 రెట్లు ఎక్కువగా భూతాపోన్నతికి కారణభూతమవుతోంది. వట్టిగా వరి సాగు చేసినప్పటి కన్నా.. వరి–చేపల సాగులో 34.6 శాతం  మిథేన్‌ వాయువు వెలువడినట్లు ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గింది. ఆ మేరకు ఉత్పాదకాలపై ఖర్చూ తగ్గింది. భూసారం పెరుగుతుంది.

వరి–చేపల మిశ్రమ సాగు వల్ల ధాన్యం దిగుబడి10–26% పెరిగింది. కూలీల అవసరం 19–22 శాతం మేరకు తగ్గింది. ఇతర ఉత్పాదకాలు 7% మేరకు తగ్గాయి. చేపల పెంపకం వల్ల ఆదాయమూ పెరిగింది. ఇండోనేషియాలో వరి–చేపల మిశ్రమ సాగు చేసిన రైతుల నికరాదాయం 27 శాతం పెరిగింది.

వరి–చేపల మిశ్రమ సాగుకు వరి పొలాలన్నీ పనికిరావు. మన దేశంలో వరి సాగవుతున్న 4.35 కోట్ల హెక్టార్లలో లోతట్టు, మధ్యస్థ వర్షాధార సాగు భూములతో కూడిన 2 కోట్ల హెక్టార్లు (ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో) ఈ సాగుకు అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ మిశ్రమ సాగు కొత్తదేమీ కాదు. అక్కడా ఇక్కడా పూర్వకాలం నుంచీ 2.3 లక్షల హెక్టార్లలో రైతులు అనుసరిస్తున్నదే.

అధిక దిగుబడి వరి వంగడాలకు రసాయనిక పురుగుమందులు విధిగా వాడాల్సి ఉండటం వల్లనే రైతులు వరి–చేపల మిశ్రమ సాగును ఎక్కువగా చేపట్టలేకపోతున్నారు. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో దేశీ వరి రకాలను వాడే రైతులకు, కూలీలపై ఆధారపడకుండా చిన్న కమతాల్లో వ్యవసాయ పనులన్నిటినీ ఇంటిల్లపాదీ కలిసి చేసుకునే సంస్కృతి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు వరి–చేపల మిశ్రమ సాగు మరింత ఉపయుక్తంగా ఉంటుంది.  

అయితే, వరి–చేపల మిశ్రమ సాగు నిర్లక్ష్యానికి గురైంది. దీనిపై పరిశోధకులు దృష్టి పెట్టడం లేదు. వరి దిగుబడి కూడా పెంచుకోవడానికి వీలున్న ఈ దివ్యమైన సాగు పద్ధతిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఏయే నేలలకు ఏయే రకాల చేపలను వరితో కలిపి సాగు చేయింవచ్చో స్థానికంగా పరిశోధనలు చేయించాలి. ఈ పద్ధతిలోకి మారాలంటే రైతులు తమ పొలాలను అందుకు తగినట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు ఇంజినీరింగ్‌ నిపుణుల సహాయంతోపాటు పెట్టుబడి కూడా అవసరమవుతుంది. ప్రభుత్వం ప్రత్యేక రుణ పథకాలను ప్రవేశపెట్టి వరి–చేపల సాగుకు చేదోడుగా ఉంటే చిన్న రైతులకు ఆదాయం పెరిగే వీలుందన్నది నిపుణుల మాట.

మరిన్ని వార్తలు