మోదీ మెచ్చిన టీచర్

17 Nov, 2015 00:15 IST|Sakshi
మోదీ మెచ్చిన టీచర్

స్ఫూర్తి
 
మొన్న శుక్రవారం అర్ధరాత్రి... రాజస్థాన్‌లోని ఆల్వార్‌లోని లక్ష్మీ నగర్‌లో ఇమ్రాన్ ఖాన్ ఇల్లు... గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్ లెక్కల టీచర్  37 ఏళ్ళ ఇమ్రాన్ మంచి నిద్రలో ఉన్నారు. ఆగకుండా మోగుతున్న మొబైల్ ఫోన్ శబ్దానికి ఇమ్రాన్ కుటుంబం చటుక్కున మేల్కొంది.  
 
ఫోన్ చేసిన చిరకాల మిత్రుడు చెప్పిన మాటతో అంత రాత్రి వేళ కూడా ఇమ్రాన్ నిద్రమత్తు ఎగిరిపోయింది. విషయమేమిటంటే, బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీ లండన్‌లోని  వెంబ్లే స్టేడియమ్‌లో భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, తన మాటల్లో ఇమ్రాన్ ఖాన్ పేరు ప్రస్తావించారు. ఇంట్లో టీవీ కూడా లేని ఇమ్రాన్ ఆ సంగతి తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని యూ ట్యూబ్‌లో చూసేలోపల వరుస అభినందనలతో ఇమ్రాన్ ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. మిత్రులు, శ్రేయోభిలాషులు ఇంటికొచ్చి మరీ ఆ సామాన్య స్కూల్ టీచర్‌ను అభినందించారు.

ఒక చిన్న గ్రామంలో పనిచేస్తున్న ఆయన ఆ రాత్రికి రాత్రి దేశమంతటా చెప్పుకొనే వ్యక్తి అయ్యారు. శనివారం తెల్లవారేసరికల్లా ఆ ఊరు, ఆయన పేరు ప్రముఖ వార్తలయ్యాయి. అచ్చంగా ఆ మధ్య వచ్చిన ‘పీప్లీ లైవ్’ సినిమాలో లాంటి సన్నివేశం ఎదురైంది. పొద్దుపొడిచేసరికి ప్రత్యక్ష ప్రసారం కోసం మూడు ప్రముఖ వార్తా టీవీ చానళ్ళ ఓ.బి. వ్యాన్లు ఇమ్రాన్ ఇంటి ముందు ఉన్నాయి. కాసేపటి కల్లా కేంద్ర సమాచార - సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ పైన ఆల్వార్‌లోని బి.ఎస్.ఎన్.ఎల్. హెడ్ వచ్చి, ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఇచ్చి మరీ వెళ్ళారు.

ఇంతకీ అంతగా ఫేమస్ అయ్యే పని ఇమ్రాన్ ఏం చేశారు? ప్రధాని సైతం మెచ్చుకొనేంత విశేషం ఏమిటి?  కంప్యూటర్ సైన్స్ చదవకుండానే... 52 యాప్స్  ‘‘గణితం బోధించడమంటే ఇష్టమున్న ఓ మామూలు టీచర్‌ని’’ అని వినమ్రంగా చెప్పుకొనే ఇమ్రాన్ ఖాన్ చేసింది చిన్నపనేమీ కాదు. కంప్యూటర్ సైన్స్‌లో ఓనమాలైనా చదువుకోని ఆయన 2012 నుంచి రకరకాల మొబైల్ అప్లికేషన్లు రూపకల్పన చేశారు. కేవలం మూడేళ్ళలో అలాంటివి 52 రూపొందించారు! చదువుకు సంబంధించిన ఈ మొబైల్ అప్లికేషన్స్ అన్నిటినీ విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉంచారు.

ఇమ్రాన్ కృషి చాలా చిత్రంగా మొదలైంది. కంప్యూటర్ టెక్నాలజీ చదువుకోలేదన్న మాటే కానీ, కంప్యూటర్ సైన్స్‌లో బి.టెక్ చేసిన తన సోదరుడు ఇంట్లో వదిలివెళ్ళిన కంప్యూటర్‌ను మాత్రం వదిలేవారు కాదు. దాని ముందే ఎక్కువ సేపు గడుపుతుండేవారు. అలాగే, సోదరుడి ఐ.టి. బుక్స్ తాను చదువుతుండేవారు. హెచ్.టి.ఎం.ఎల్. కూడా అక్కడ నుంచే నేర్చుకున్నారు. దానికి తోడు ‘గూగుల్’ గురువు అయ్యింది. అలా ఆయన వెబ్‌సైట్ రూపకల్పన మొదలుపెట్టారు. అనేక రకాల వెబ్‌సైట్లకు ఊపిరి పోశారు. ఇది ఇలా ఉండగా, ఒకసారి అప్పటి జిల్లా కలెక్టర్‌ను ఇమ్రాన్ కలిశారు. ఇమ్రాన్‌లోని ఆసక్తిని గమనించడమే కాక, ఆయన తయారుచేసిన వెబ్‌సైట్ చూసిన కలెక్టర్ ఒక సలహా చెప్పారు. ‘రాబోయే రోజులన్నీ మొబైల్ యాప్స్‌వే. వాటిని డెవలప్ చేస్తే బాగుంటుంది’ అన్నారు. ఆ మాట ఇమ్రాన్‌కు మార్గదర్శకమైంది. అప్పటికి యాప్ అనే మాట కూడా ఇమ్రాన్‌కు తెలియదు. కలెక్టరే తన దగ్గరున్న ట్యాబ్లెట్‌లో కొన్ని యాప్స్ చూపెట్టారు.

అంతే... యాప్స్, వాటి రూపకల్పన గురించి సమాచారం ఉన్న పుస్తకాల్ని ఇమ్రాన్ చదవడం మొదలెట్టారు. ఆ చదివినదాన్ని ఆచరణలో పెట్టారు. సొంతంగా యాప్స్ డెవలప్ చేశారు. నైన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కు ‘లెర్న్ సైన్స్’ యాప్‌ను మొట్టమొదటగా రూపొందించారు. 2012లో మొదలైన ఆ ప్రయాణంలో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీషు - ఇలా చదువుకు సంబంధించే 52 యాప్స్ చేశారు.

అన్నీ యాండ్రాయిడ్ యాప్సే!
 ఉచితంగా 30 లక్షల మంది డౌన్‌లోడ్!

 జనరల్ సైన్స్ లాంటి సబ్జెక్ట్‌లను హిందీలో సులభంగా బోధించేలా ఆయన చేసిన పూర్తి విభిన్న తరహా యాప్స్ అందులో ఉన్నాయి. విశేషం ఏమిటంటే, వాటన్నిటినీ స్టూడెంట్స్‌కు ఆయన ఉచితంగా అందుబాటులో ఉంచారు. ఆ యాప్స్‌ను ఇప్పటికి 30 లక్షల మందికి పైగా యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారట! ఆ మాట చెబుతున్నప్పుడు ఇమ్రాన్ గొంతులో ఒక చిన్న తృప్తి ధ్వనిస్తుంది. ఇప్పటి వరకు ఆయన ఏకంగా వందకు పైగా వెబ్‌సైట్లు సృష్టించారు. వాటిలో ఆయన నడుపుతున్న ‘జికె టాక్స్ డాట్‌కామ్’ లాంటి ఒకటి రెండు సైట్లు చాలా పాపులర్.

గత ఏడాది సెప్టెంబర్‌లో మానవ వనరుల మంత్రిత్వశాఖ పెట్టిన జాతీయ సెమినార్‌లో పాల్గొని, ట్రైనీ ఐ.ఏ.ఎస్.లకు ‘విద్యారంగంలో ఐ.టి’ అనే అంశంపై పాఠాలు చెప్పారు. మొత్తానికి, ప్రధానమంత్రి ఉపన్యాసం పుణ్యమా అని ఇప్పుడు ఇమ్రాన్ పేరు మారుమోగిపోతోంది. తినడానికైనా తీరిక లేనంతగా వచ్చే పోయే జనం, మీడియా ఇంటర్వ్యూలు, అభినందనలు. ‘‘ఇదంతా ఓ కలలా ఉంది. ప్రధానమంత్రి నా పేరు ప్రస్తావించడం ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. చెప్పింది నా గురించే అని నిర్ధారించుకోవడానికి ఒకటికి రెండుసార్లు యూ ట్యూబ్ చూశా’’ అని ఇమ్రాన్ నవ్వుతూ చెప్పారు.

‘‘ఆల్వార్‌లోని ఇమ్రాన్ లాంటి వాళ్ళలో అసలు సిసలు భారతదేశం ఉంది’’ అంటూ ప్రధాని అన్న మాటలు ఇప్పుడు ఇమ్రాన్ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఒక చిన్న ప్రయత్నానికి ఇంత పెద్ద గుర్తింపు రావడం మరపురాని అనుభూతి అని ఈ సామాన్య లెక్కల టీచర్ అన్నారు. అవును! గుర్తింపు లభిస్తే కలిగే ఆనందం మరెన్నో గొప్ప ప్రయత్నాలకు కొత్త ఊపిరి. ఆ ఊపిరి అందించాల్సిందీ, ఇలాంటి మరెందరో ఇమ్రాన్ ఖాన్‌లను గుర్తించి గౌరవించాల్సిందీ మనమే!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా