ఇస్లాం నూతన సంవత్సరం మొహర్రమ్‌

16 Sep, 2018 01:54 IST|Sakshi

21న మొహర్రమ్‌

‘మొహర్రమ్‌ ’ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినటువంటి మాసం. ఇస్లామ్‌ ధర్మంలో దీనికొక ప్రత్యేకత ఉంది. ఇస్లామీ క్యాలండరు ప్రకారం ఇది ముస్లిమ్‌ జగత్తుకు నూతన సంవత్సరం. ముహర్రం మాసంతోనే ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. పూర్వచరిత్రలో కూడా దీనికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉండింది. ఇస్లామ్‌కు పూర్వం అప్పటి సమాజంలో కూడా ‘ముహర్రం’ నుండే కొత్తసంవత్సరం ప్రారంభమయ్యేది. ముహమ్మద్‌ ప్రవక్త(స) ముహర్రం మాసాన్ని అల్లాహ్‌ నెల అని అభివర్ణించారు. రమజాన్‌ రోజాల తరువాత అత్యంత శుభప్రదమైన రోజా ఆషూరా రోజానే. అంటే ముహర్రం పదవ తేదీన పాటించబడే రోజా అన్నమాట. రమజాన్‌ రోజాలు విధిగా (ఫర్జ్‌ గా) నిర్ణయించబడక పూర్వం ఆషూరా రోజాయే ఫర్జ్‌ రోజాగా ఉండేది. కాని రమజాన్‌ రోజాలు విధిగా నిర్ణయించబడిన తరువాత ఆషూరా రోజా నఫిల్‌గా మారిపోయింది.

హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) ప్రకారం, ఒకసారి ప్రవక్త మహనీయులు మదీనాకు వెళ్ళారు. ఆరోజు అక్కడి యూదులు రోజా పాటిస్తున్నారు. అది ముహర్రం పదవ తేదీ. వారిని ప్రవక్త అడిగారు ఏమిటి ఈరోజు విశేషం? అని. దానికి వారు, ‘ఇదిచాలా గొప్పరోజు.ఈరోజే అల్లాహ్‌ మూసాను, ఆయన జాతిని ఫిరౌన్‌ బారినుండి రక్షించాడు. ఫిరౌన్‌ను, అతడి సైన్యాన్ని సముద్రంలో ముంచేశాడు. అప్పుడు మూసా ప్రవక్త, దేవునికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక మేము కూడా ఆయన అనుసరణలో ఈ రోజు రోజా పాటిస్తాము’. అని చెప్పారు. అప్పుడు ప్రవక్తమహనీయులు, ‘మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులం’ అని చెప్పి, తమ అనుచరులకు రోజా పాటించమని ఉపదేశించారు. ఆషూరా రోజా కేవలం యూదులే కాదు క్రైస్తవులు కూడా పాటించేవారు. ఈ ఇరువర్గాలూ ముహర్రం పదవ తేదీన మాత్రమే రోజా పాటించేవి. కాని ప్రవక్తవారు, మీరు రెండురోజులు పాటించమని తన సహచరులకు బోధించారు.అంటే ముహర్రం మాసం 9,10 లేదా 10,11 కాని రెండురోజులు రోజా పాటించాలి.
 

షహీదులు దైవానికి సన్నిహితులు
కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. అంతమాత్రాన ముహర్రం మాసమంతా విషాద దినాలుగా పరిగణించడం, ఎలాంటి శుభకార్యాలూ నిర్వహించక పోవడం సరికాదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మంకోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్‌ ఇమామె హుసైన్‌ (ర)అమరగతి పొందారు. ధర్మయుద్ధంలో అమరుడు కావడం మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమోగాని, విషాదం ఎంతమాత్రం కాదు. ఎందుకంటే, ‘ఎవరైతే అల్లాహ్‌ మార్గంలో అమరులయ్యారో వారిని మృతులు అనకండి. వారు సజీవంగా ఉన్నారు. తమ ప్రభువు వద్ద ఆహారం కూడా పొందుతున్నారు.’ అంటోంది పవిత్రఖురాన్‌ . (3–169) దీనివల్ల మనకు అర్ధమయ్యేదేమిటంటే, అమరులు అల్లాహ్‌కు సన్నిహితులేకాదు, ఆయన ద్వారా ఆహారం కూడా పొందుతున్నారు. కనుక వారుసజీవంగా ఉన్నారని నమ్మవలసి ఉంటుంది.

అయితే, అమరులు సజీవంగా ఉండడం, ఆహారం పొందడం ఏమిటి? అన్నసందేహం కూడా ఇక్కడ తలెత్తే అవకాశం ఉంది. హజ్రత్‌ మస్రూఖ్‌ (ర) ఇలా అంటున్నారు. ‘మేము ఈ ఆయతుకు సంబంధించిన వివరణ హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌ ఊద్‌ (ర)గారిని అడిగాము. అప్పుడాయన, ‘మేము కూడా ఇదే విషయం దైవప్రవక్త ముహమ్మద్‌ (స)గారికి విన్నవించుకున్నాము. దానికి ఆయన ఇలా వివరణ ఇచ్చారు. ‘షహీదులు సజీవంగా ఉండడం, వారు ఆహారం పొందడం అంటే అర్ధమేమిటంటే, వారి ఆత్మలు పచ్చని పక్షుల రూపంలో ఉంటాయి. వాటికోసం అందమైన గోపురాలు దైవసింహాసనానికి వేలాడుతూ ఉంటాయి. ఆ పక్షులు స్వేచ్ఛగా, సంతోషంగా స్వర్గంలో, స్వర్గవనాల్లో విహరిస్తూ ఉంటాయి. మళ్ళీ తమ గోపురాలకు చేరుకుంటాయి.

ఇదీ షహీదుల స్థాయి, వారి గౌరవం. వారి ఘనత. కనుక హజ్రత్‌ ఇమామె హుసైన్‌ (ర)అమరత్వం మరణం కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపపనార్ధం, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో పొందిన వీరమరణం. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడయ్యారో మనం దాన్నుండి స్ఫూర్తిని పొందాలి. సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు సమాజ శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయ ప్రేమికులు, పౌరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయంకోసం, ధర్మంకోసం, మానవీయ విలువలకోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పరిధిలో శక్తివంచన లేకుండా పోరాడాలి. దానికి ఇమామ్‌ స్ఫూర్తి ప్రేరణ కావాలి.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు