కొవ్వొత్తి చుట్టూ తిరిగే చిమ్మట జీవితాలు

16 Apr, 2018 01:06 IST|Sakshi

పాకిస్తానీ రచయిత మొహ్సీన్‌ హమీద్‌ తొలి నవల అయిన, ‘మోథ్‌ స్మోక్‌’ 1998లో లాహోర్లో మండుతున్న వేసవిలో, ఒకానొకప్పుడు జూనియర్‌ బ్యాంకర్‌ అయిన దారాషికో (దారూ) తను చేయని హత్యకి, జైల్లో కూర్చునుండగా ప్రారంభం అవుతుంది.

పేదింటి దారూ ధనిక కుటుంబానికి చెందిన ఔరంగజేబ్‌ (ఓజీ)షాకి స్నేహితుడు. దారూ బాల్యం కాలేజీలో చేరేంతవరకూ సామాన్యంగానే గడుస్తుంది. తరువాత అతని స్నేహితులు ఉన్నత విద్యకోసం అమెరికాకు వెళ్ళిపోతారు. ఓజీ తిరిగి అమెరికా నుండి వెనక్కి రావడంతో దారూ అభద్రతాభావం ఎక్కువవుతుంది. తనకి లేకపోయిన ప్రతీదీ ఓజీ వద్ద ఉంటుంది. పెజొరో కారు, మంచి ఉద్యోగం, అందమైన భార్య ముంతాజ్, కొడుకు. వాళ్ళవల్ల దారూ తిరిగి ఆ ధనిక వృత్తంలోకి అడుగుపెట్టి , బ్లాక్‌ లేబెల్‌ విస్కీలు తాగే పార్టీకి వెళ్ళిన మర్నాడే అతని ఉద్యోగం పోతుంది. అదే దారూ అంతానికి ప్రారంభం. ముంతాజ్‌ పట్ల అతనికున్న కాంక్షా, అతని హెరాయిన్‌ సేవనం హెచ్చవుతుండగా, అతని సామాజిక, ఆర్థిక హోదా దిగజారుతుంటాయి.

‘నేను ఆమె పట్ల ఆకర్షితుడైనట్టే ఆమె కూడా అయింది. ముంతాజ్‌ అనే కొవ్వొత్తి చుట్టూ తిరిగే చిమ్మటని నేను. ఆమె కూడా కొవ్వొత్తి అయిన నా చుట్టూ తిరిగే చిమ్మటే’ అంటాడు దారూ. నవల శీర్షిక– దారూ, ముంతాజ్‌ మధ్యన పెంపొందిన ప్రేమకి రూపకం. కొవ్వొత్తి చుట్టూ ప్రాణాంతకమైన మోహంతో తిరిగి, పొగగా మారి స్వీయ నాశనాన్ని ఎదురుకునే చిమ్మటని ఉటంకిస్తుంది. నవల్లో అధికభాగం దారూ దృష్టికోణంతోనే ఉన్నదైనప్పటికీ, అతనికి డ్రగ్స్‌ సరఫరా చేసే రిక్షా అతనితో సహా నవల్లో ఉన్న పాత్రలందరి ఆలోచనా ధోరణులూ పాఠకులకు పరిచయం చేయబడతాయి. తను ఎందుకు ‘మంచి/చెడ్డ వ్యక్తో’ అని ప్రతీ పాత్రా వివరిస్తుంది. లంచగొండి అవడం ఎంత అవసరమో అని ఓజీ, భర్త ఆప్త మిత్రుడితో ఎందుకు సంబంధం పెట్టుకోవలిసి వచ్చిందో అని ముంతాజ్, తను డ్రగ్స్‌  తీసుకోవడమేకాక అమ్మే దశకి కూడా ఎందుకు చేరుకున్నానో అని దారూ చెప్తారు. జీవితం గిరగిరా తిరుగుతూ చేతుల్లోంచి ఎలా జారిపోగలదో అర్థం అవుతుంది పాఠకులకి.

తన్ని తాను లోకువ చేసుకుంటూ వినిపించే దారూ స్వగతాలకి అదనంగా, ఇతర గొంతులూ వినిపిస్తాయి. ‘డ్రమెటిక్‌ మొనొలోగ్‌’ అన్న ప్రక్రియని నవల్లో విరివిగా ఉపయోగించారు రచయిత. 
నవల పాకిస్తాన్‌ ధనిక వర్గపు దురాశా, అభద్రతనీ కనపరిచి– ధనిక వర్గానికీ, పేదవారికీ ఉన్న వ్యత్యాసాన్ని కూడా విశదపరుస్తుంది. పాత్రలని సాంప్రదాయికమైన నైతిక చట్రంలో చూపకుండా– వైరుధ్యం, వంచనతో నింపారు హమీద్‌. అమెరికన్‌ పదజాలాన్ని భారీగా ఉపయోగించారు. నవల్లో సమకాలీన పాకిస్తాన్‌ కనిపించినప్పుడు, ఇది నిజంగా ప్రపంచానికి తెలిసిన దేశమేనా! అన్న అనుమానం కలుగుతుంది. పుస్తకంలో ఉన్న ఏ పాత్రా అనవసరమయినది అనిపించదు. పాకిస్తానుకీ, ఇండియాకీ మధ్యనున్న పరమాణు సంబంధమైన పోటీ అన్న ప్రస్తావన పలుమార్లు కనిపిస్తుంది. నవల– మానవ ఘర్షణలు, ప్రేమ, ద్రోహం, ఓటమి, అసమానతల గురించినది. కథనంలో చమత్కారం, నిష్కల్మషతా కనబడతాయి.

పుస్తకం బెట్టీ ట్రాస్క్‌ అవార్డు గెలుచుకుని, పెన్‌/హెమింగ్వే అవార్డుకి ఫైనలిస్టుగా ఎంచుకోబడింది. దీని ఆధారంగా, అజ్ఫర్‌ అలీ దర్శకత్వంతో తీసిన పాకిస్తానీ ఫిల్మ్‌ ‘దాయిరా’(వృత్తం) వచ్చింది. రాహుల్‌ బోస్‌తో తీయాలనుకున్న హిందీ సినిమా ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది. 

యు. కృష్ణ వేణి   

మరిన్ని వార్తలు