అమ్మానాన్నకు చెబితేనే పరిష్కారం దొరుకుతుంది

31 Oct, 2018 00:20 IST|Sakshi

ఏ విషయమైనా!

మీటూతో ప్రపంచం ప్రకంపిస్తోంది ఇప్పుడు. విద్యావంతులు, ఉన్నతాధికారులు, రాజకీయనాయకులు, సినిమా రంగంలో ప్రముఖులు.. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా మగవాళ్లందరినీ బిక్కుబిక్కుమని భయపెడుతున్న ఉద్యమం ఇది. అంత పెద్దవాళ్లే నిలువు గుడ్లేసుకుని ఎప్పుడు ఎక్కడ మాట్లాడిన ఏ మాట ఎలా బాణంలా వచ్చి దిగుతుందో తెలియక సతమతమవుతుంటే పుణెలోని ఓ స్కూలు ప్యూన్‌ ఇవేవీ పట్టకుండా తన పైత్యాన్ని బయటపెట్టుకున్నాడు. ఉద్యోగం పోయి పోలీసుల ఎదుట దోషిలా నిలబడ్డాడు. రఘునాథ్‌ చౌదరికి 47 ఏళ్లు, పుణెలోని కొత్రుద్‌లో ఓ స్కూల్లో ప్యూను. అతడి కన్ను హైస్కూల్‌ అమ్మాయిల మీద పడింది. ముగ్గురమ్మాయిలతో అవసరానికి మించిన చనువు తీసుకోవడం మొదలుపెట్టాడు.

అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వాళ్లు దూరంగా ఉంటే వీడియోలు చూపిస్తానంటూ తన స్మార్ట్‌ ఫోన్‌లో పోర్నోగ్రఫీ (అశ్లీల చిత్రాలు) చూపించి మీరూ నేర్చుకోవాలని వాళ్లను ఒత్తిడి చేస్తున్నాడు. వాళ్లంతా పదమూడు– పద్నాలుగేళ్ల వాళ్లే. ఈ బెడద నుంచి ఎలా బయటపడాలో తెలియక మూడు వారాలపాటు సతమతమయ్యారు. ఒకమ్మాయి ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో అతడి దురాగతం బయటపడింది. టీచర్ల విచారణలో మిగిలిన ఇద్దరమ్మాయిలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. స్కూలు యాజమాన్యం వెంటనే పోలీసులకు కంప్లయింట్‌ చేసి, రఘునాథ్‌ చౌదరిని ఉద్యోగం నుంచి తొలగించింది. బాధితులంతా మైనర్‌లు కావడంలో పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్స్‌ యాక్ట్, 2012) చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.  
– మంజీర 

మరిన్ని వార్తలు