మమ్మీ డాడీలకు 10 పరీక్షలు ఆర్ యూ రెడీ...

11 Apr, 2016 23:03 IST|Sakshi
మమ్మీ డాడీలకు 10 పరీక్షలు ఆర్ యూ రెడీ...

సమ్మర్ స్పెషల్

 

పిల్లలకు చెప్పాల్సిన పది కథలివి. కథలు చెప్పాలంటే క్లయిమాక్స్ తెలిసుండాలిగా. అదీ నీతి కథల్లో క్లయిమాక్సే కీలకం. అందుకే మమ్మీ డాడీలకి ఈ చిన్ని పరీక్ష. పిల్లలు పరీక్షలు అయిపోయాయి. ఇక మిగిలింది పెంపకం పరీక్షలే. కాపీయింగ్ చేయకుండా జవాబులు చూడకుండా మీ పిల్లలకి ఈ నీతి కథల క్లయిమాక్స్‌లు చెప్పి మంచి పేరెంట్స్ అనిపించుకోండి. ఎంజాయ్.

 

1 ఎవరి పని వారు చేయాలి...
ఒక ఊళ్లో ఒక రజకుడున్నాడు. అతడి దగ్గర ఒక కుక్క, గాడిద ఉన్నాయి. ఒక రోజు రాత్రి ఒక దొంగ ఆ రజకుడి ఇంటికి వచ్చాడు. గాడిద అది చూసి కుక్కతో- ‘లే..లే.. పెద్దగా మొరుగు. దొంగ వచ్చాడు’ అంది. దానికి కుక్క ‘నీ పని నువ్వు చూసుకో. ఇంతకాలం ఈ ఇంటి యజమానికి సేవ చేశాను. కాని ఏం చేశాడు? సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదు’ అంది. దానికి గాడిద ‘అవన్నీ ఎంచవలసిన సమయం ఇది కాదు. నీకు విశ్వాసం లేకపోతే నాకు ఉంది. నువ్వు మొరగకపోతే నేను ఓండ్ర పెడతాను’ అని పెద్దగా ఓండ్ర పెట్టసాగింది. అప్పుడేం జరిగిందంటే...

 

2 బడాయి తాబేలు...
ఒక చెరువులో కొన్ని కొంగలు, ఒక తాబేలు నివసించేవి. ఒకసారి ఆ ప్రాంతానికి కరువొచ్చింది. చెరువు మెల్లగా ఎండిపోవడం మొదలెట్టింది. కొంగలు ఒక్కొక్కటిగా వలస వెళుతున్నాయి. అది గమనించిన తాబేలు తనకు స్నేహితులైన రెండు కొంగల దగ్గరకొచ్చి- ‘మిత్రులారా... ఈ కష్టకాలంలో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు. మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్లండి. నీళ్లున్న వేరే చెరువుకు వచ్చి మీతో పాటు బతుకుతాను’ అంది. ‘తీసుకెళతాం. కాని ఎలా’ అన్నాయి కొంగలు. దాని తాబేలే మార్గం చెప్పింది. పొడవైన కర్ర తెచ్చి రెండు కొంగలను చెరొక కొన పట్టుకొమ్మంది. మధ్య భాగాన్ని తాను పళ్లతో కరిచి పట్టుకుంది. కొంగలు గాల్లో లేచాయి. వాటితో పాటు తాబేలు కూడా లేచింది. కింద నుంచి ఇది గమనించిన జనం ముక్కున వేలేసుకున్నారు. పిల్లలు వెంటబడ్డారు. చాలామంది ‘ఈ తెలివి ఎవరిది.. ఈ తెలివి ఎవరిది’ అని ఆశ్చర్యపోయారు. అప్పుడేమైందంటే...



3  నక్కా- కొంగ
ఒకసారి ఒక నక్క కనపడిన ఆహారాన్నల్లా పోగేసి విందు చేసుకుంది. తినే తొందరలో ఒక ఎముక దాని గొంతులో ఇరుక్కుంది. మింగుదామంటే లోపలికి పోదు. ఊయాలంటే బయటకు రాదు. ఈ అవస్థ నుంచి బయట పడేయమని చెరువు దగ్గర ఉన్న కొంగ దగ్గరకు వెళ్లింది. ‘మిత్రమా. నా గొంతులో ఉన్న ఎముక తీసి పెట్టు. ఊరికే వద్దు. నీ సాయానికి తగిన డబ్బు చెల్లిస్తాను’ అంది. కొంగ అందుకు అంగీకరించి నక్క గొంతులోకి తన ముక్కును పెట్టి ఎముకను లాగి బయట పడేసింది. అప్పుడేమైందంటే....

 

4 పాము- చలిచీమలు...
ఒక అడవిలో ఒక త్రాచు ఉండేది. అది ఎంతో పాశవికంగా పక్షుల గూళ్ల మీద దాడి చేసి వాటి గుడ్లు తినేస్తూ ఉండేది. పక్షులు దానిని ఏమీ చేయలేకపోయేవి. ఒకసారి అది దారిలో ఒక పెద్ద చీమల పుట్టను చూసింది. ఆ పుట్టనే తన ఇల్లు చేసుకోవాలనుకుంది. వెంటనే ఆ పుట్టలోకి దూరి అక్కడున్న చలిచీమలతో ‘ఎవరనుకున్నారు? మర్యాదగా అవతలికిపోండి. ఇక నుంచి ఈ పుట్ట నాది’ అంది. రాబోయేది వానాకాలం. చీమలు ఎంతో శ్రమ పడి ఆ పుట్టను నిర్మించుకున్నాయి. ఇప్పుడు త్రాచు వచ్చి చేరింది. పైగా చీమలు అంటూ చిన్న చూపు చూస్తోంది. అప్పుడేమైందంటే...

 

 5 ఐకమత్యమే మహాబలం
ఒక అడవిలో ఒక పావురాల గుంపు ఉండేది. ఒకరోజు అవి ఆకాశంలో ఎగురుతూ ఉండగా కింద నూకలు చల్లి కనిపించాయి. పావురాలు అవి చూసి నేల వాలుదామనుకున్నాయి. కాని వాటిలోని ఒక ముసలి పావురం- ‘తొందరపడకండి. అడవి మధ్యలో నూకలు ఉన్నాయంటే వాటి కింద వల ఉంటుంది. ఇది వేటగాడి పని’ అంది. అయినా కూడా పావురాలు మూర్ఖంగా వెళ్లి నూకల మీద వాలాయి. అంతే... వల వాటిని పట్టేసింది. దూరంగా వేటగాణ్ణి గమనించి వాటి పైప్రాణాలు పైనే పోయాయి. అప్పుడు ముసలి పావురం ‘బాధ పడకండి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనందరం రెక్కలు ఒక్కసారే ఆడించి పైకి ఎగురుదాం. వలతో సహా ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు’ అంది. వెంటనే పావురాలు తమ రెక్కల్లో బలం తెచ్చుకున్నాయి. అన్నీ కలిసి ఒక్కసారిగా ఎగిరాయి. వేటగాడు నోరు తెరుచుకుని చూస్తూ ఉండగానే అన్నీ ఆకాశంలోకి ఎగిరాయి. అప్పుడేమైందంటే...

 

 6 సింహం- చిట్టెలుక....
ఒక అడవిలో ఒక సింహం ఉండేది. దాని పేరు చెప్తే అందరికీ హడల్. ఒకరోజు అది ఒక చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఆ చెట్టు తొర్రలో ఒక ఎలుక ఉండేది. అది తన కలుగు నుంచి బయటకు వచ్చి ఆడుకోవడం మొదలెట్టింది. అది ఒకసారి సింహం చెవిని గిల్లడం మరోసారి సింహం తోక మీద గెంతడం చేసేసరికి సింహానికి మెలకువ వచ్చి ఆపైన కోపం వచ్చి చిటికెలో తన పంజాలో ఎలుకను బంధించేసింది. ‘నిన్ను తినేస్తా’ అంది సింహం. ‘బాబ్బాబు... ఈసారికి నన్నొదిలిపెట్టు. నన్ను నీ స్నేహితుణ్ణి అనుకో. ఒక స్నేహితుడిగా నీకు మేలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మేలు చేస్తా’ అంది చిట్టెలుక. అందుకు సింహం పెద్దగా నవ్వి ‘నీతో స్నేహమా... నువ్వు నాకు చేసే సాయమా’ అంది. కాని చిట్టెలుక ముఖం చూసి జాలితో వదిలేసింది.  ఇలా ఉండగా ఒకరోజు ఒక పెద్ద వేటగాడు అడవికి వచ్చాడు. సింహాన్ని వలేసి బంధించాడు. అప్పుడేమైందంటే....

 

7 నాన్నా... పులి...
ఒక రైతు తన కొడుకుతో పాటు పొలానికి వెళ్లాడు. దగ్గరలోనే అడవి ఉంది. అందువల్ల రైతు తన కొడుకుతో ‘బాబూ.. పులి తిరుగుతోంది. నీకు కనపడితే వెంటనే నాన్నా.. పులి అని పిలూ వస్తాను’ అని తన పనిలో పడ్డాడు. కొడుకు ఆడుకుంటూ తండ్రిని పరీక్షిద్దామని ‘నాన్నా... పులి’ అన్నాడు. వెంటనే తండ్రి పరిగెత్తుకొని వచ్చాడు. పులి లేదు. కొడుకు ఆకతాయిగా నవ్వాడు. మరికొద్ది సేపటి తర్వాత కొడుకు మళ్లీ ‘నాన్నా.. పులి’ అన్నాడు. తండ్రి పరిగెత్తుకొని వచ్చాడు. పులి లేదు. మూడోసారి నిజంగానే పులి వచ్చింది. అప్పుడేమైందంటే...

 

 8  ఆవు - పులి..
ఒక ఆవు అడవికి మేతకు వెళ్లి దారి తప్పింది. అది సరాసరి పులి తిరిగే ప్రాంతంలోకి వెళ్లింది. పులికి ఇది మంచి పలహారం. ఆవును పులి ఆపేసింది. ‘నిన్ను తినేస్తా’ అంది. అప్పుడు ఆవు ‘నాకు దొరికిన గడ్డిని నేను తినడం ఎంత న్యాయమో నీకు దొరికిన జీవాన్ని నువ్వు తినడం అంతే న్యాయం. అయితే ఒక్క మాట. నాకు ఈ మధ్యనే లేగదూడ పుట్టింది. దానికి ప్రతి సాయంత్రం నేను పాలు ఇవ్వాలి. ఇప్పుడు నన్ను వదిలితే వెళ్లి పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు నన్ను తినెయ్’ అంది. పులి నమ్మలేదు. ‘నువ్వు అబద్ధం చెప్తున్నావ్. నువ్వు మళ్లీ రావు’ అంది. ‘లేదు... వస్తాను’ అంది ఆవు. అప్పుడేమైందంటే...

 

 9  కాకి - కుండ
అనగనగా ఒక కాకి. ఆ కాకికి ఒకరోజు దప్పికేసింది. ఎగిరింది... ఎగిరింది... ఒక ఇంటి పెరటిలో ఒక కుండ కనిపించింది. కాకి అక్కడ వాలి కుండలోని నీళ్లు తాగాలని చూసింది. కాని నీళ్లు దాని ముక్కుకు అందలేదు. అవి అడుగున ఉన్నాయి. కాకికి దప్పికగా ఉంది. ఏం చేయాలి? ఒక ఆలోచన వచ్చింది. కాకి వెంటనే దగ్గరలో ఉన్న రాళ్లను ఏరి ఒక్కోరాయినీ ఆ కుండలో వేయడం మొదలెట్టింది. అప్పుడేమైందంటే...

 

 10 కుందేలు తెలివి
ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ప్రతిరోజూ తనకు ఆహారంగా అడవిలోని ఒక మూగ జీవిని కోరేది. ఎవరూ దానిని ఎదిరించలేక బాధపడుతుండేవారు. ఆరోజు సింహానికి ఆహారంగా వెళ్లాల్సిన బాధ్యత కుందేలు మీద పడింది. కుందేలుకు సింహం నోట చిక్కడం ఇష్టం లేదు. అందుకని అది సింహం దగ్గరకు చాలా ఆలస్యంగా వెళ్లింది. సింహం కోపంగా ‘ఎందుకింత ఆలస్యం?’ అని అడిగింది. కుందేలు వినయంగా ‘ప్రభూ, నా తప్పేమీ లేదు. నీలాంటివాడే ఒకడు నన్ను అటకాయించాడు. తప్పించుకుని వచ్చేసరికి ఆలస్యమైంది’ అంది. ‘నాలాంటివాడా? ఎక్కడ? చూపించు’ అంది సింహం. అప్పుడు ఏమైందంటే...

 

జవాబులు

1.    ఆ ఓండ్రకు నిద్ర చెడిన  రజకుడు వేళగాని వేళలో ఓండ్ర పెడతావా అని దుడ్డుకర్ర తీసుకొని గాడిదను నాలుగు బాదాడు. ఈ హడావిడికి దొంగ పారిపోయాడు.  నీతి: కుక్క పని కుక్క చేయాలి. గాడిద పని గాడిద చేయాలి అని.

2.   తాబేలు తబ్బిబ్బయ్యింది. ఈ ఘనత తనదే అని నలుగురికీ అరిచి చెప్పాలనుకుంది. ఆ మాట కోసమే ఏమరుపాటులో నోరు తెరిచింది. ఇంకేముంది? ఆకాశం నుంచి నేల మీద చతికిల పడింది. నీతి: గొప్పలు అన్ని వేళలా మంచివి కావు.

3.   నక్క ఎంతో సంతోషపడింది. అమ్మయ్య... కృతజ్ఞతలు అంది కొంగతో. మరి నా ఫీజు అంది కొంగ. నక్క హా..హా..హా.. అని పెద్దగా నవ్వి నా నోట్లో తల పెట్టి ప్రాణాలతో బయటపడ్డావ్. అదే నీ ఫీజు అంది. నీతి: దుష్టులతో జాగ్రత్త. ఎంత మేలు చేసినా కీడు చేస్తారు.

4.   చలిచీమలు అడవిలో ఉన్న తన బంధుగణాన్నంతా పిలిచాయి. వేలాదిగా చీమలు తరలి వచ్చాయి. అవన్నీ ఒక్కసారికి త్రాచును కమ్ముకున్నాయి. అత్యంత బలం గలదాన్నని విర్రవీగిన ఆ త్రాచు చలిచీమల చేత చిక్కి అర్ధంతరంగా చచ్చింది. నీతి: ఎవరినీ బలహీనులుగా చూడవద్దు.

5.   అవన్నీ అక్కడి నుంచి దూరంగా పెద్ద చెట్టు దగ్గర వాలాయి. ఆ చెట్టు తొర్రలో ఒక ఎలుక ఉంది. అది ఆ పావురాలకు స్నేహితుడు. పావురాలు దానితో తమ అవస్థ చెప్పగా వెంటనే ఎలుక వచ్చి తన పళ్లతో ఆ వలను తెచ్చి వాటికి విముక్తి ప్రసాదించింది. నీతి: ఐకమత్యమే మహాబలం.

6.   సింహం వల నుంచి విడిపించుకోవడానికి పెనుగులాడింది. ఇంతలో సింహానికి వచ్చిన కష్టాన్ని చిట్టెలుక గమనించింది. అంతే.. గబగబా వచ్చి తన వాడియైన పళ్లతో వలను తెంపేసి సింహాన్ని విముక్తం చేసింది. సింహానికి చిట్టెలుక మీద గౌరవం పెరిగింది. అప్పటి నుంచి ఎలుకను అది తన నిజమైన స్నేహితుడిగా స్వీకరించింది. నీతి: స్నేహం ఎంత చిన్నదైనా మేలే చేస్తుంది.

7.   పులి నిజంగానే వచ్చింది. కొడుకు భయపడిపోయి ‘నాన్నా..పులి’ అని పెద్దపెద్దగా అరిచాడు. కాని కొడుకు మళ్లీ ఆకతాయిగా అబద్ధం చెప్తున్నాడనుకొని తండ్రి రాలేదు. కొడుకును పులి తినేసింది. నీతి: అబద్ధం ప్రాణాంతకం.

8.   పులి అపనమ్మకంగానే వదిలేసింది. ఆవు వెంటనే ఇంటికి పరిగెత్తి దూడకు కడుపు నిండుగా పాలు తాపి ‘జాగ్రత్త తల్లి’ అని ముద్దులు పెట్టి వదల్లేక వదల్లేక అడవికి చేరుకుంది. ‘ఇక నాకు దిగుల్లేదు. తిను’ అంది. పులికి ఇది ఆశ్చర్యం. మాట మీద నిలబడే గొప్ప గుణం గల ఆవును చూసి దాని హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఆవును వదిలేసింది. అంతేకాదు అప్పటి నుంచి అది అనవసర వేట కట్టిపెట్టింది. నీతి: నిజాయితీకి మించిన వ్యక్తిత్వం లేదు.

9.   రాళ్లన్నీ అడుగుకు వెళ్లాయి. కుండలోని నీళ్లు పైకి వచ్చాయి. కాకి హాయిగా తన దప్పిక తీర్చుకుని ఎగిరిపోయింది. నీతి: శక్తి కన్నా యుక్తి మేలు.

10. కుందేలు నేరుగా సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్లింది. ‘అదిగో చూడు’ అని బావిలోకి చూపించింది. సింహం తొంగి చూసి, తన నీడనే ప్రత్యర్థి అనుకుని దానితో పోరాటానికి ఒక్క ఊపున బావిలో దూకి చచ్చింది. నీతి: మూర్ఖులకు ముప్పు తప్పదు.

 

మరిన్ని వార్తలు